కేటీఆర్ నోట స్థానిక ఎన్నికల బహిష్కరణ మాట.. సంకేతమేంటి?
posted on Sep 23, 2025 @ 10:51AM
స్థానిక ఎన్నికలలోఓటమి భయం బీఆర్ఎస్ ను వెంటాడుతోందా? ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలలో పోటీ చేస్తే ఆబోరు దక్కదని భయపడుతోందా? ఏదో ఒక సాకు చెప్పి స్థానిక ఎన్నికలను బహిష్కరించాలన్న వ్యూహంతో ఉందా? అన్న ప్రశ్నలకు తాజాగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ప్రకటనను బట్టి ఔననే అనాల్సి వస్తున్నది. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుంటే స్థానిక ఎన్నికలకు బహిష్కరించాలని కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఆర్ఆర్ఆర్ బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ బాధితులంతా ఐక్యంగా ఉండాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తే మీ సమస్య ఢిల్లీ వరరూ వెడుతుందన్నారు. సమస్యలపై మాట్లాడటానికి తమకు అసెంబ్లీలో మైక్ ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కత్తి వాళ్ల చేతిలో పెట్టి యుద్ధం బీఆర్ఎస్‌ను చేయమంటే ఎలా అని కేటీఆర్ ప్రజలను నిలదీశారు.
మొత్తం మీద కేటీఆర్ మాటలు ఆయనను కలిసిన బాధితులకు ఎలాంటి ఊరటను ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కత్తి వాళ్ల చేతుల్లో పెట్టి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను గెలిపించిన మీ తరఫున బీఆర్ఎస్ ఎందుకు పోరాడుతుంది అన్నట్లుగా ఉన్నాయని అంటున్నారు. మొత్తం మీద కేటీఆర్ నోట.. బహిష్కరణ మాట రావడమే ఆయనలోని ఓటమి భయాన్ని ఎత్తి చూపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.