బొత్స తెలిసే మాట్లాడుతున్నారా?
posted on Sep 23, 2025 @ 11:16AM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ పార్టీ అధినేత.. బెంగళూరు ప్యాలస్ కే ఎక్కువగా పరిమితమై.. అడపాతడపా తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి చేతులు దులిపేసుకుంటున్నారు. జిల్లాల పర్యటనలు, కార్యకర్తలకు సమయం కేటాయింపు, ఆందోళనలు, ఉద్యామాలు అంటూ అప్పడప్పుడు ప్రసంగాలు చేసినా ఆయన ప్యాలెస్ ల గడపదాటి ప్రజలలోకి మాత్రం రావడం లేదు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి దిశ, దశ లేకుండా పోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషణలు చేస్తున్నారు.
తాజాగా మండలిలో బొత్స సత్యనారాయణ ప్రసంగం వింటే.. ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్ధమౌతుందది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీలో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. మండలిలో వైసీపీ పక్ష నాయకుడు కూడా. అసెంబ్లీలో లేకపోయినా, మండలిలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఉంది. అంటే బొత్స సత్యనారాయణ మండలిలో ప్రతిపక్ష నేత కూడా.
అలాంటి బొత్స సత్యనారాయణ తన తీరుతో స్వయంగా నవ్వుల పాలు కావడమే కాకుండా వైసీపీని కూడా నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై, వైఫల్యాలపై విమర్శలు చేయాల్సిందే. అయితే బొత్స సత్యనారాయణ విమర్శలు మాత్రం ప్రభుత్వాన్ని కాకుండా సొంత పార్టీనే చిక్కుల్లో పడేసేవిగా ఉంటున్నాయి. అవగాహనా రాహిత్యమో, మరోటో కానీ ఆయన కార్మిక చట్టాల మార్పు కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లుపై మండలిలో చేసిన విమర్శలు సొంత పార్టీ వారే తలలు బాదుకోవలసిన పరిస్థితి తీసుకువచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసిందంటూ ఆయన ఫైరయ్యారు. కార్మికులు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలనడమేంటి? అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ సభ్యులకే దిమ్మతిరిగింది. అధికార పక్ష సభ్యులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ విషయమేమిటంటే.. తెలుగుదేశం కూటమి సర్కార్ తీసుకు వచ్చిన బిల్లు కార్మికులు, ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడంతో పాటు..పరిశ్రమలు నిరంతరం పని చేయడానికి దోహదం చేస్తుంది. ఎక్కడా కార్మికుల పని గంటలను పెంచలేదు. గతంలో కార్మికులు వారానికి 48 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బిల్లుతో కూడా కార్మికుల పనిగంటలు పెరగడం లేదు. కావాలనుకుంటే.. కార్మికులు రోజుకు పది గంటలు పని చేసుకోవచ్చు.. కానీ వారం మొత్తానికి కలిపి వారి పనిగంటలు 48కి మించకూడదు. అలా మించినట్లైతే కంపెనీలు ఓవర్ టైమ్ చెల్లించాలి. ఇదీ తెలుగుదేశం కూటమి సర్కార్ కార్మిక చట్టాలలో చేసిన మార్పు.
ఈ మార్పు కార్మికులకు అనుకూలంగా ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే బొత్స మాత్రం ప్రభుత్వంపై విమర్శ చేస్తే చాలు.. ఆ విమర్శకు హేతువు ఉండాల్సిన అవసరం లేదన్నట్లు.. కార్మికులు రోజుకు పన్నెండు గంటలు పని చేయాలా? ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వం అంటూ ఓ ప్రసంగొం చేసేసి నవ్వులపాలయ్యారు.