జగన్ పై తిరుగుబాటేనా?.. బొత్స ఏం చేస్తున్నారు?
posted on Sep 23, 2025 @ 9:55AM
వైసీపీలో పై నుంచి కింది దాకా గందరగోళం నెలకొంది. అధినేత జగన్ ఒకటి చెబితే.. ఆ పార్టీలోని కీలక నేతలు మరొకటి చేస్తున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. మొత్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. నేడు బొత్స సత్యనారాయణ ఇరువురూ కూడా జగన్ ఆదేశాలను భిన్నంగానే వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీకి ఎమ్మెల్యేల హాజరు విషయంలో జగన్ చెప్పిన మాట ఆయనకు అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖాతరు చేయలేదు.. సరికదా, జగన్ రాకుండా తాను అసెంబ్లీకి వెళ్లడమేంటి? అంటూ పార్టీ నేతల వద్ద ఒకింత అసహనంతో వ్యాఖ్యలు చేశారు.
అదలా ఉంచితే.. తాజాగా వైసీపీ సీనియర్ మోస్ట్ నాయకుడు, మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నేత అయిన బొత్స సత్యనారాయణ జీఎస్టీ రిఫార్మ్స్ విషయంలో జగన్ కు పూర్తి విరుద్ధమైన స్టాండ్ తీసుకున్నారు. దీంతో బొత్స తీరుపై జగన్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోందని పార్టీ నేతలే అంటున్నారు. అసలు జగన్ పై బొత్స తిరుగుబాటు చేస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఇందుకు బొత్స మండలిలో వ్యవహరిస్తున్న తీరే కారణమని అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ విషయంలో వైసీపీ స్టాండ్ కు పూర్తి భిన్నంగా మండలిలో బొత్స మాట్లాడడమే ఇందుకు కారణం. జీఎస్టీ సంస్కరణలను ప్రశంసిస్తూ జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బొత్స మాత్రం మండలిలో కేంద్రాన్ని ప్రశంసిస్తూ ప్రభుత్వ తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. బీఏసీ సమావేశంలో మండలిలో ప్రభుత్వం చేసేజీఎస్టీ అనుకూల తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకిస్తుందని చెప్పడంతో వైసీపీ నేతలు, శ్రేణులు కంగుతిన్నారు. అయితే మండలిలో వైసీపీ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించలేదనుకోండి అది వేరే సంగతి. కానీ బొత్స ఏకపక్షంగా పార్టీ లైన్ కు వ్యతిరేకంగా బీఏసీలో చేసిన వ్యాఖ్యలు మాత్రం జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తి చే సినట్లు తెలిసింది.
జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఆయన ఎదుర్కొంటున్న కేసులలో అరెస్టు నుంచి రక్షణ కావాలంటే బీజేపీ సహకారం, అండ చాలా అవసరం. ఆ విషయం తెలిసి కూడా బొత్స సత్యనారాయణ జీఎస్టీ సంస్కరణలను వైసీపీ వ్యతిరేకిస్తుంది అని అన్నారంటే.. దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద బొత్స తీరు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఒక కార్యక్రమంలో ఆయన ఏపీసీసీ అధినేత వైఎస్ షర్మిలతో ఆత్మీయంగా ముచ్చటించడం, అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుతో సన్నిహితంగా వ్యవహరించడం జగన్ ను కంగారు పెడుతున్నాయి. మొత్తం మీద వైసీపీలో పరిస్థితి జగన్ వర్సెస్ బొత్స అన్నట్లుగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.