టీఆర్ఎస్ ఒంటరిపోరాటానికి సిద్ధం
posted on Apr 12, 2013 @ 10:19PM
ఈ రోజు తెరాస పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం తరువాత ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో తమ పార్టీ ఏపార్టీతో పొత్తులు పెట్టుకోదని తెలిపారు. ఇక విజయశాంతి టికెట్ విషయంలో మీడియాలో ప్రచారం అవుతున్న పుకార్లకు తెరదించుతూ తామిరువురం మళ్ళీ పోటీ చేస్తామని అన్నారు. కానీ, మళ్ళీ లోక్ సభకే పోటీ చేస్తారా లేక శాసన సభకి చేస్తారా అనే సంగతి చెప్పలేదు. వచ్చేఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాలలో ప్రధానపాత్ర పోషించాలని ఆశిస్తున్న కేసీఆర్ తను మాత్రం శాసనసభకు పోటీచేయవచ్చును.
ఇక ప్రజలలో తెలంగాణ సెంటిమెంటుని ఎప్పుడు నిద్రలేపి ఏవిధంగా వాడుకోవాలో కేసీఆర్ కు తెలిసినంత బాగా మరొకరికి తెలియదు. గనుకనే, వచ్చేఎన్నికలలో దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకొని వీలయినన్ని ఎక్కువ సీట్లు గెలవాలనే ఆలోచనతోనే ఒంటరి పోరుకి తెరాస సిద్దపడుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీపట్ల ప్రజలలోఉన్నవ్యతిరేకతకు తోడు, ఆ పార్టీ తెలంగాణ ఇవ్వకుండా తమని ద్రోహం చేసిందనే భావాన్ని కూడా ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్ళగలిగితే, ఇక కాంగ్రెస్ పార్టీ తమకు గట్టిపోటీ ఈయలేదని తెరాస ఆలోచన చేస్తోంది. భాజపా తమ పార్టీకి ఓటేస్తే తెలంగాణ ఇస్తామని చెపుతున్నపటికీ, ఆ పార్టీకి ఓట్లు పడకుండా తెరాస తను చేయగలిగినంతా తప్పక చేస్తుంది.
ఇక వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగే సమయానికి జైలు నుండి బయటపడగలితే తప్ప ఆ పార్టీ నుండి తమకు తెలంగాణలో గట్టిపోటీ ఉండకపోవచ్చునని తెరాస భావిస్తోంది. ఒకవేళ జగన్ జైలు నుండి విడుదల అయినా కూడా తెలంగాణ జిల్లాలలో అతని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చును. ఇక, తెలంగాణలో తెరాసకు గట్టి పోటీ ఇచ్చేది ఒక తెదేపా మాత్రమే. అయితే, తెలంగాణపై తమకున్న పట్టు ఆ పార్టీకి లేదని గ్రహించిన కేసీఆర్, తెలంగాణలో పూర్తి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్న ఈ తరుణంలో ఇక వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకొని, తన విజయంలో వేరే పార్టీలకి భాగం పంచడం అనవసరం అనే ఆలోచనతోనే ఒంటరిపోరుకి సిద్ధం అయినట్లున్నారు. కానీ, సకల మాయోపాయాలకు పెట్టింది పేరయిన కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఎన్నికల సమయానికి తెలంగాణ అనుకూల ప్రకటన చేసి కేసీఆర్ ఎత్తుకి పైఎత్తు వేసినా ఆశ్చర్యం లేదు.