సెంటిమెంట్‌పై విడదీస్తే దేశం ముక్కలే: కావూరి
posted on Mar 26, 2011 @ 9:46AM
హైదరాబాద్: చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం కాదని, అయితే దానికంటూ ఒక శాస్త్రీయమైన విధానం ఉండాలన్నదే తమ అభిప్రాయమని ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు అన్నారు. సెంటిమెంట్‌పై రాష్ట్రాలను విభజించుకుంటేపోతే దేశం ముక్కలవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసేందుకు శుక్రవారం శాసనసభకు వచ్చిన కావూరి ఆయనతో అరగంటపాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక సీమాంధ్ర నుంచి కనీసం ఇంటికి ఒక్కరైనా హైదరాబాద్‌లో స్థిరపడ్డారని, అలాగే హైదరాబాద్ తమదన్న నమ్మకంతో సీమాంధ్ర నుంచి ఎంతోమంది వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నారు. తెలుగువారంతా ఒక్కటేనని అనుకున్నాం తప్పితే, తాము ఎప్పుడూ ప్రాంతాలవారిగా పక్షపాతం చూపలేదని పేర్కొన్నారు. ప్రధానిగా పివి నరసింహారావు, రాష్ట్రపతిగా నీలం సంజీవరెడ్డి అయితే తమ తెలుగువారనని గర్వపడ్డాం తప్పితే, తమకు ఎలాంటి భేదభావం లేదని అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన రహస్య నివేదికపై స్పందిస్తూ, దానిపై హర్షంకానీ, వ్యతిరేకతకానీ లేదని అన్నారు. తెలంగాణవాదులు శ్రీకృష్ణ కమిటీని తప్పుపట్టడాన్ని ప్రస్తావిస్తూ, వారు ఎవరినీ వ్యతిరేకించలేదు, సోనియాగాంధీని తప్పుబట్టారు, ప్రధాని మన్మోహన్‌సింగ్‌నూ తప్పుబట్టారని వ్యాఖ్యానించారు.