కవిత సస్పెన్షన్.. పొలిటికల్ గా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కు బిగ్ ఇష్యూనే!
posted on Sep 3, 2025 @ 10:37AM
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కవిత సస్పెన్షన్ ఒక పొలిటికల్ హీట్ గా మారడానికి ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని తక్కువ చేస్తే ఆమె గతంలో మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కారణం.
సరే ఆ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకూ కవిత సస్పెన్షన్ కేవలం సస్పెన్షన్ కాదు.. పార్టీ చీలికకు దారి తీసే ఒక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి పార్టీ అధినేత.. కేసీఆర్ కవిత సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదనీ అంటున్నారు. కవిత తీరు పట్ల కేసీఆర్ ఎంతగా విసిగిపోయి ఉంటారు, పార్టీ ఉనికికే ముప్పుగా ఆమె వ్యాఖ్యలు చేయడం ఆయనను వ్యక్తిగతంగా ఎంతగా మానసికక్షోభకు గురై ఉటారో.. ఆమెను సస్పెండ్ చేయడం ద్వారా తెలుస్తోందని అంటారు.
కవితపై బీఆర్ఎస్ వేసిన సస్పెన్షన్ వేటు కేవలం ఒక క్రమశిక్షణ చర్య మాత్రమే కాదనీ, భావోద్వేగం, మానసిక వేదనల ఫలితమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. కవిత సస్పెన్షన్ తో కేవలం పార్టీలోనే కాదు.. కేసీఆర్ కుటుంబంలో కూడా చీలికకు దర్పణమని చెబుతున్నారు. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఇదేనని చెప్పవచ్చు.
కుమార్తె తీరుతో పార్టీ ప్రతిష్ట మసకబారడమే కాకుండా.. ఇలాంటి పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారంటున్నారు. అందుకే గతంలో అంటే పార్టీ పరాజయం తరువాత ఆమె పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, నేరుగా సొంత సోదరుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించినా, పార్టీ లైన్ కు భిన్నంగా బీసీ రిజర్వేషన్లను సమర్ధించినా కేసీఆర్ ఆమెపై చర్యలకు ఉపక్రమించలేదు సరికదా.. కనీసం మందలించను కూడా మందలించకుండా వెనకేసుకు వచ్చిన చందంగా వ్యవహరించారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. కవిత సస్పెన్షన్ పార్టీని ఓ కుదుపు కుదిపిందనడంలో సందేహం లేదు.
సొంత కూతురిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా కేసీఆర్ కుటుంబ సంబంధాలు, రక్త సంబంధం కంటే పార్టీని రక్షించడమే ముఖ్యమని పార్టీ శ్రేణులకు చాటారని ఎంతగా చెప్పుకుందామని ప్రయత్నించినా జరగాల్సిన డ్యామేజి అయితే జరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు కవిత సొంత దారి చూసుకుంటున్నారని వినిపిస్తోంది. అంటే సొంతంగా కొత్త పార్టీ పెట్టి రాజకీయంగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎప్ ప్రభ మసకబారినట్లేనని అంటున్నారు. కవితపై విమర్శలు గుప్పించడం, ఆమె విధానాలను తప్పుపట్టడం ఎంత కాదనుకున్నా.. కేసీఆర్, కేటీఆర్ లకు ఒకింత ఇబ్బందికరమేనని చెప్పాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి తెలంగాణ రాజకీయాలలో కవిత సొంత పార్టీ సమీకరణాలను మార్చడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఉంటున్న కేసీఆర్.. ఈ పరిణామాలతో మరింత సైలెన్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే.. బీఆర్ఎస్ పుంజుకోవడం అంత సులువు కాదని కూడా అంటున్నారు.