బీఆర్‌ఎస్ పార్టీలో కవిత ఉంటే ఎంత.. పోతే ఎంత : సత్యవతి రాథోడ్
posted on Sep 2, 2025 @ 7:56PM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేగు బంధం కన్న పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సత్యవతి రాథోడ్‌తో పాటు టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, నేతలు రజని సాయిచంద్, శీలారెడ్డి, చారులత, నిరోషా తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత మూడు నెలలుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూశామని అన్నారు. గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మూడు నెలలుగా కవిత తన తీరుతో బీఆర్‌ఎస్ పార్టీకి ఎంతో నష్టం చేశారని ఆరోపించారు. ఆమే కామెంట్స్ పార్టీ శ్రేణులకు ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. నేడు కవితను సస్పెండ్ చేస్తూ తమ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం అందరినీ, మరీ ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందని సత్యవతి రాథోడ్ అన్నారు. కార్యకర్తల కన్నా ఫ్యామిలీ ఎక్కువ కాదనే విషయం మళ్లీ స్పష్టమైంందని అన్నారు.
కవితకు నచ్చజెప్పాలని చూసినా.. ఆమె వినకపోవడం వల్లే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ లైన్ దాటిటే ఎవరికైనా ఇదే శిక్ష అనే సందేశాన్ని అధినేత ఇచ్చారని తెలిపారు. పార్టీ గులాబీ దళపతి మళ్లీ జనాల్లోకి రావాలని బలంగా కొరుకుంటున్న తరుణంలో కవిత పార్టీని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లు కేసీఆర్‌కు కుడి ఎడమ భుజాల్లాంటి వారని అభివర్ణించారు. వారిద్దరిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని సెటైర్లు వేశారు. శాసన సభలో హరీష్ రావు ఒంటిచేత్తో రేవంత్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారని కొనియడారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని కొనియాడుతుంటే.. ఆయనను కవిత విమర్శించడంతో ఆమె ఏ లైన్లో ఉన్నారో అర్థం అవుతోందని సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కూతురుగా కవితకు ఎక్కడికి వచ్చినా ప్రజలు ఘన స్వాగతం పలికారని సత్యవతి రాథోడ్ అన్నారు. కానీ, ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోలేకపోయిందని తెలిపారు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అనే మాట మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా పార్టీ కేడర్ కవిత ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అంటూ సమాధానం ఇచ్చిందని అన్నారు.