ఇక్కడ ప్లీనరీ.. అక్కడ కవిత.. అయ్యయ్యో వద్దమ్మా!
posted on Oct 23, 2021 @ 11:29AM
అక్టోబర్ 25, సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీ. హైదరాబాద్‌లో జోర్‌దార్‌గా ఏర్పాట్లు. గులాబీ పార్టీ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా జరుపుకునేందుకు భారీ ఎత్తున సన్నాహాలు. ప్లీనరీలో ఆరు వేల మందికి గులాబీ దళపతి కేసీఆర్ నేరుగా దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ తరఫున ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే.. కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మాత్రం ప్రస్తుతం దుబాయ్‌లో ఉండటం ఆసక్తికరంగా మారింది. గుసగుసలకూ కారణం అవుతోంది. సరిగ్గా.. సమయం చూసి మరీ కవిత దుబాయ్‌లో ప్రోగ్రామ్ పెట్టుకున్నారా? కావాలనే ప్లీనరీ టైమ్‌లో హైదరాబాద్‌లో లేకుండా చూసుకున్నారా? కల్వకుంట్ల కుటుంబంలో కుంపటి మరింత రాజుకుందా? నాన్న, అన్నతో చెల్లికి గ్యాప్ బాగా పెరిగిందా? ఇలా అనేక ప్రశ్నలు. ఇంతకీ కవిత దుబాయ్ ఎందుకు వెళ్లారంటే...
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో 23వ తేదీ రాత్రి ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయిలోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించనున్నారు. శనివారం రాత్రి 9.40 గంటలకు, 10.40 గంటలకు రెండు సార్లు బుర్జ్ ఖలీఫాపై 3 నిమిషాల పాటు బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. దేశవిదేశాలకు చెందిన లక్షలాది మంది ఒకేసారి బుర్జ్ ఖలీఫా అతిపెద్ద స్క్రీన్‌పై బతుకమ్మను వీక్షించనున్నారు. బతుకమ్మ వేడుకల ద్వారా మన సంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పేందుకే ఎమ్మెల్సీ కవిత ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ జాగృతి వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం కోసం కవిత ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఇదీ దుబాయ్ మేటర్.
కట్ చేస్తే.. అదంతా ఓకే. దుబాయ్.. బుర్జ్ ఖలీఫా.. బతుకమ్మ.. కవిత.. జాగృతి.. అంతా బాగేనే ఉంది కానీ.. టైమింగే ఏదో తేడా కొడుతోందని అంటున్నారు. టీఆర్ఎస్ 20 ఏళ్ల వేడుకల సమయం. ప్లీనరీతో పార్టీలో పండుగ సందడి కనిపిస్తోంది. ఈవెంట్ సోమవారమే అయినా.. ఇప్పటి నుంచే హైదరాబాద్ మొత్తం గులాబీ మయం అయిపోయింది. ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రొగ్రామ్‌కు గతంలో దగ్గరుండి ఏర్పాట్లు చూసుకున్న కవిత.. ఈ సారి మాత్రం హైదరాబాద్ వీడి దుబాయ్ వెళ్లిపోయారు. జస్ట్.. బతుకమ్మ కోసమే వెళ్లారా? లేక.....?
అదే టాక్ నడుస్తోంది ఇప్పుడు. కవిత కావాలనే దుబాయ్ వెళ్లారని అంటున్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయని.. పార్టీలో కవితకు ప్రాధాన్యం లేదని.. తండ్రీకొడుకులు ఆమెతో మాట్లాడటం లేదని చెబుతున్నారు. కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టలేదు. ప్రగతిభవన్‌లో ఇంటి ఆడబిడ్డ బతుకమ్మ ఆడటానికి రాలేదు. ఎప్పటి నుంచో నడుస్తున్న గుసగుసలకు ఈ రెండు సందర్భాలు మరింత ఆజ్యం పోశాయి. పైగా, ఇటీవల శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలపై ఎమ్మెల్సీ కవిత గట్టిగా ప్రశ్నించడం మరింత అనుమానాలకు కారణమైంది. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడం కవితకు ఇష్టం లేదని అందుకే వారి మధ్య తేడా వచ్చిందని అంటున్నారు. ఆస్థి తగాదాల వల్లే వైరం పెరిగిందని కూడా చెబుతున్నారు. కారణమేంటో తెలీదు కానీ.. కవితను కేసీఆర్, కేటీఆర్ పక్కన పెట్టేశారనే మాత్రం వాస్తవమే..అంటున్నారు.
ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సందర్భంలో కవిత మరోసారి ఇలాంటి ప్రచారానికి ఊతమిచ్చేలా వ్యవహరించారని అంటున్నారు. బతుకమ్మ ముగిశాక ఇన్ని రోజుల తర్వాత.. ఇప్పుడు కావాలనే దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రోగ్రామ్ పెట్టుకుని.. హైదరాబాద్‌లో లేకుండా చూసుకున్నారని చెబుతున్నారు. అయతే, శనివారం రాత్రితో దుబాయ్ ప్రోగ్రామ్ ముగుస్తుంది. మరి, ఆ వెంటనే ఆదివారం తిరిగి హైదరాబాద్ వచ్చేస్తారా? సోమవారం పార్టీ ప్లీనరీలో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారా? అనేదే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. కవిత సోమవారం నాటికి వచ్చే ఛాన్సెస్ తక్కువేనని తెలుస్తోంది. సోమవారం టీఆర్ఎస్ ప్లీనరీకి కవిత రాకపోతే మాత్రం.. ఇక పార్టీలో ఆమె ఖేల్ ఖతం.. దుకాణం బంద్ అన్నట్టే...అంటున్నారు.