ఢిల్లీకి చంద్రబాబు బృందం.. జగన్ రెడ్డి ప్రభుత్వంలో కలవరం!
posted on Oct 23, 2021 @ 11:00AM
ఆంధ్రప్రదేశ్ లో కాక రేపుతున్న రాజకీయాలు ఢిల్లీకి చేరుతున్నాయి. వైసీపీ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని ఆరోపిస్తున్న తెలుగు దేశం పార్టీ దేశ రాజధాని కేంద్రంగా పోరాటానికి సిద్ధమవుతోంది. జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, నిరంకుశ పాలనపై కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేయబోతోంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ఆ పార్టీ బృందం ఈ నెల 25న ఢిల్లీ వెళ్లనుంది. రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. ఎంపీలతో సహా సుమారు పది మంది నేతలు ఈ బృందంలో ఉంటారు.
రాష్ట్రపతి కోవింద్‌తో పాటు పలువురు పెద్దలను కలసి మాదకద్రవ్యాలు, వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. రాష్ట్రపతి సోమవారం అపాయింట్‌మెంట్ ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని, హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ఆ పార్టీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడటానికి రాష్ట్రపతి పాలన విధించాలని ఆ పార్టీ కోరనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లను టీడీపీ బృందం కోరింది. వాళ్లను కూడా కలిసి వైసీపీ ప్రభుత్వ విధానాలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులపై ఫిర్యాదు చేయనుంది. టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిపై సీబీఐ విచారణ జరపాలని కోరే అవకాశం ఉంది.
మంగళవారం వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు నెల్లూరు, విశాఖ, గుంటూరు పార్టీ ఆఫీసులపై దాడికి పాల్పడ్డాయి. విజయవాడలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేసి విద్వంసం స్పష్టించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇండ్ల దగ్గర దాడులకు ప్రయత్నించాయి. ఈ ఘటనలతో ఏపీ ఉధ్రిక్తతంగా మారింది. వైసీపీ దాడులకు నిరసనగా టీడీపీ కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు బుధవారం రాష్ట్ర బంద్ నిర్వహించింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 36 గంటల నిరసన దీక్ష చేశారు చంద్రబాబు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు దీక్షకు అనూహ్య స్పందన వచ్చింది. టీడీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం కిటకిటలాడింది. ఉదయం 6గంటలకు మొదలైన కార్యకర్తల రాక.. సాయంత్రానికి విపరీతంగా పెరిగిపోయింది. కార్యాలయం లోపల కాలుమోపలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో మినీ మహానాడు మాదిరిగా మారిపోయింది. అమరావతి దళిత జేఏసీ కూడా ప్రదర్శనగా తరలివచ్చింది. దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీనే గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ప్రశ్నిస్తే దాడులు చేసే అరాచక పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి దమ్ముంటే, పోలీసులు లేకుండా టీడీపీ కార్యాలయం వైపు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సవాల్ చేశారు. ఎవరూ లేని సమయంలో టీడీపీ ఆఫీసు పై రాళ్లేసి.. ఉద్యోగులను కొట్టి వెళ్లడం కాదు.. దమ్ముంటే ఇప్పుడు రండి.. మా సత్తా చూపిస్తాం’ అని హెచ్చరించారు.
ఏపీలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంద. అందుకే చంద్రబాబు దీక్షకు భారీ స్పందన వచ్చిందని, కరోనా భయపెడుతున్నా జనాలు భారీగా వచ్చి మద్దతు తెలిపారని చెబుతున్నారు. ఇదే స్పీడుతో జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రిని కలిసి ఏపీ పరిస్థితులను వివరించబోతున్నారు. టీడీపీ బృందం హస్తిన పర్యటనతో వైసీపీలో కలవరం మొదలైందని తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్నపరిణామాలతో ఇప్పటికే చాలా డ్యామేజీ జరిగిందని, టీడీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసే తమకు ఇబ్బందులు తప్పవనే భయాందోళన జగన్ శిబిరంలో కనిపిస్తుందని అంటున్నారు.