అక్టోబ‌రు 22 నుంచి కార్తీకమాస హోమ మహోత్సవాలు

 

పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబ‌రు 22 నుంచి న‌వంబరు 20వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేషపూజ హోమ మహోత్సవాలు జరుగనున్నాయి. 

అక్టోబరు 22వ తేదీన హోమ మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. అక్టోబ‌రు 22 నుంచి 23వ తేదీ వరకు మొదటగా శ్రీగణపతిస్వామివారి హోమం, అక్టోబ‌రు 24 నుండి 26వ‌ తేదీ వ‌ర‌కు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, అక్టోబ‌రు 27న శ్రీదక్షిణామూర్తి స్వామివారి హోమం,  అక్టోబ‌రు 28న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి.

అదేవిధంగా అక్టోబరు 29న శ్రీకాలభైరవ స్వామివారి హోమం, అక్టోబరు 30 నుంచి న‌వంబ‌రు 7వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), న‌వంబరు 8 నుంచి 18వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), న‌వంబ‌రు 19న ధ‌ర్మ‌శాస్త్ర హోమం, న‌వంబ‌రు 20న శ్రీచండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

 గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది. ఈ హోమాల్లో భాగంగా అక్టోబరు 27న శ్రీ వళ్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్యస్వామివారి కల్యాణం, నవంబరు 18న మాస శివరాత్రి నాడు శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం జరుగనున్నాయి.  గృహస్తులు (ఇద్దరు) రూ.500/- చెల్లించి ఒక్కో కల్యాణంలో పాల్గొనవచ్చు.

హోమ మహోత్సవాలకు విశేష ఆదరణ 

    శ్రీ కపిలేశ్వరాలయంలో టీటీడీ నిర్వహిస్తున్న హోమ మహోత్సవాలకు భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. 2012వ సంవత్సరంలో ఈ హోమాలను టీటీడీ ప్రారంభించింది.  ఈ హోమాల్లో పాల్గొంటున్న భక్తుల సంఖ్య ప్రతి ఏడాదీ పెరుగుతోంది. ఈ హోమాలను సొంతంగా చేయించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పనికావడంతో భక్తుల సౌకర్యార్థం సామూహికంగా ఈ హోమాలను టీటీడీ నిర్వహిస్తోంది.


 

ఎలాన్ మస్క్ మరో అరుదైన రికార్డు

  టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. 700 బిలియన్ డాలర్ల పైచిలుకు నికర సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. టెస్లా పారితోషికానికి సంబంధించి కోర్టులో అనుకూల తీర్పు రావడంతో ఇటీవల ఆయన సంపద అమాంతం పెరిగింది .2018 నాటి టెస్లా పారితోషికానికి సంబంధించి ఇటీవల కోర్టులో అనుకూల తీర్పు వెలువడటంతో మస్క్ నికర సంపద 749 బిలియన్‌ డాలర్‌లకు చేరింది  2018లో టెస్లా సంస్థ మస్క్‌కు ఆఫర్ చేసిన పారితోషికాన్ని పునరుద్ధరిస్తూ డెలావేర్ సుప్రీం కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.  ఈ ప్యాకేజీ చెల్లదంటూ అంతకుముందు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టేసింది. మస్క్‌కు పారితోషికం కింద కొన్ని స్టాక్ ఆప్షన్స్ ఇచ్చేందుకు టెస్లా బోర్డ్ 2018లో అంగీకరించింది. అప్పట్లో వీటి విలువ 56 బిలియన్ డాలర్లు.అయితే, ఈ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ ఓ షేర్ హోల్డర్ కోర్టును ఆశ్రయించారు. ఈ ప్యాకేజీని ఆమోదించిన టెస్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మస్క్‌కు సన్నిహితులని ఆరోపించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించింది. అంతటి పారితోషికాన్ని మంజూరు చేయడం అసాధారణమని, అది చెల్లదని తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో మస్క్ పైకోర్టును ఆశ్రయించారు.  2024లో సంస్థ షేర్ హోల్డర్‌లు మరోసారి ఈ ప్యాకేజీని అంగీకరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని రద్దు చేస్తే ఆరేళ్లుగా తను పడ్డ శ్రమ వృథా అయిపోతుందని అన్నారు. దీంతో, డెలావేర్ సుప్రీం కోర్టు మస్క్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. ఇటీవలే టెస్లా బోర్డు మస్క్‌కు భారీ పారితోషికాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ పనితీరు మెరుగయ్యే కొద్దీ గరిష్ఠంగా ట్రిలియన్ డాలర్ల పారితోషికం చెల్లించేందుకు బోర్డు అంగీకరించింది. అయితే, ఈ మొత్తం అందాలంటే ఏఐ, రోబోటిక్స్, మార్కెట్ వృద్ధిలో టెస్లా సంస్థ కొన్ని లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో శుక్రవారం మస్క్ నికర సంపద విలువ 749 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మస్క్ తరువాతి స్థానంలో ఉన్న గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ నికర సంపద 500 బిలియన్ డాలర్లు.

ఇక మొబైల్‌లో చూపించే రైల్వే టికెట్లు చెల్లవు

  ప్రయాణికుల టికెట్లను తనిఖీ చేస్తున్న సమయంలో టికెట్ ఇన్స్పెక్టర్ కు టిక్కెట్ల పై అనుమానం వచ్చింది. తరువాత టిక్కెట్లను పరిశీలించినప్పుడు అన్ని టిక్కెట్లు ఏఐ ఉపయోగించి రూపొందించినట్లు వెల్లడైంది. ఈ సంఘటన తర్వాత రైళ్లలో రిజర్వ్ చేయని కంపార్ట్‌మెంట్లలో అత్యధిక మోసపూరిత టిక్కెట్స్ ను గమనించింది. రైల్వే పెరుగుతున్న డిజిటల్ మోసాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్ణయాత్మక చర్యలో భాగంగా రిజర్వ్ చేయని టిక్కెట్లను ఎలా ధృవీకరించాలో గణనీయంగా మార్చే కొత్త నియమాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది.  ఇటీవలి అప్‌డేట్‌లో భాగంగా ప్రయాణికులు ఇకపై తమ ఫోన్‌లలో రిజర్వ్ చేయని టిక్కెట్లను చూపించడంపై మాత్రమే ఆధారపడకూడదని భారతీయ రైల్వేలు ఒక నియమాన్ని రూపొందించాయి. బదులుగా, టికెట్ భౌతిక ప్రింటౌట్ ఇప్పుడు తప్పనిసరి. టెక్నాలజీ దుర్వినియోగం ద్వారా దోపిడీకి గురవుతున్న లొసుగులను మూసివేయడం లక్ష్యం.

గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ కోసం ఎంపీల వినతి

  గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రిని కోరారు. దీనివల్ల విజయవాడ స్టేషన్‌పై భారం తగ్గుతుందని, అమరావతి కనెక్టివిటీ పెరుగుతుందని తెలిపారు. అలాగే, కొండపల్లి రైల్వే స్టేషన్ వద్ద నీటి సమస్యను పరిష్కరించి, రైళ్ల రాకపోకలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి నిర్ణయం కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా శాటిలైట్ రైల్వే స్టేషన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. గొల్లపూడి సమీపంలో శాటిలైట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కేశినేని శివనాథ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. వినతిపత్రం సమర్పించారు.  గొల్లపూడిలో శాటిలైట్/హాల్ట్ రైల్వేస్టేషన్ ఏర్పాటు చేస్తే విజయవాడ రైల్వేస్టేషన్ పై భారం తగ్గుతుందని ఎంపీలు వివరించారు. ఈ శాటిలైట్ స్టేషన్ ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం బల్బ్‌లైన్స్‌ చుట్టూ ఖాళీ స్థలాలున్నాయని, వాటిని రైల్వే అవసరాలకు సులభంగా సేకరించవచ్చని రైల్వేమంత్రికి వివరించారు. ఈ ప్రాంతం కొత్త రైలు, వాయుమార్గాలతో అనుసంధానం కానుందని.. అమరావతి రైల్వేలైన్ నిర్మాణం కూడా జరుగుతోందన్నారు. ఈ ప్రాంతం విజయవాడ నగరానికి అన్ని సౌకర్యాలకు సెంటర్‌గా ఉంది కాబట్టి, గొల్లపూడిలో హాల్ట్/శాటిలైట్ స్టేషన్ నిర్మించాలన్నారు.  అంతేకాదు కొండపల్లి రైల్వేస్టేషన్ దగ్గర నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుంచి కృష్ణా మిల్క్ యూనియన్ వరకు రైల్వే ట్రాక్‌పై నీరు చేరకుండా నీటి నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఎంపీలు కోరారు. ఈ రెండు సమస్యల పరిష్కారం వల్ల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. కొండపల్లి రైల్వేస్టేషన్ నుండి విజయవాడలోని కృష్ణా మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్‌పై మురుగునీరు, వర్షపునీరు నిలిచిపోవడం వల్ల రైళ్ల రాకపోకలకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయని వారు వివరించారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఇక్కడ నీరు నిలిచిపోతోందని, దీనివల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి కేంద్రమంత్రికి తెలిపారు.ఈ సమస్యను పరిష్కరించడానికి, ట్రాక్‌ పక్కన డ్రైనేజీ కాలువలు, కల్వర్టులు నిర్మించి వర్షపునీరు సులభంగా వెళ్లిపోయేలా చూడాలని వారు కోరారు. ఇందుకోసం వెంటనే నిధులు కేటాయించి, పనులు త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ చర్యల వల్ల రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ప్రయాణికుల భద్రత కూడా మెరుగుపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఎంపీల ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కొండపల్లి రైల్వే స్టేషన్ నుంచి విజయవాడలోని కృష్ణ మిల్క్ యూనియన్ వరకు ఉన్న రైల్వే ట్రాక్ వెంట మురుగునీరు, వర్షపు నీరు నిల్వ అవుతున్న సమస్యలను కూడా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవికి వివరించాను. వర్షాకాలంలోనే కాకుండా సాధారణ వర్షపాతం సమయంలో కూడా శాస్త్రీయంగా రూపొందించిన డ్రైనేజ్ నెట్వర్క్, క్రాస్ డ్రైనేజ్ నిర్మాణాలు, కాలువలు అనుసంధానం లేకపోవడం వల్ల ట్రాక్ వెంట మురుగు నీరు నిల్వ‌వుంటుంద‌ని తెలియజేశాను.. ఈ నీటి నిల్వల వల్ల స్థానిక నివాసితులు, పరిశ్రమలు ముఖ్యంగా కృష్ణ మిల్క్ యూనియన్ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని తెలిపాను.  ఈ ప్రతిపాదనకు అమల్లోకి వస్తే విజయవాడ నగరంలో రైల్వే రవాణా మరింత సవ్యంగా మారడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, రైల్వే భద్రత, పరిశ్రమలు, స్థానిక ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయని ఆశభావం వ్యక్తం చేశాను.. ఈ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు సానుకూలంగా స్పందించారు' అంటూ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు.  ఈ ప్రతిపాదనలపై రైల్వే మంత్రి ఎలా రియాక్ట్  అవుతారో చూడాలి.

సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య అరెస్టు

  మాజీ మావోయిస్టు,  సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా జాఫర్‌గఢ్‌ మండల కేంద్రంలో ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలం మావోయిస్టులకు అనుకూలంగా మీడియాలో ఇంటర్వ్కూలు ఇవ్వడం, ఇటీవల చత్తీస్‌గఢ్‌లో  మవోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామానికి వెళ్లి రావడం  వంటి అంశాలపై విచారిస్తున్నారు.  మవోయిస్ట్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తున్నాందున ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి గాదే ఇన్నయ్యను  అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇటీవల మరణించిన మవోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియాలకు ఇన్నయ్య హాజరయ్యారు.   

జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

  వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా సీఎం చంద్రబాబు జన్మదిన  శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. జగన్‌కు దేవుడు మంచి ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఆయన సోదరి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.  అన్నగా సంబోధించకుండా శుభాకాంక్షలు తెలిపారు. “వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను” అని సందేశంలో పేర్కొన్నారు. కాగా, పవన్, షర్మిల ట్వీట్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు, నేతలు జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇంద్రకీలాద్రి భక్తులకు ఇకపై ఆన్‌లైన్‌లో అన్ని సేవలు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం, పారదర్శకత పెంచడానికి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది . భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటుగా పారదర్శకత ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విజయవాడ దుర్గగుడిలో ఇకపై దర్శన టిక్కెట్లు, అన్ని సేవలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఇకపై భక్తులు తమ దర్శన టిక్కెట్లను, ఇతర సేవలను ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్, ప్రసాదాల కొనుగోలు, కేశఖండన సేవలు, అలాగే ఆలయానికి ఇచ్చే విరాళాలు కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారానే స్వీకరిస్తారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు నగదు రహిత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ ఈవో శీనానాయక్‌ తెలిపారు. భక్తుల సౌలభ్యం కోసం ఈ డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టామన్ానరు. ఈ మార్పుల వల్ల ఆలయ నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.. భక్తులు ఈ కొత్త విధానాన్ని అర్థం చేసుకుని, సహకరించాలని కోరారు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడంతో టిక్కెట్ల విక్రయాల్లో అక్రమాలకు చెక్ పడింది. భక్తుల కోసం అన్ని డిజిటల్‌ పేమెంట్‌ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దుర్గమ్మ భక్తులు తమ టిక్కెట్లను సులభంగా కొనుగోలు చేయడానికి వీలుగా, రెండు వెబ్‌సైట్లు, ఒక మొబైల్ యాప్, ఒక వాట్సప్ నంబర్ అందుబాటులో ఉంటాయి. ఈ డిజిటల్ సేవలు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.  భక్తులు www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్ల ద్వారా ముందుగానే టిక్కెట్లను బుక్‌ చేసుకోవచ్చు. కనకదుర్గమ్మ ఆలయ మొబైల్‌ యా‌ప్‌‌తో పాటుగా మనమిత్ర వాట్సప్‌ సేవ: 9552300009 ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్యమైన దేవాలయాల్లో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి ప్రత్యేక లక్ష్యాలను నిర్దేశించింది.  దీనిలో భాగంగా, ప్రతిరోజూ ఏ ఆలయంలో ఎక్కువ ఆన్‌లైన్ చెల్లింపులు జరిగాయో ర్యాంకులు ఇస్తున్నారు. ఈ క్రమంలో, ప్రతిరోజు ఆన్‌లైన్ చెల్లింపుల్లో అత్యధికంగా రాణించిన ఆలయాలకు ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఈ విధానంలో భాగంగా, ఇటీవల బుధవారం ప్రకటించిన ర్యాంకుల్లో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం అగ్రస్థానంలో నిలిచింది. విజయవాడ దుర్గగుడి 947 ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించి రెండో స్థానంలో నిలిచింది. దుర్గమ్మ ఆలయంతో పాటుగా శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం ఇలా అన్ని ప్రధాన ఆలయాల్లో భక్తుల కోసం ఆన్‌లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ప్రధాన ఆలయాలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా...పడిపోతున్న ఉష్ణోగ్రతలు

  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత అల్పానికి పడిపోయాయి. జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కేవలం ఉదయం పూట మాత్రమే కాదు.. రాత్రిళ్లు కూడా అదే పరిస్థితి నెలకొంది. శనివారం (ఈ నెల 20) తెలంగాణ వ్యాప్తంగా 4.5 నుంచి 11.2 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సంగారెడ్డిలో అత్యంత అల్పంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పదేళ్ల రికార్డు స్థాయిలో చలి బెంబేలెత్తిస్తోంది. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్‌లో అత్యంత అల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అయితే, గత ఏడాది ఇదే ప్రాంతంలో 17.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం గమనార్హం. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ యూలో కూడా గత కొద్దిరోజుల నుంచి గడ్డ కట్టించే చలి ఉంటోంది. ఖమ్మం, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట మినహా మిగిలిన జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, హైదరాబాద్‌లో 10 డిగ్రీలు, మహాబూబ్‌నగర్‌లో 5.4, మెదక్‌లో 5.4 ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రతి చోటా సాధారణం కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆది, సోమవారాల్లో చలి తీవ్రత ఉండనుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అత్యల్పంగా 5 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎజెన్సీ ప్రాంత ప్రజలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులో రాష్ట్రంలోనే అత్యంత అల్పంగా 3.5 కంటే తక్కువ డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.  పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళం, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. చలి వాతావరణం కారణంగా మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వెచ్చటి ప్రాంతాల్లోకి పరుగులు తీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా హైదరాబాద్, విజయవడ వంటి సిటీల్లో కూడా ఉష్ణోగ్రతలు 16కు పడిపోతూ జనాన్ని వణికిస్తున్నాయి.

ఏపీ పర్యాటకులకు గుడ్‌న్యూస్...త్వరలో ఆంధ్రా ట్యాక్సీ యాప్

  ఆటో ట్యాక్సీ రంగంలో కూడా ప్రభుత్వ వాహనాలు ఉంటే బాగుండు.. చౌకగా, సౌకర్యవంతంగా వెళ్లిపోవచ్చని చాలా మంది భావిస్తుంటారు. వారి ఆశలు నిజం కాబోతున్నాయి. ప్రైవేటు క్యాబ్ సంస్థలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ద్వారా ప్రయాణికులు చౌకగా, సురక్షితంగా ఆటో, ట్యాక్సీ సేవలు పొందవచ్చు. విజయవాడలో ప్రైవేటు ఆటో, ట్యాక్సీల నుంచి పర్యాటకుల దోపిడీని అరికట్టేందుకు, డ్రైవర్లకు స్థిరమైన ఉపాధి కల్పించేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.  యాప్ ద్వారానే కాకుండా వాట్సప్, ఫోన్ కాల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చాలా చౌక. కానీ అదే స్థానికంగా ఉండే ప్రాంతాలకు ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వారు చెప్పే ధరలు వింటే. మరీ ముఖ్యంగా మెట్రో నగరాలు, సిటీల్లో.. చాలా దగ్గర దగ్గర దూరాలకు కూడా భారీ మొత్తంలో వసూలు చేస్తుంటారు. ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా ప్రభుత్వ క్యాబ్ యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా ప్రయాణికులు చాలా చౌకగా.. సురక్షితంగా ప్రయాణాలు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు క్యాబ్ బుకింగ్ సంస్థలకు పోటీగా.. ఆంధ్రా ట్యాక్సీ అనే ప్రభుత్వ పోర్టల్, యాప్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా జనాలు ఆటో, ట్యాక్సీలో కూడా తక్కువ ధరలకే ప్రయాణాలు చేయవచ్చు. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఆధ్వర్యంలో 'ఆంధ్రా ట్యాక్సీ' అనే ప్రభుత్వ పోర్టల్/యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నారు. విజయవాడ దుర్గ గుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు వచ్చే సందర్శకులకు చౌకగా, సురక్షితంగా రవాణా సేవలు అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. విజయవాడ వచ్చే పర్యాటకులు, భక్తుల వద్ద నుంచి స్థానిక ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రా ట్యాక్సీ యాప్ ‌ ద్వారా మోసాలను అరికట్టి, పర్యాటకులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా.. పర్యాటకం వృద్ధి చెందడం మాత్రమే కాక.. వాహనదారులకు స్థిరమైన ఉపాధి లభిస్తుందని కలెక్టర్‌ తెలిపారు. ఈ 'ఆంధ్రా ట్యాక్సీ' యాప్‌ ద్వారా.. ఆటో, క్యాబ్‌లను.. యాప్, వాట్సప్, ఫోన్‌కాల్, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు కావలసిన ప్రాంతాన్ని యాప్‌లో నమోదు చేస్తే, అక్కడ రిజిస్టర్ అయిన డ్రైవర్ల వివరాలు కనిపిస్తాయి.  ఆ యాప్లో కనిపించే డ్రైవర్లను అధికారులు ముందే అన్ని రకాలుగా చెక్ చేసి.. ఆ తర్వాత అనుమతిస్తారు. అలానే రవాణా శాఖ అధికారులు పరీక్షించి, ఫిట్‌నెస్‌ ఉన్న వాహనాలకు మాత్రమే ఈ ఆంధ్రా ట్యాక్సీలో అవకాశం కల్పిస్తారు. మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వాహనాల డేటా, బుకింగ్ సమాచారం స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరేలా ఈ యాప్‌ను రూపొందించారు. యాప్‌లో నమోదైన వాహనాల సమాచారం రాష్ట్ర డేటా కేంద్రానికి చేరుతుంది.  దీనివల్ల ప్రయాణికుల వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుంది. విజయవాడతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని ఇతర పర్యాటక ప్రాంతాలకు రవాణా సేవలతో పాటు, హోటల్ గదులను కూడా ఈ యాప్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. మొత్తం ప్యాకేజీలను కూడా ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, రైతుల అవసరాలకు అనుగుణంగా డ్రోన్ సేవలను కూడా అందించనున్నారు. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు.

ఖమ్మం ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు

  ఖమ్మం జిల్లా రోడ్డు రవాణా కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ ఖమ్మం రేంజ్ అధికారులు ఆర్టీఓ కార్యాలయంలో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో ఆర్టీఓ కార్యాలయంలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహి స్తున్న 13 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వివిధ సేవల కోసం దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసినట్లు అనుమానిస్తున్న రూ.78,120 లెక్కలేని నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఏజెంట్ల స్వాధీనంలో 837 అసలు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RCలు) అసలు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమవడం సంచలనంగా మారింది.  తనిఖీల్లో ఆర్టీఓ కార్యా లయంలోని హాజరు రిజిస్టర్, నగదు రిజిస్టర్ సహా పలు అధికారిక రిజిస్టర్లు సరిగా నిర్వహించబడటం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, అనధికార ఏజెంట్లు ప్రభుత్వ కార్యాల యానికి సంబంధించిన అసలు పత్రాలను నిర్వహిం చడం తీవ్ర విధానపరమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఏసీబీ నిర్ధారించింది.  ఏజెంట్లు స్వేచ్ఛగా పనిచేయడానికి, అసలు పత్రాలు నిర్వహిం చడానికి అనుమతించడం వల్ల అవినీతి పెరిగి, దరఖాస్తుదారులు వేధింపు లకు గురవుతున్నారని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మరియు ఇందులో పాల్గొన్న ఇతరులపై క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ చేస్తే 1064కి ఫోన్ చేయండిప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి చేస్తూ,ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు సమాచారం ఇవ్వాలని కోరింది.