రాజకీయ గూఢచర్యంలో భాగమే ఈడీ దాడులు.. కేంద్రంపై తృణమూల్ ధ్వజం

Publish Date:Jan 10, 2026

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఐప్యాక్ కార్యాలయం, ఆ సంస్థ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసాలపై ఈడీ సోదాలు ఆ రాష్ట్రంలో పెను రాజకీయ వివాదానికి దారి తీశాయి. ఈ దాడులను ఆ రాష్ట్రంలో అధకారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ గూఢచర్యంగా అభివర్ణించింది. ఐప్యాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతుండగా మమతా బెనర్జీ అక్కడికి వెళ్లడాన్ని తృణమూల్ కాంగ్రెస్ సమర్ధించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మహువామోయిత్రా మాట్లాడుతూ.. సీఎం మమతా బెనర్జీ తృణమూల్ అధినేత్రి కూడా అని పేర్కొన్నా మహువా మోయిత్రా, ఇంట్లో దొంగతనం జరుగుతున్నప్పుడు మన వస్తువులను కాపాడుకునే హక్కు మనకు ఉంటుంది కదా అన్నారు.   పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని  బీజేపీ సాగిస్తున్న దోపిడీని, గూండాయిజాన్ని ఎదుర్కొంటున్న ఏకైక నాయకురాలు మమతా బెనర్జీ మాత్రమేనన్న మహువా మోయిత్రా ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల జాబితా వంటి రహస్య డేటాను దొంగిలించేందుకే ఈడీ దాడులని తీవ్ర విమర్శలు చేశారు.  ఈడీ దాడులకు నిరసనగా  మమతా బెనర్జీ కోల్‌కతాలో భారీ పాదయాత్ర నిర్వహించారు.ఆ ర్యాలీకి సంఘీ భావంగా  ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, తమ దర్యాప్తును ముఖ్యమంత్రి అడ్డుకున్నారని ఈడీ, తమ పార్టీ సమాచారాన్ని అక్రమంగా సేకరించారని టీఎంసీ కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణను కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది.   ఇలా ఉండగా తమ పార్టీ రాజకీయ వ్యూహకర్త   ఐ-ప్యాక్ పై ఎ ఈడీ  దాడుల   నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనపైన, తన ప్రభుత్వంపైన  స్థాయికి మించి ఒత్తిడి పెంచితే బొగ్గు కుంభకోణంలో అమిత్ షా పాత్రకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను బయటపెడతానని హెచ్చరించారు.  

చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ

Publish Date:Jan 10, 2026

భూమికి పచ్చని రంగేసినట్లు హరిత శోభతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు చమురు మంటల వేడి సెగలకు మాడిపోతోంది. పచ్చదనం పలచబడిపోతోంది.  కోనసీమ తీర ప్రాంతంలో అపార చమురు, సహజవాయు నిక్షేపాలున్నయన్న సంగతి వెలుగు చూసినప్పటి నుంచీ ఇక్కడి పచ్చదనానికి శాపం తగిలిందోమో అనిపిస్తుంది. ఓఎన్జీసీ చమురు, సహజవాయు అన్వేషణ ప్రారంభించిందో  అప్పటి నుంచే కోనసీమ పచ్చదనం పలచబడిపోవడం మొదలైంది. ఢ్రిల్లింగ్ పేరుతో తీర ప్రాంతంలో ఇష్టారీతిగా రిగ్గులు వేసేసిన ఓఎన్జీసీ.. అప్పటి నుంచే కోనసీమ వాసుల ఆరోగ్యంపై ప్రభావం పడటం మొదలైంది. తీర ప్రాంత గ్రామాల వారు కాలేయ సంబంధిత వ్యాధులకు గురి కావడం మొదలైంది. ఇదంతా చమురు, సహజవాయువు అన్వేషణ పేరుతో ఎఎన్జీసీ చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఫలితమే అంటున్నారు వైద్య నిపుణులు, పర్యావరణ ప్రేమికులు.   సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని  పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పచ్చని కొబ్బరి చెట్లు మూడు నాలుగు నిలువుల బొగ్గు చెట్లుగా మారిపోయాయి. కోనసీమలో భోగి మంటను ఓఎన్జీసీ ముందే వేసేసిందనీ, సంక్రాంతి పండగకు ముందు జరుపుకునే భోగి భోగభాగ్యాలను తీసుకువస్తుందంటారు. కానీ.. ఓఎన్జీసీ వేసిన ఈ భోగి మంట భోగభాగ్యాలను తుడిచేస్తోందనీ ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఓఎన్జీసీ ఈ బ్లోఔట్ ను ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. మంటలు ఎగసిపడుతున్న బావిని శాశ్వతంగా మూసేయడమే మర్గమని నిర్ణయించింది. మూడు దశాబ్దాల కిందట పాశర్లపూడి బ్లో ఔట్ సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ బ్లో ఔట్ సంభవించిన బావిని మూసేయాలంటే   భారీ మడ్ ఫిల్లింగ్ యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించడానికి పచ్చటి పొలాలకు అడ్డంగా భారీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఓఎన్జీసీ ఇప్పటికే ఆ పని మొదలెట్టేసింది. మొత్తంగా కోనసీమ చమురు, సహజవాయువుల నిక్షేపాల గని అని సంబరపడటానికి లేకుండా, వాటి వెలికితీత, అన్వేషణ చర్యల కారణంగా నిత్య రావణకాష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

మాట మార్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Publish Date:Aug 28, 2025

  ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని వ్యాఖ్యానించిన ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇవాళ మాట మార్చారు. 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని నేను ఎవరికీ చెప్పలేదు అన్నారు. 75 ఏళ్ల తర్వాత కూడా చురుగ్గా పనిచేసే శక్తి ఉందని ఆయన తెలిపారు.సంఘ్ ఎలా చెప్తే అలా నడుచుకుంటామని వెల్లడించారు. కేంద్రం, ఆర్‌ఎస్‌ఎస్‌ మధ్య ఎలాంటి విభేదాలు లేవని  ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు.  . రాష్ట్రీయ స్వయం సేవక్‌  సంఘ్‌ వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉండొచ్చు.. వివాదం కాదంటూ చెప్పుకొచ్చారు. దేశ ప్రయోజనాలే ఇద్దరి ప్రాధాన్యతగా పేర్కొన్న మోహన్‌ భగవత్‌..  బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను ఆర్‌ఎస్‌ఎస్‌ శాసించదన్నారు. ‘మేం సలహా ఇవ్వగలం  .. తుది నిర్ణయం వారిదేని తెలిపారు.  నూతన విద్యా విధానానికి మేం మద్దతిస్తున్నాం. ఇంగ్లీష్‌ నేర్చుకోవడంలో తప్పులేదు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్ణయాలు తీసుకుంటుందని  ప్రతిపక్షాల నుండి వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలతో తమకు మంచి సమన్వయం ఉందని మోహన్ భగవత్ వెల్లడించారు.  

హెల్త్‌కు సైకిల్‌తో హైఫై కొట్టండి!

Publish Date:Jan 9, 2026

ఈకాలంలో పుట్టిన పిల్లలకు కాస్త నడవడం రాగానే పేరెంట్స్ అందరూ చేసేపని ఓ చిన్న సైకిల్ తెచ్చి ఇవ్వడం. ఆ సైకిల్ తో పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే కొంచెం పెద్దయ్యాక ఇంకా ముఖ్యంగా స్కూల్ స్థాయి దాటిపోగానే వాళ్ల మనసంతా బైకులు, స్కూటీలు, గాడ్జెట్స్ చుట్టూ ఉంటుంది. కొందరు ఆసక్తి కొద్దీ గేమ్స్ వైపు వెళ్లి ఎన్నోరకాల ఆటల్లో మునిగి తేలిన సైకిల్ ను పక్కకు పెట్టేస్తారు. స్కూల్ దశ అయిపోగానే పక్కకు పెట్టేసే సైకిల్ ఇప్పటి కాలంలో మనుషుల ఆరోగ్యం పాలిట గొప్ప ఆప్షన్ అనేది వైద్యులు, ఫిట్నెస్ ట్రైనర్ ల అభిప్రాయం. అసలింతకూ అలా ఎందుకంటారు.  రెగులర్ ఎక్సర్సైజ్! ఉదయం లేచాక చాలామంది ఇంటి నుండి బయట పడితే తరువాత సాయంత్రం ఇంటికి చేరుతూ ఉంటారు. ఉద్యోగస్తులు అందరూ ఇంతే. అయితే ఉద్యోగం చేసేవాళ్ళు ఆఫీసుల్లో కూర్చునే చేస్తారు. ప్రస్తుతకాల ఉద్యోగాల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక ఒత్తిడి ఉండదు అనేది వాస్తవం కదా. అయితే ఇంటి దగ్గర ఉండే కొద్దిసమయంలో ఏదైనా చిన్న చిన్న పనులకు బయటకు వెళ్లాలంటే పుటుక్కున బైక్ స్టార్ట్ చేస్తుంటారు అందరూ.  కనీసం కొత్తిమీర కట్టనొ, లేక వెల్లుల్లినో లేదా నిమ్మకాయలో ఇలాంటి చిన్న వాటికి కూడా బైకులు స్టార్ట్ చేస్తే మహానుభావులు ఉంటారు. బయట ఎండలు లేదా అర్జెన్సీ అనే కల్లబొల్లి కబుర్లు చెప్పేవాళ్లకు ఎలాంటి సందేహం లేకుండా సైకిల్ ఒక ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంజిన్ ఖర్చు లేనే లేదు! బైకు తీస్తే బర్రున శబ్దం చేసుకుంటూ రాకెట్ లో పోవాలంటే అందులో పెట్రోల్ ఉండాలి. పెట్రోల్ లేని బండి మూలన పడి ఉండాల్సిందే. కనీసం దాన్ని తొక్కడానికి  కుదరదు, తోయడానికి మనిషికే కండలు ఉండాలి. పెరిగిపోతున్న పెట్రోల్ ఖర్చులతో మనిషి పాకెట్ కు చిల్లులే. కానీ మన సైకిల్ ఉందండి. కష్టపడి అప్పుడప్పుడు గాలి కొట్టుకుంటే చాలు, టైర్ లలా ఉన్న మనుషులను స్లిమ్ గా చేసేస్తుంది. ఎలాంటి పెట్రోల్ గోల లేకుండా హాయిగా జాగ్రత్తగా వాడుకుంటే జీవితకాలం సేవలు చేస్తుంది.  వేగవంతమైన జీవితంలో అన్ని తొందరగా అయిపోవాలనే ఆలోచనలో చాలామంది ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కొన్నింటిని పక్కకు తోసేస్తున్నారు. తీరా ఆరోగ్యాలు నష్టపోతున్న సందర్భాలలో జిమ్ లలో చేరి అక్కడ సేమ్ సైక్లింగ్ వర్కౌట్ చేస్తుంటారు. అలా నెలకు వేలు తగలెయ్యడం కంటే ఒక సైకిల్ పెట్టుకుని కొన్ని పనులకు సైకిల్ ని ఉపయోగించడం మంచిది. బైకులు, స్కూటీల కంటే తక్కువ ఖర్చుతో, పెట్రోల్ గట్రా అదనపు ఖర్చు లేకుండా, రోజూ తగినంత వ్యాయామాన్ని అందించే సైకిల్ కు హైఫై కొడితే పోయేదేముంది?? శరీరంలో అదనపు కొవ్వు తప్ప. అయితే మోకాళ్ళ నొప్పులు సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా తీసుకోండి మరి. సైకిల్ పెడిల్ తొక్కుతూ కాస్త రౌండ్స్ కొట్టండి మరి.            ◆ వెంకటేష్ పువ్వాడ.
[

Health

]

సమయానికి తినకపోతే ఈ సమస్య రావడం పక్కా..!

Publish Date:Jan 10, 2026

ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్,  కాల్షియం,  ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం.  ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం.  అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం  కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట.  సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..  మైగ్రేన్.. ఆహారం సమయానికి తీసుకోకపోతే  అది తలనొప్పి సమస్యగా మారుతుందట.  మరీ ముఖ్యంగా ఈ తలనొప్పి కాస్తా మైగ్రేన్ గా మారే అవకాశం ఉంటుందట. మైగ్రేన్ చాలా తీవ్రమైన తలనొప్పికి కారణం అవుతుంది.  ఆహారం సమయానికి తీసుకోకపోతే ఇది వారంలో రెండు నుండి మూడు రోజులు మైగ్రేన్ కారణంగా బాధపడాల్సి ఉంటుందని ఆహార నిపుణులు, వైద్యులు అంటున్నారు. మైగ్రేన్ వల్ల జరిగేది ఇదే.. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల వచ్చే మైగ్రేన్ నొప్పి ఒక రోజు మాత్రమే ఉంటుందట.  కానీ దానివల్ల ఏకాగ్రత లేకపోవడం, దృష్టి లేకపోవడం, అలసట,  బలహీనత  మైగ్రేన్ ప్రభావాన్ని మరింత పెంచుతాయి.  దీని కారణంగా మైగ్రేన్ తరువాత  రెండు మూడు రోజులు ఏ పనిని ఏకాగ్రతగా చేయలేరు.. . సమయానికి తినాలి.. జాగ్రత్తగా, సమయానికి  తినడం వల్ల తలనొప్పి, దాని వల్ల కలిగే  దుష్ప్రభావాలను నివారించవచ్చు. అందుకే ఎన్ని పనులున్నా సమయానికి ఆహారం తినడాన్ని విస్మరించకూడదు. పెద్దవారు ఉదయం ఆఫీసుకు వెళ్ళేముందు,  పనికి వెళ్ళేముందు తినడం తప్పనిసరి.. అలాగే పిల్లలకు కూడా తప్పనిసరిగా పాఠశాలకు వెళ్ళేముందు ఆహారం పెట్టాలి.  ఎక్కువ సేపు టీవి, ఫోన్, కంప్యూటర్ వంటివి చూడటం వల్ల పిల్లలలోనూ, పెద్దలలోనూ తలనొప్పి, మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఆహారం దగ్గర నిర్లక్ష్యం చేయకూడదు.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...