ముచ్చటగా మూడో పెళ్లి.. బ్రిటన్ ప్రధానిగా సరికొత్త రికార్డు..
posted on May 30, 2021 @ 8:52PM
ఆయనకు 56. ఆమెకు 33. ఇద్దరి మధ్య 23 ఏళ్ల తేడా. అయితేనేం? అతగాడు ఏకంగా ఇంగ్లండ్ ప్రధాని బోరిస్ జాన్సన్. ఆమె కేరీ సైమండ్స్. అవును, వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. కరోనా టైమ్‌లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు గ్రేట్ బ్రిటన్‌లో వైరల్‌గా మారింది. ప్రైమినిస్టర్ పెళ్లిపై విస్తృత చర్చ జరుగుతోంది.
వయసు శరీరానికి మాత్రమే కానీ మనసుకు కాదు అని వాళ్లిద్దరూ బలంగా నమ్మారు. కొంతకాలంలో వాళ్లు ప్రేమలో ఉన్నారు. శనివారం లండన్‌లోని ఓ చర్చిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఇంగ్లండ్ వాసులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
వాళ్ల పెళ్లికి సంబంధించి ఒకే ఒక్క ఫోటో బయటకి వచ్చింది. ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈడూ-జోడూ సంగతి పక్కనపెడితే.. వాళ్లిద్దరి మధ్య 20 ఏళ్లకు పైగా ఏజ్ గ్యాప్ ఉన్నా.. పెళ్లి డ్రెస్‌లో వాళ్లిద్దరూ బ్యూటిఫుల్‌గానే కనిపిస్తున్నారు. గుడ్ లుకింగ్ కపుల్స్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఈ పెళ్లితో యూకే చరిత్రలోనే బోరిస్ జాన్సన్ ఓ ఆసక్తికర రికార్డు నెలకొల్పడం విశేషం. సుమారు 200 ఏళ్లలో ప్రధాని పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించడం ఆసక్తికరం.
బోరిస్ జాన్సన్‌కు ఇది ముచ్చటగా మూడో పెళ్లి. కేరీ సైమండ్స్కి మాత్రం ఇదే తొలి వివాహం. ప్రస్తుతం సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నా.. త్వరలోనే ఈ జంట.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 56 ఏళ్ల యూకే ప్రధానికి, 33 ఏళ్ల అమ్మాయితో పెళ్లి కావడం చూసి.. ఎంతవారు కానీ కాంత దాసులే.. అనే కొటేషన్ గుర్తొస్తోందని అంటున్నారు నెటిజన్స్.