యడ్డీకి ఢిల్లీ పిలుపు అందుకేనా..?
posted on Jul 16, 2021 @ 7:06PM
వాన రాకడ ... ప్రాణం పోకడా ఎవరూ ఉహించలేరని అంటారు. ఇప్పుడు దానికి పదవి పోకడను కూడా కలపచ్చు, అనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఇలాగే, శుక్రవారం, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు వచ్చినట్లే, ఉత్తరాఖండ్ ముఖ్యమత్రి తీరద్ సింగ్’కు ఢిల్లీ నుంచి కాల్ వచ్చింది. పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షా, చివర్లో ఫినిషింగ్ టచ్’గా ప్రధాని మోడీని కలిశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
సో .. ఈ రోజు (శుక్రవారం) ఢిల్లీ నుంచి కాల్ అందుకుని, ఢిల్లీ చేరిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప విషయంలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందా, అంటే, మోస్ట్లీ.. అలాగే జరగచ్చని బీజేపీ ప్రధాన కార్యాలయం వర్గాల సమాచారం. నిజానికి, యడ్డీకి ఉద్వాసన తప్పదని చాలా కాలంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి మండలి పునర్వవ్యవస్థీకరణలో, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి జరిగిన మార్పులు చేర్పులు కూడా అవే సంకేతాలు ఇచ్చాయని, ఇటు పార్టీ వర్గాల్లో అటు రాజకీయ, మీడియా వర్గాలలో చర్చ జరుగుతూనే ఉంది. అలాగే, యడ్డీ నెక్స్ట్ పోస్ట్, ఏపీ గవర్నర్ అని కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది.
ఇదలా ఉంటే, ఢిల్లీ పిలుపుపై శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు యడ్యూరప్ప, కుమారుడు విజయేంద్రతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాత్రి ఏడు గంటలకు ప్రధాని మోడీ ని కలుస్తున్నారు. అంతకంటే ముందే పార్టీ అధ్యక్షుడు నడ్డాతోనూ సమావేశమవుతున్నారు. హోమ్ మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, యడ్డీకి ఉద్వాసన ఖాయమని చెప్పేందుకు కూడా లేదనే మాట కూడా సన్నగా వినిపిస్తోంది.
అయితే గత కొంత కాలంగా పార్టీలోని ఒక వర్గం ఎమ్మెల్యేలు బహిరంగంగానే ముఖ్యమత్రి యడియూరప్పకు ఉద్వాసన పలకాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన నాయకత్వం, ప్రభుత్వ వ్యవహారాలలో ఆయన కుమరుడు విజయేంద్ర మితిమీరిన జోక్యంపై ఎమ్మెల్యేలు తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కర్నాటక ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. యడియూరప్ప పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. అయినా యడియూరప్పపై విమర్శలు, అసంతృప్తులు ఆగిపోవడం లేదు. వెల్లువలా వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుమారుడితో సహా యడియూరప్ప ప్రధానిని కలవనుండటంతో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరో వంక పార్టీ అధిష్టానం కూడా యడ్డీ తీరు పట్ల అసంతృప్తిగా ఉందని ఎప్పటినుంచో పార్టీలో వినవస్తోంది.సో.. ఈరోజు కాదంటే రేపు యడ్డీ ఉద్వాసన ఖాయమని అంటున్నారు.
అదలా ఉంటే, యడ్డీ వర్గానికి చెందిన రెవిన్యూ మంత్రి అశోక్ , నాయకత్వ మార్పు పై వస్తున్న ఊహాగానాలను కొట్టి వేశారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఉండదు. యడియూరప్పే సీఎంగా కొనసాగుతారు. కావేరీ నది సమస్యపై మాట్లాడడానికే ఢిల్లీ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సహా ఇతర కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారని అశోక్ పేర్కొన్నారు. అయితే కావేరీ నది సమస్యపై మాట్లాడడానికే అయితే,హటాత్తుగా పిలుపు ఎందుకు వచ్చింది,హుటాహుటిన ఎందుకు వెళ్ళవలసి వచ్చిందని కొదరు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఉద్వాసనకే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ వర్గాలతో పాటుగా, రాజకీయ విశ్లేషకులు భావిస్తునారు.