బ్రేకింగ్.. టీడీపీ ఎంపీల రాజీనామా?
posted on Jul 16, 2021 @ 7:06PM
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. తెలుగు దేశం పార్టీ ఎంపీలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం రాజీనామాలకు సిద్ధమయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ను కాపాడుకునేందుకు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. వైసీపీ ఎంపీలు కూడా అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విశాఖ స్టీల్‌పై ముందుండి సీఎం జగన్ పోరాటం చేయాలని డిమాండ్ చేశారు రామ్మోహన్‌నాయుడు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. జగన్ ఆస్తులు హైదరాబాద్‌లో ఉన్నాయని, అందుకే జల వివాదంపై మాట్లాడటం లేదని రామ్మోహన్ నాయుడు దుయ్యబట్టారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను పోరాడి సాధిస్తామని ప్రకటించారు.
టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సుమారు 18 అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్, జల వివాదంపై సుదీర్ఘంగా చర్చించారు. జల వివాదంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని కనకమేడల రవీంద్ర ప్రకటించారు. రాష్ట్రంలో పెట్రోల్‌పై అదనపు ట్యాక్స్ విషయాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్తున్నాం అని.. పదేపదే చెప్పిన సీఎం ఏం సాధించారు? అని కనకమేడల ప్రశ్నించారు. తెలుగు భాష, విద్యా విధానాన్ని నాశనం చేయడంపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు. న్యాయవ్యవస్థపై దాడి అంశంపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నామని కనకమేడల తెలిపారు.