ఓటమి భయంతోనే రహస్య జీవోలు... జగన్ రెడ్డిపై కన్నా తీవ్ర ఆరోపణలు...
posted on Mar 5, 2020 @ 1:53PM
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిప్పులు చెరిగారు. నవరత్నాల పేరుతో చాక్లెట్లిచ్చి... నెక్లెస్ లు ఎత్తుకుపోతున్నారని కన్నా విమర్శించారు. మద్యం ధరలు విపరీతంగా పెంచేసి దోపిడీ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఇప్పటికే బస్సు, విద్యుత్, మద్యం ధరలు పెంచేసి ప్రజల నడ్డివిరుస్తోన్న జగన్ ప్రభుత్వం... త్వరలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెంచబోతున్నారని ఆరోపించారు.
ఇక, రాత్రికి రాత్రే రహస్యంగా జగన్ ప్రభుత్వం విడుదల చేస్తోన్న విషపూరిత జీవోల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక, ఎన్నడూలేనివిధంగా కొత్త కొత్త రూల్స్ తీసుకొచ్చి, భయభ్రాంతులకు గురిచేసి స్థానిక ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కన్నా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం అకృత్యాలను, అరాచకాలకు ప్రజలు ధైర్యంగా ఎదుర్కోవాలని కన్నా పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు వైసీపీ చేస్తోన్న ప్రయత్నాలను ప్రజలే అడ్డుకోవాలన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలనపై అసలు ఆయనకే నమ్మకం లేదని కన్నా విమర్శించారు. అందుకే, విపక్షాలు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడగకుండా చేసేందుకే తప్పుడు జీవోలు తీసుకొచ్చారని కన్నా విమర్శించారు. డబ్బు, మద్యం పంచితే చర్యలంటూ జీవోలు ఇచ్చి ప్రతిపక్షాలను జైలుకు పంపేందుకు కుట్ర పన్నారని కన్నా ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలైన గ్రామ వాలంటీర్లు ఫిర్యాదు చేస్తే చాలు కేసులు పెట్టి జైలుకు పంపుతామనడం దుర్మార్గమన్నారు. జగన్ పాలనలో వైసీపీ శ్రేణులు తప్ప... ప్రజలెవరూ సుఖశాంతులతో లేరన్నారు కన్నా.