అజ్ఞాత భక్త కన్నయకేల ఈ వరాలు
posted on Nov 14, 2013 @ 12:06PM
ఇంతవరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పదవి నుండి తప్పిస్తే, ఒకసారి ఆ కుర్చీలో కూర్చోవాలని చాల మంది కాంగ్రెస్ నేతలే తహతహలాడుతున్నారు, అది మున్నాళ్ళ ముచ్చటే అని తెలిసినప్పటికీ జీవితంలో అరుదుగా దొరికే ఈ ఆవకాశాన్నిఉపయోగించుకోవాలని వారి కోరిక. ఈ సారి అన్ని రాజకీయ పార్టీలు కాపు కులస్థుల ఓట్లకు గాలం వేయాలని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో, కాంగ్రెస్ కూడా కాపు కార్డు ప్రయోగిస్తుందని అందరూ ఊహించారు. వారి అంచనాలు నిజమయినప్పటికీ, అధిష్టానంతో నిత్యం మంచి టచ్చులో ఉండి, ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని స్పష్టం చేసిన చిరంజీవి, బొత్స వంటి కాపు కులస్తులను కాదని ఏడాదికి ఒక్కసారి కూడా డిల్లీ మొకం చూడని లక్ష్మి నారాయణనని సోనియా ‘కన్నా’ అని ఆప్యాయంగా పిలవడం ఎవరికయినా జీర్ణించుకోవడం కష్టమే.
అయితే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇస్తారో లేక బొత్స చేతిలోంచి పీసీసి అధ్యక్ష పదవి లాక్కొని అది అప్పగిస్తారో ఇంకా స్పష్టం కాలేదు. ఒకవేళ బొత్సను తప్పించి ఆ కుర్చీలో ఈ కన్నయ్యను కూర్చోబెడితే, బొత్స పట్ల సీమాంధ్ర ప్రజలలో ఉన్నఅసంతృప్తిని కాంగ్రెస్ అధిష్టానం కూడా బాగానే గమనించిందని భావించవచ్చును. అలాకాక సోనియా గాంధీ తన కన్నయను నేరుగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొబెడితే రాష్ట్ర విభజన తరువాత కూడా బొత్స, చిరంజీవి తదితర పార్టీలో కాపు కులస్తులకు ఇక ఆ ఆవకాశం లేదనే అర్ధం. అంటే వారు మళ్ళీ ఏదోఒక పదవిలో సర్దుపోక తప్పదన్నమాట.
తాము ఒంటి కాలు మీద నిలబడి మరీ సోనియా జపం చేస్తూ ఘోర తపస్సు చేస్తున్నాదక్కని ఈ వరం, ఎన్నడూ ఒకసారి కూడా బిగ్గరగా సోనియమ్మ నామస్మరణం చేయని ఈ అజ్ఞాత భక్త కన్నయ్యకే ఎందుకు దక్కిందో తెలుసుకోవాలంటే ఆయన చరిత్ర ఒకసారి తిరగేయక తప్పదు.
వరుసగా నాలుగు పర్యాయాలు ఎన్నికలలో గెలుస్తూ వచ్చిన ఈ కన్నయ్య అలనాడు నేదురుమల్లి నుండి ఇప్పటి నల్లారి వరకు అందరితో మంత్రిగా పనిచేసిన మంచి అనుభవం కల వ్యక్తి. అయినప్పటికీ, ఆయనకి ఎటువంటి గ్రూపులు, భేషజాలు లేవు. ఎటువంటి సిండికేట్ రికార్డులు కూడా లేవు. రాష్ట్ర విభజన అంశంపై మిగిలిన వారి సంగతెలా ఉన్నపటికీ బొత్స, చిరంజీవి ఇద్దరూ వ్యవహరించిన తీరుతో అటు అధిష్టానం వద్ద, ఇటు ప్రజల వద్దకూడా ఏవిధంగా పరువుపోగొట్టుకోన్నారో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే కన్నయ్య మాత్రం విభజన విషయంలో ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లు లౌక్యంగా వ్యవహరించడం వలన రెండు వైపులా నెగ్గుకురాగలిగారు. ముఖ్యమంత్రి కుర్చీ మూన్నాళ్ళ ముచ్చటే అనుకొన్నా, ఈ ఆరేడు నెలలో విభజనకు కేంద్రానికి పూర్తిగా సహకరించి ‘మంచి పనితీరు’, ‘భక్తిభావం’ చూపినట్లయితే ఆ తరువాత కూడా అదే కుర్చీలో పర్మనెంటుగా సెటిల్ అయిపోయే అవకాశాలున్నాయి. అయితే సీమాంధ్రలో జనాల చేత ‘చ్చీ’ కొట్టించుకొంటున్న కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికలలో గెలిపించాల్సిన క్లిష్టమయిన భాద్యత తీసుకొన్నపుడే అది సాధ్యం అవుతుంది. మరి బొత్సకి కానీ మరెవరికీ గానీ అంత సీన్ లేదని కాంగ్రెస్ అధిష్టానం భావించినందునే బహుశః కన్నయను చేరదీసి ఉండవచ్చును. కొండకు వెంట్రుక ముడేసి లాగితే, వస్తే కొండ కదిలి వస్తుంది. లేకుంటే పోయేది వెంట్రుకే కనుక కన్నయ్య కూడా ‘సై’ అని ఉండవచ్చును. మరి దీనిని పెద్దన్న ఏవిధంగా జీర్ణించుకొంటారో చూడాల్సిందే!