డామిట్! కధేటి ఇలా అడ్డం తిరుగుతోంది?
posted on Nov 13, 2013 @ 7:49PM
జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చినప్పటి నుండి నేటి వరకు ఏదో ఓ రకంగా ప్రజల దృష్టిని ఆకర్షిద్దామని చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలితాలు ఈయకపోగా ఒక్కోసారి బెడిసి కొడుతున్నాయి కూడా. జైలులో ఉండగానే తన కడప యంపీ పదవికి రాజీనామా చేసినప్పటికీ, అతను స్వయంగా వెళ్లి స్పీకర్ మీరా కుమార్ ని కలవకపోవడంతో అతని రాజీనామాను ఆమె తిరస్కరించారు. స్వయంగా వచ్చి కలిసిన తరువాతనే దానిపై నిర్ణయం తీసుకొంటానని ఆమె తెలిపారు.
అయితే రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేసుకోవడం కోసం సీబీఐ కోర్టులో పిటిషను వేసి ‘స్టేట్ పర్మిట్’ మంజూరు చేయించుకొన్న జగన్, డిల్లీ వెళ్లేందుకు కూడా కోర్టు అనుమతి కోరే అవకాశం ఉన్నపటికీ, ఆపని చేయకుండా తన లాయర్ల ద్వారా డిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసారు. స్పీకర్ ని తన రాజీనామాను వెంటనే ఆమోదించమని ఆదేశించాలని కోరుతూ అతను పిటిషను వేసారు. అతనితో బాటు డిల్లీ వెళ్లేందుకు ఎటువంటి ఆంక్షలు, ఇబ్బందులు లేని వైకాపా యంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవలే కాంగ్రెస్ నుండి వైకాపాలోకి దూకిన యస్.పీ.వై. రెడ్డి కూడా పిటిషన్లు వేసారు.
అయితే కోర్టులు స్పీకర్ కి అటువంటి ఆదేశాలు జారీ చేయలేవని ఇదివరకే లగడపాటి కేసులో తేలిపోయింది. అయినప్పటికీ జగన్, అతని యంపీలు మళ్ళీ కోర్టులో కేసు వేయడం కేవలం ప్రజలని మభ్య పెట్టడానికేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారికి నిజంగా తమ రాజీనామాలు ఆమోదింప జేసుకోవాలనే ఆలోచనే ఉండి ఉంటే స్పీకర్ కోరినట్లు నేరుగా ఆమెనే కలిసి రాజీనామాలు ఆమోదింపజేసుకొనేవారు. కానీ రాజీనామాలు చేయడమే తప్ప, వాటిని ఆమోదింపజేసుకోవాలనే ఆలోచన లేనందునే వారు కోర్టుకి వెళ్ళారని అర్ధం అవుతోంది.
బుధవారంనాడు వారి పిటిషను విచారణ చెప్పటిన హైకోర్టు జస్టిస్ వీకె. జైన్ తీర్పు వెలువరిస్తూ “రాజీనామా ఆమోదానికి కోర్టుని ఆశ్రయించే బదులు నేరుగా స్పీకర్ వద్దకే వెళ్లి, తమ రాజీనామాలను ఆమోదించమని కోరితే ప్రయోజనం ఉంటుందని” అన్నారు. అయితే జగన్ తరపు వాదిస్తున్నలాయర్ జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్ విడిచి వెళ్ళకూడదనే బెయిలు షరతులున్నకారణంగా అతను స్వయంగా డిల్లీకి రాలేరని అందువల్లే కోర్టుని ఆశ్రయించామని తెలిపినప్పుడు, జస్టిస్ జైన్ ”అయితే సీబీఐ కోర్టుని అనుమతి కోరవచ్చును కదా?” అని ప్రశ్నించడంతో దానికి ఆయన వద్ద జవాబు లేదు. ఈ పిటిషన్లు అసలు విచారణకు అర్హమయినవో కావో తరువాత వాయిదాలో ప్రకటిస్తామని న్యాయమూర్తి కేసు వాయిదా వేసారు.
మిగిలిన ఇద్దరికీ డిల్లీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు కోర్టులో ఎందుకు పిటిషను వేయవలసి వచ్చిందని న్యాయ మూర్తి అడగకపోవడం వారి అదృష్టమే. లేకుంటే విలువయిన కోర్టు సమయం వృదా చేసినందుకు జరిమానా విదించి ఉంటే, ప్రజలను ఆకట్టుకోవడం సంగతి దేవుడెరుగు, అదే ప్రజల ముందు అభాసుపాలయ్యే వారు. వ్రతం చెడినా ఫలం దక్కకపోవడమంటే బహుశః ఇదేనేమో!