2024 సార్వత్రిక ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ

విపక్షాల ఐక్యత, రానున్న సార్వత్రిక ఎన్నికలలో మోడీని దీటుగా ఎదుర్కొనడమే లక్ష్యం అంటూ ముందుకు సాగుతున్న విపక్షాలకు కాంగ్రెస్ స్పీడ్ బ్రేకర్ గా మారింది. ఆ పార్టీ ఏకపక్షంగా విపక్షాల ఐక్యత విషయంలో చేస్తున్న ప్రకటనలు విపక్ష పార్టీల ఐక్యతకు ఆదిలోనే గండి కొట్టేలా ఉన్నాయి.

రాహుల్ గాంధీ  భారత్ జోడో యాత్ర కారణంగా కాంగ్రెస్ కు ఒకింత సానుకూల వాతావరణం ఏర్పడుతున్న తరుణంలో ఆ పార్టీ సీనియర్ నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు మొదటికే మోసం వచ్చేలా చేస్తున్నాయి. 2024 సార్విత్రిక ఎన్నికలలో విపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయే అంటే కాంగ్రెస్ సీనియర్ నేత కమల్ నాథ్ చేసిన ప్రకటన బీజేపీయేతర పక్షాల ఐక్యతా యత్నాలకు గండి పడేలా మారింది. కమల్ నాథ్ ప్రకటన ఐక్యతా ప్రయత్నాలకు ఆదిలోనే హంసపాదులా మారింది.

కామన్ అజెండాపై చర్చించుకుని, పొత్తులు, పోటీ చేసే స్థానాలు, పార్టీల బలాబలాలపై ఒక అంచనాకు వచ్చిన తరువాత ఒక నిర్ణయం తీసుకోవలసి ఉండగా, కమల్ నాథ్ ఏకపక్షంగా రాహులే ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థి అని ప్రకటించడం పట్ల బీజేపీ యేతర పార్టీలలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. భారత్ జోడో యాత్రలో మెరుపులూ ఉన్నాయి. మరకలూ ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ రాహుల్ జోడో యాత్రపై వ్యక్తం చేసిన అభిప్రాయం, ఆ యాత్రకు ఆహ్వానం అందినా హాజరు కాబోనంటూ ఆయన చేసిన ప్రకటన.. కాంగ్రెస్ కు విపక్షాలలో సర్వామోదం లేదనడానికి నిదర్శనం అనడంలో సందేహం లేదు.

అలాగే రైతు సమస్యలపై గళమెత్తుతున్నా తికాయత్ వంటి రైతు నేతలు ఇంకా కాంగ్రెస్ తో అడుగు కలిపేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఈ స్థితిలో  అన్ని పార్టీలనూ కలుపుకుపోయేందుకు సంయమనంతో వ్యవహరించాల్సిన కాంగ్రెస్ సీనియర్లు.. ఏకపక్ష నిర్ణయాలు, ప్రకటనలతో ఐక్యతారాగంలో ఆదిలోనే అపశ్రుతులు పలికిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. భారత చరిత్రలో రాహుల్ గాంధీలా ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన నేత మరొకరు లేరన్న కమల్ నాథ్, అధికారం కోసం వెపర్లాడుతూ రాజకీయాలు చేసే తత్వం ఆయనది కాదంటూనే.. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు ప్రస్తావిస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని అభ్యర్థి రాహులే అని ముక్తాయించడం ఒక విధంగా విపక్షాల ఐక్యతకు ముందరి కాళ్లకు బంధం వేయడం లాంటిదేనని అంటున్నారు. 

Teluguone gnews banner