బీఆర్ఎస్ సర్కార్ సెల్ఫ్ గోల్?
posted on Jan 2, 2023 @ 5:12PM
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదనేది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మొదలు భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్) చోటా మోటా నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యం చేసే ఆరోపణ. డీఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరించే మంత్రి కేటీఆర్ అయితే కేంద్ర నిధుల విషయంలో బీజేపీకి ఎన్నోమార్లు మీడియా ద్వారా బహిరంగ సవాల్ విసిరారు. బీజేపీ నాయకులు కూడా మీడియా ద్వారానే సమాధానం ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ప్రతి పని కేంద్ర నిధులతోనే జరుగుతోందని బీజేపీ నాయకులు పదే పదే పేర్కొంటున్నారు.
దుబ్బాక ఎమ్మెల్యే, బీజేపీ ముఖ్య నాయకుడు రఘునందన రావు అయితే అసెంబ్లీ వేదికగా కేంద్ర నిధులపై ప్రత్యేక చర్చ జరగాలని పలు మార్లు డిమాండ్ చేశారు. అయితే అదేమీ జరగలేదనుకోండి అది వేరే విషయం. అలాగే కేంద్రం ప్రభుత్వం బండారం బయట పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ప్రచారం అయితే జరిగింది కానీ అదీ జరగలేదు. ఇంతలోనే కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచుల ఖాతాలకు పంపిన రూ.35 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించిందనే ఆరోపణలు రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాగుతున్న నిధుల పంచాయతీ కొత్త మలుపు తిరిగింది. రోడ్డెక్కింది.
సమస్య సర్పంచుల రాజీనామాల వరకు వెళ్ళిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన రూ.35 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం(జనవరి 2) ధర్నాకు పిలుపు నిచ్చింది. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు ఎక్కడి కక్కడ, హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డిని ముందు హౌజ్ అరెస్టు చేసిన పోలీసులు,ఆ తర్వాత ఆయనను ఇంటి వద్దనే అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ అరెస్టుకు ముందు రేవంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు హై డ్రామా నడిచింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ సర్పంచుల ఖాతాల్లో జమ చేసిన రూ. 35వేల కోట్లు వారికి తెలియకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ దొంగతనం చేసిందని ఘాటు విమర్శలు చేశారు.
మరో వంక రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన రూ.35 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు ప్రతి నెల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి.. మౌలిక సదుపాయాల కల్పనకు, జీత భత్యాలకు, అత్యవసరాల కోసం విడుదల చేయాల్సిన రూ.250 కోట్ల నిధులను 7 నెలలుగా నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేయాలని అధికారులు ఒత్తిడి చేయడంతో సర్పంచులు, ఉపసర్పంచులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిజానికి కాంగ్రెస్ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విఫలం చేయడం ద్వారా, బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు సెల్ఫ్ గోల్ చేసుకుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులే ఇవ్వడం లేదని ఆరోపిస్తున్న గులాబీ నేతలు అబద్ధాలను కప్పిపుచ్చుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇదొకటే కాదు, ఇటీవల రూ.150 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ నిధులను దారి మళ్ళించి, గ్రామాల్లో ధాన్యం కల్లాలు నిర్మించడం వివాదంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను వాపసు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేసింది. కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి మొదలు నాయకులు అందరూ విరుచుకు పడ్డారు. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు. అయితే, తీగ లాగితే దొంకంతా కదిలింది అన్నట్లు, కల్లాల వివాదం తీగలాగితే, హరితాహారం పథకం కోసం మరో రూ.550 కోట్ల గ్రామీణ ఉపాధి హామీ నిధులను దారి మళ్లించిన వ్యవహారం బయటకు వచ్చింది.
దీంతో గ్రామీణ ప్రాంతలలో రెక్కాడితే కానీ, డొక్కాడని పేదలకు సంవత్సరానికి కనీసం 100 రోజులు పనికల్పించేందుకు ఉద్దేశించిన నిధులను దారి మళ్ళించి కల్లాల నిర్మాణం పేరున అస్మదీయ కాంట్రాక్టర్లకు ఖర్చు చేయడం, ఏమిటనే ప్రశ్నకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పలేక తికమక పడుతున్నారు. ఇలా ఒకదాని వెంట ఒకటిగా బీఆర్ఎస్ ప్రభుత్వం సెల్ఫ్ గోల్స్ కు పాల్పడుతోందని, పరిశీలకులు అంటున్నారు.