రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కార్ నిషేధం
posted on Jan 3, 2023 @ 9:54AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్నది చేసేసింది. రాష్ట్రంలో రోడ్లపై విపక్షాల సభలూ, ర్యాలీలు జరగడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. సభలూ సమావేశాలూ జరుపుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రదేశాలను అన్వేషించాల్సిందిగా అధికారులను ఆదేశించింది. ఇక పై రాష్ట్రంలో ఎవరైనా సరే సభలూ సమావేశాలు జరుపుకోవాలన్నా, ర్యాలీలు నిర్వహించాలన్నా షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ప్రజలకు దూరంగా మాత్రమే రాజకీయ పార్టీలు సభలూ, సమావేశాలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉత్వర్వుల అసలు ఉద్దేశంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే. కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా.. గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే. ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది. అయితే విపక్ష నేత పాల్గొన్న రోడ్ షో, సభలో తొక్కిసలాట జరగడానికి ప్రభుత్వ వైపల్యమే కారణమన్న విమర్శలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ సభలు, ర్యాలీలను నిషేదించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చంద్రబాబు సభలలో తొక్కిసలాటల వెనుక కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఒక రాజకీయ పార్టీ రోడ్ షోలలో, కానుకల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప వ్యవధిలో తొక్కిస లాటలు జరిగిన సంఘటనలు సందేహాలకు తావిస్తున్నాయి. ఇటీవల జరిగిన రెండు సంఘటనపైనా అధికార పార్టీ తప్ప.. మిగిలిన పార్టీలన్నీ రాజకీయాలకు అతీతంగా మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపు నిచ్చాయి. జరిగిన సంఘటన అత్యంత విషాదకరమని పేర్కొన్నాయి. కందుకూరు దుర్ఘటనపై ప్రధాని మోడీ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. కానీ ఎవరూ రోడ్ షో ఎందుకు నిర్వహించారంటూ తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించలేదు.
రాజకీయ పార్టీగా సభలు, సమావేశాలు నిర్వహించిన విపక్షంపై విమర్శలు గుప్పించింది. ప్రచార యావతో విపక్ష నేత, తెలుగుదేశం అధినేత ఇరుకు సందుల్లో సభలు పెట్టడం వల్లనే తొక్కిసలాట జరిగిందని నిందలు వేసింది. అంటే అధికార పార్టీ, ప్రభుత్వం విపక్షం ప్రజలలోకి రాకూడదని భావిస్తోందా? అన్న ప్రశ్న తలెత్తింది. భారీగా జనం హాజరయ్యే సభలకు, సమావేశాలకు, కార్యక్రమాలకూ అది ప్రైవేటు కార్యక్రమమే అయినా బందోబస్తు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించి.. ఇరుకు సందుల్లో సభ పెట్టుకున్నారు. ప్రచార యావతో ప్రాణాలు తీసేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించడం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికేనని పరిశీలకులు అంటున్నారు. అయినా చంద్రబాబు సభలలోనే ఈ అపశ్రుతులు జరగడం, చంద్రబాబు సభలలోనే పోలీసుల వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపించడం, అలాగే గతంలో చంద్రబాబు రోడ్ షో సందర్భంగా ఆయనపై రాయితో దాడికి జరిగిన ప్రయత్నం, సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం వైసీపీ శ్రేణులు కర్రలతో బాబు కాన్వాయ్ కు అతి సమీపంలోకి రావడం వంటి సంఘటనలన్నీ ఉద్దేశ పూర్వకంగా బాబు సభల సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పోలీసులు గాలికి వదిలేశారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేందుకు దోహదం చేస్తున్నాయి.
సీఎం పర్యటనలు పరదాల మాటున జరుగుతున్నా.. బ్యారికేడ్ల ఏర్పాటు చేసి, వందల సంఖ్యలో మోహరించే పోలీసులు చంద్రబాబు సభలకు ఎందుకు వేళ్లతో లెక్కపెట్టగలిగేంత మంది కూడా ఉండటం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.చంద్రబాబు ఆషామాషీ నాయకుడేం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ అధినేత, ఉమ్మడి ఏపీ, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి. జడ్ ప్లస్ కేటగరి భద్రత ఉన్న నేత. అటువంటి నాయకుడి సభ విషయంలో ప్రభుత్వం కనీస భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టకపోవడం వెనుక ఉన్న కారణమేమిటి?
నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాలలో కొనసాగుతున్న చంద్రబాబుకు రోడ్ షోలు కొత్త కాదు. ఆయన సభలకు జనం పోటెత్తడమూ కొత్త కాదు. అయితే ఇలా వరుసగా ఆయన సభలలో తొక్కిసలాటలు జరగడం మాత్రం కొత్తే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సైన్యం బలంగా ఉన్న పార్టీ. క్రమశిక్షణ ఉన్న కార్యకర్తలు ఆ పార్టీకి ఉన్నారు. ఏటా మహానాడులు నిర్వహించుకుంటుంది. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడుకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చినా చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదు. అటువంటిది చంద్రబాబు జిల్లా పర్యటనల్లో అదీ ఇటీవలి కాలంలో ఆ పార్టీ కార్యక్రమాలూ, సభలకూ జనం పోటెతుతున్న సమయంలో వరుస అవాంఛనీయ సంఘటనలు జరగడం, అదీ కేవలం ప్రభుత్వం సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లనే కావడం అనుమానాలకు తావిస్తోంది.
ఇక గుంటూరు సభలో తొక్కిసలాట విషయానికి వస్తే.. కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించి చంద్రబాబు సభా స్థలిని వీడి వెళ్లిన తరువాత తొక్కిసలాట జరిగింది. జనం పెద్ద ఎత్తున హాజరౌతారని ముందే ఊహించిన నిర్వాహకులు దుస్తుల పంపిణీ లబ్ధిదారులందరికీ టోకేన్లు అందజేశారు. టోకెన్లు ఉన్న వారందరికీ పంపిణీ చేస్తామని విస్పష్టంగా చెప్పారు. అయితే.. దుస్తులు అయిపోవచ్చాయి, అందరికీ అందే అవకాశం లేదన్న వదంతులు వ్యాపించడం వల్లే తొక్కిసలాట జరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వదంతులను వ్యాపింప చేసినది ఎవరు? అలాగే ఇలా తొక్కిసలాట జరిగిందో లేదో.. అలా వైసీపీ సామాజిక మాధ్యమం చంద్రబాబుపై దాడి ప్రారంభించేసింది. నిముషాల వ్యవధిలో తొక్కిస లాట వీడియోలు, తొక్కిస లాటకు చంద్రబాబే బాధ్యుడంటూ కొందరి స్పందనను వైసీపీ సోషల్ మీడియా పోస్టులతో హోరెత్తించేసిందిఅన్ని యూట్యూబ్ చానళ్లు.. మీడియాతో మాట్లాడిన మహిళలే మళ్లీ మళ్లీ మాట్లాడటం కూడా అనుమానాలకు తావిచ్చింది.
తొక్కిసలాట జరుగుతుందని ముందే తెలిసి సర్వం సిద్ధంగా ఉన్నారా అనిపించేలా వైసీపీ హడావుడి ఉంది. కందుకూరు తొక్కిస లాట దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రధాని ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తరువాత కానీ స్పందించని ముఖ్యమంత్రి జగన్ గుంటూరు సంఘటన విషయంలో మాత్రం మంత్రి విడదల రజనిని ఆసుపత్రికి పంపి అక్కడి నుంచే తెలుగుదేశంపైనా, చంద్రబాబుపైనా విమర్శల దాడి చేయించారు.
గత మూడున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తోనే పబ్బం గడుపుకుంటూ వస్తోంది. కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఉండే పట్టణం ఒక్కసారిగా రగిలిపోయింది. ఆందోళనలు హింసాత్మకం రూపం దాల్చాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటికి, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ క్యాంపు ఆఫీసుకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఐదు బస్సులను దగ్ధం చేశారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. పలువురు పోలీసులు ఈ దాడిలో గాయపడ్డారు. ఎస్పీ తలకు గాయమైంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన జరిగింది. అయితే ఆ ఆందోళనలో పాల్గొన్న వారు, దాడులకు తెగబడిన వారు, విధ్వంసం సృష్టించిన వారు అందరూ వైసీపీకి చెందిన వారేనని తరువాత తేలింది. దీంతో సర్వత్రా ఆగ్రహం పెల్లుబికింది. దీని నుంచి దృష్టి మరల్చడానికి అప్పటి వరకూ ప్రశాంతంగా జరుగుతున్న రైతుల మహా పాదయాత్రకు అడ్డంకులు సృష్టించి, విశాఖ గర్జన అంటూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందీ వైపీపీయే. ఇలా గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వ తీరును గమనించిన ఎవరైనా తాజాగా చంద్రబాబు సభలలో జరిగిన తొక్కిసలాట సంఘటనల వెనుక కూడా అధికార పార్టీయే ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకీ, చంద్రబాబుకూ పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో తొక్కిసలాటల వెనుక కూడా కుట్ర ఉందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తొక్కిసలాటలు సాకు చూపి చంద్రబాబు సభలు, రోడ్ షోలకు అనుమతి నిరాకరించాలన్నది వైసీపీ సర్కార్ వ్యూహంగా పరిశీలకులు విశ్లేషణలు చేశారు. సరిగ్గా అదే జరిగింది. కాగా అన్ని వర్గాలు ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపడుతున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిందని రోడ్లపై ప్రయాణాలను నిషేధిస్తారా? అని నిలదీస్తున్నాయి.