రామయ్యా! మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తావయ్యా?
posted on Nov 11, 2013 @ 2:05PM
జూ.యన్టీఆర్ కి గత ఏడాదిగా సరయిన హిట్స్ లేవు. ఇటీవల విడుదలయిన ‘రామయ్య వస్తావయ్య’ సినిమా కూడా అంతంత మాత్రమే. అయితే ఇందుకు సినిమా పరంగా ఉండే లోపాలే కాకుండా, కొన్ని రాజకీయ కారణాలు కూడా అతని సినిమాల వైఫల్యానికి కారణమవుతున్నట్లు కనిపిస్తోంది.
అతని ఆత్మీయ స్నేహితుడు కొడాలి నాని వైకాపాలో చేరినప్పటి నుండి యన్టీఆర్ కి ఈ సమస్య మొదలయినట్లు కనిపిస్తోంది. కొడలి ఏ కారణంతో తేదేపాను వీడినప్పటికీ, అతను తెదేపాకు శత్రువుగా పరిగణింపబడే వైకాపాలో చేరడంతో, అప్పటికే యన్టీఆర్ తండ్రి హరికృష్ణకి, చంద్రబాబుకి మధ్య విభేదాలు తలెత్తడంతో, కొడాలి నానికి యన్టీఆర్ ప్రోత్సాహం ఉందని ప్రచారం మొదలయింది.
అయితే దానిని యన్టీఆర్ ఖండించినప్పటికీ, ఆ తరువాత వైకాపా యన్టీఆర్, సీనియర్ యన్టీఆర్ ల ఫోటోలని తన పార్టీ బ్యానర్లలో పెట్టడంతో, పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చాయి. వైకాపా ఆగడాలను బాలకృష్ణ గట్టిగా ఖండించగా, అతని సోదరుడు హరికృష్ణ వాటిని ఖండించకపోగా, స్వర్గీయ యన్టీఆర్ ఫోటోలను ఎవరయినా వాడుకోవచ్చని చెప్పడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.
బాలకృష్ణ గట్టిగా హెచ్చరించినప్పటికీ, యన్టీఆర్ వెంటనే స్పందించకపోవడంతో తండ్రీ కొడుకులు వైకాపా వైపు మళ్ళుతున్నట్లు యన్టీఆర్ అభిమానులలో సైతం అనుమానాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా తెదేపాలో ఉన్నయన్టీఆర్ అభిమానులకు ఇది చాలా బాధ కలిగించింది. బాలకృష్ణ కూడా అతనికి దూరం జరగడంతో, పార్టీలో,బయటా అతని అభిమానులు కూడా క్రమంగా యన్టీఆర్ కి దూరమయ్యారు.
అయితే వారి దూరం మరింత పెంచేందుకు వైకాపా యన్టీఆర్ ని భుజాజనికెత్తుకొంది. కానీ అతనికి పార్టీకి మద్య దూరం పెంచామని రూడీ చేసుకొన్న తరువాత, వైకాపా కూడా యన్టీఆర్ ని పక్కన పడేసింది. దానితో యన్టీఆర్ పరిస్థితి రెంటికీ చెడిన రేవడిలా తయారయింది. గతంలో అతని యావరేజ్ సినిమాలు కూడా ఈ అభిమానుల మద్దతుతో నిలద్రొక్కుకోగలిగేవి. తెదేపాలో, బయటా అతనిపై అభిమానులకున్న అపారమయిన ప్రేమాభిమానలే అతని సినిమాలకి శ్రీరామ రక్షగా నిలిచేవంటే అతిశయోక్తి కాదు.
ఇక హరికృష్ణ చంద్రబాబుకి కానీ, సోదరుడు బాలకృష్ణకు గానీ కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండా సమైక్యాంధ్ర కోసం అంటూ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేయడం ఆనక చైతన్యయాత్రకి సిద్దపడటంతో ఆ తండ్రీకొడుకులు సమైక్యాంధ్ర పల్లవి పాడుతున్న వైకాపా వెంటే ఇంకా ఉన్నారనే అభిప్రాయం అభిమానులలో బలంగా ఏర్పడింది. అంతే గాక ఇది తెలంగాణాలో యన్టీఆర్ సినిమాలపై ప్రభావం చూపిస్తోంది.
కర్ణుడి చావుకి వేయి శాపాలు, వేయి కారణాలన్నట్లు, యన్టీఆర్ సినిమాలు వైఫల్యానికి కూడా ఇప్పుడు అన్నేకారణాలున్నట్లు కనబడుతున్నాయి. మొదట సినిమాపరంగా లోపాలు, రాజకీయ కారణాలు, అభిమానుల మద్దతు కరువవడం, తండ్రికి నిలకడలేకపోవడం, తను స్వయంగా పార్టీకి దూరంగా ఉండిపోవడం వంటివి ఎన్నయినా చెప్పుకోవచ్చును.
అయితే అతను మొదట తన సినిమాల ద్వారా ఏవిధంగా తనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఏర్పరుచుకొన్నాడో, ఇప్పుడు కూడా మళ్ళీ అదేవిధంగా తన సినిమాలతోనే సత్తా చాటుకొంటే మళ్ళీ అందరూ క్రమంగా దగ్గిరవుతారు. కానీ, తన సినిమాలలో “ఎవరు పడితే వారు బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా. అలా అనాలంటే....”వంటి డైలాగులకి అతను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవి అతని సినిమాని విజయవంతం చేయలేకపోవచ్చును. గానీ, అతనిపట్ల వ్యతిరేఖతను మాత్రం మరింత పెంచగలవని అతను గ్రహించాలి.