తెలంగాణాపై బీజేపీ యూ టర్న్
posted on Nov 12, 2013 @ 3:11PM
బీజేపీ మొదటి నుండి చిన్న రాష్ట్రాలకి మొగ్గుచూపుతోంది గనుక తెలంగాణా ఏర్పాటుకి కూడా నిసందేహంగా, బేషరతుగా తన మద్దతు ప్రకటించింది. అయితే తాము ఏ కాంగ్రెస్ పార్టీని ఓడించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచాలని భావిస్తున్నారో, తాము టీ-బిల్లుకి మద్దతు ఇస్తే, అదే పార్టీని గెలిపించడానికి స్వయంగా సహకరించినట్లవుతుందనే ఆలోచన మొదలయినప్పటి నుండి, బీజేపీ కూడా తెలంగాణాపై రకరకాలుగా మాట్లాడుతోంది.
కానీ, అనేక వేదికల మీద రాజ్ నాథ్ సింగ్, మోడీ, సుష్మస్వరాజ్ వంటి సీనియర్ నేతలు తమ పార్టీ నిర్ద్వందంగా, భేషరతుగా తెలంగాణాకు మద్దతు ఇస్తుందని ప్రకటించినందున ఇప్పుడు వెనక్కి తగ్గితే, తెలంగాణాలో ఉన్న సీట్లు కూడా దక్కవేమోననే భయం కూడా వెంటాడుతోంది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఈ శీతాకాల సమావేశాలలోనే పార్లమెంటులో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టడానికి సిద్దం అవుతున్నట్లు ప్రకటించడంతో దానికి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించినందుకు బీజేపీ ఇప్పుడు లెంపలు వేసుకొని, తెలివిగా తప్పుకోవడానికి మార్గాలు వెదుకుతోంది.
ఈరోజు కేంద్రమంత్రుల బృందం అధ్యక్షుడు హోం మంత్రి షిండే నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో బీజేపీ ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటుకోసం తగిన సలహాలు సూచనలు చేయవలసి ఉంది. కానీ, బీజేపీ తరపున సమావేశానికి హాజరయిన కిషన్ రెడ్డి అందుకు విరుద్దంగా వ్యవహరిస్తూ, కేంద్రమంత్రుల బృందం కోరుతున్న 11అంశాలపై తన వద్ద తగిన సమాచారమేది లేదని, అయితే ఇతర పార్టీలని సలహాలు, సూచనలు కోరేముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన ఏవిధంగా చేయాలనుకొంటోందో ముందుగా చెప్పాలని డిమాండ్ చేసి, నెపం కాంగ్రెస్ పైకి నెట్టి చేతులు దులుపుకొని చక్కా బయటకి వచ్చారు.
చిన్న రాష్ట్రాలు కోరుతున్న బీజేపీ అవి ఏర్పడుతున్నపుడు అందుకు తగిన సలహాలు ఇచ్చి ఈ అవకాశాన్ని సద్వివినియోగం చేసుకొని ఉండాలి. కానీ, మారిన ఆలోచనల కారణంగా, దాని ప్రవర్తన కూడా మారిందిప్పుడు. ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, “ఎటువంటి షరతులు, ఆంక్షలు లేని తెలంగాణా రాష్ట్రమే మాకు కావాలి. ఎటువంటి ఆంక్షలున్నా తెలంగాణా బిల్లుకి మా పార్టీ మద్దతు ఇవ్వదు,” అని ప్రకటించడం మారిన బీజేపీ ఆలోచనలకి అద్దం పడుతోంది.
హైదరాబాదుతో సహా అనేక అంశాలపై అనేక ఆంక్షలు, షరతులు విదించక తప్పనిసరి పరిస్థితి నెలకొనడంతో ఈ గడ్డు సమస్య నుండి ఏవిధంగా బయటపడాలా? అని కాంగ్రెస్ పార్టీ లోలోన దిగులుపడుతూనే పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఒకవేళ బీజేపీ గనుక టీ-బిల్లుకి పార్లమెంటులో మద్దతు ఈయని పక్షంలో అది పార్లమెంటు ఆమోదం పొందలేదు. అదే జరిగితే కాంగ్రెస్ సీమాంధ్రలోనే కాక తెలంగాణాలో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడం ఖాయం.
కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా ఇస్తున్నఈ సువర్ణావకాశాన్నివదులుకోనేంత తెలివి తక్కువది కాదు బీజేపీ. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నమాట.