రాష్ట్ర విభజన తరువాత నేతలు సంఘ సంస్కర్తలుగా మారిపోతారా?
posted on Nov 10, 2013 @ 3:45PM
గత యాబై సం.లుగా తెలంగాణా ప్రజలు సీమాంధ్ర రాజకీయ నేతల, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారుల దోపిడీకి గురవుతూనే ఉన్నారని తెరాస నేతల వాదన. తమ పదేళ్ళ పోరాటాల వలననే నేడు తెలంగాణా రాష్ట్రం ఏర్పడబోతోందని, కానీ ఇప్పటికీ సీమాంధ్రులు సైంధవులవలే అడ్డుపడుతున్నారని వాదిస్తున్నారు.
అయితే, తెలంగాణా ఉద్యమం అడ్డుపెట్టుకొని కేసీఆర్ కుటుంబం, కొందరు తెరాస నేతలు ఏవిధంగా బలవంతపు వసూళ్ళకు పాల్పడ్డారో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదలుకొని, తెరాస నుండి బహిష్కరింపబడిన రఘునందన్ రావు వరకు చాలా మందే దృవీకరించారు. వారందరి సంగతి ఎలా ఉన్నపటికీ ఇటీవల తమిళనాడు అధికారి విజయ్ కుమార్ నేతృత్వంలో కేంద్రం ఏర్పరచిన టాస్క్ ఫోర్సు బృందం కూడా కేంద్రానికి అదేవిధంగా నివేదిక సమర్పించిందని తెరాస నేతలే స్వయంగా చాటుకోవడం విశేషం.
షరా మామూలుగానే సీమాంద్రుల ఒత్తిడి మేరకు ఇచ్చిన ఆ టాస్క్ ఫోర్స్ నివేదిక తమకు అంగీకారం కాబోదని వాదిస్తున్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లు, తాము ఏ తప్పు చేయకపోతే మరి టాస్క్ ఫోర్స్ ఇచ్చిన నివేదికను చూసి వారెందుకు ఉలికిపడుతున్నారు?
ఎందరో ప్రజల త్యాగాల కారణంగా తెలంగాణా ఏర్పడుతోందని చెపుతున్న కేసీఆర్, మరి తెలంగాణా కోసం తన కుటుంబంలో ఎవరెవరు ఏమేమి త్యాగాలు చేసారో చెప్పగలరా? విద్యార్ధులు తమ బంగారు భవిష్యత్తుని, చివరికి ప్రాణాలను కూడా త్యాగం చేసి పోరాడితే, ఇప్పుడు ఆ త్యాగ ఫలితాలు కేసీఆర్ కుటుంబం, టీ-కాంగ్రెస్ నేతలే ఎందుకు అనుభవించాలని కొంటున్నారు? అదే విధంగా న్యాయమవుతుంది?
భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మహాత్మా గాంధీజీ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని సూచించారు. ఎందుకంటే ఆ తరువాత ఆ పార్టీ స్వాతంత్ర సంగ్రామం పేరు చెప్పుకొని లబ్దిపొందాలని ప్రయత్నిస్తుందని ఆయన అభిప్రాయం. మహాత్ముడు ఊహించినట్లే జరుగుతుండటం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు తెరాస కూడా కాంగ్రెస్ బాటలోనే సాగాలనుకొంటున్నట్లు అర్ధం అవుతుంది.
కారణాలేవయితినేమి, ఒకపక్క కాంగ్రెస్ పార్టీ వీలయినంత త్వరగా తెలంగాణా ఏర్పాటు చేయాలని ఆరాటపడుతుంటే, ముందు అంగీకరించినట్లు తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా, కేసీఆర్ తన కుటుంబ సభ్యులకి మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు, పార్టీ టికెట్స్ కోసం కాంగ్రెస్ తో బేరాలాడుకొంటూ రాష్ట్ర ఏర్పాటుకి మొకాలడ్డడం తెలంగాణాకి అన్యాయం చేయడం కాదా? తెలంగాణా ఏర్పాటుకి సీమాంధ్ర నేతలు సైంధవులులా అడ్డు తగులుతున్నారని చెపుతున్న తెరాస కూడాఎందుకు అడ్డుపడుతోంది? పార్టీని రద్దు చేసో, లేక కాంగ్రెస్ లో విలీనం చేసో తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమం చేయడం లేదెందుకని?
తెలంగాణా రాష్ట్రం ఇంకా ఏర్పడక మునుపే ముఖ్యమంత్రి పదవి కోసం కీచులాడుకొంటున్న టీ-కాంగ్రెస్ నేతలు, తెలంగాణాలో మొదటి ప్రభుత్వం మేమంటే మేమే ఏర్పాటు చేస్తామని అధికారం కోసం ఇప్పటి నుంచే అర్రులు చాస్తున్న టీ-కాంగ్రెస్ నేతలు రేపు తెలంగాణా రాష్ట్రాన్నిఏమి ఉద్దరిస్తారో కాలమే చెపుతుంది.
రాష్ట్రం విడిపోవచ్చు. సరిహద్దులు మారవచ్చు. కానీ అవే పార్టీలు, వారే నేతలు. వారి ఏలుబడే సాగుతుంది. అటువంటప్పుడు ప్రజల బ్రతుకుల్లో కూడా ఎటువంటి గొప్ప మార్పులు ఉండబోవు. అది తెలంగాణా అయినా ఆంధ్రప్రదేశ్ అయినా కూడా!