బీజేపీ ఎంపీల్లో 45 మంది వారసులు.. కుటుంబ పార్టీగా మారుతోందా?
posted on Sep 23, 2021 @ 3:35PM
జాతీయ స్థాయిలో కుటుంబ వారసత్వ రాజకీయాలు అనగానే అందరికీ కాంగ్రెస్ పార్టీనే గుర్తుకు వస్తుంది. నెహ్రూ గాంధీ కుటుంబమే కళ్ళ ముందు కొస్తుంది. అందుకు కారణముంది. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు నాలుగు తరాలుగా గాంధీలే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో కీలక భూమికను పోషిస్తూ వచ్చారు. అలాగే జాతీయ స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలోనూ కాంగ్రెస్ కుటుంబాలు కనిపిస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రుల విషయాన్నే తీసుకున్నా కాసుబ్రహ్మ నంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, పీవీ నరసింహ రావు, జలగం వెంగళ రావు, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, వైఎస్స్ రాజ శేఖర రెడ్డి, ఇలా కనీసం ఓ పది మంది మాజీల సంతానం. పుత్ర పౌత్రులు రాజకీయాలలో ఉన్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వారసులను కూడా లెక్కలోకి తీసుకుంటే.. ఒక్క అవిభక్త ఆంద్ర ప్రదేశ్ రాష్టంలోనే వారసత్వ రాజకీయాలలో మునిగి తేలుతున్న కుటుంబాలు ఓ వంద వరకు తేలతాయి. ఇక ప్రాంతీయ పార్టీల విషయం అయితే చెప్పనే అక్కరలేదు.
అయితే కుటుంబ వారసత్వ రాజకీయాలు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పేటెంట్ హక్కా, అంటే కాదు. కాంగ్రెస్ పార్టీని అదే పనిగా, కుటుంబ వారసత్వ పార్టీ అని ఎద్దేవా చేసే, బీజేపీలోనూ వారసులకు కొదవ లేదు. నిజనికి, పక్కగా లెక్కలు తీస్తే, కాంగ్రెస్ కంటే బీజేపీలోనే వారసత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ వయసు ఎక్కువ. జస్ట్ ఎక్కువ కాదు, ఇంచు మించుగా మూడు రెట్లు ఎక్కువ. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రాలలోనూ ఎక్కువ కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇంత వరకు దేశంలో ముఖ్యమంత్రులుగా, మత్రులుగా పనిచేసిన మాజీల చిట్టా తీస్తే మూడొంతులకు పైగా కాంగ్రెస్ నాయకులే ఉంటారు, కాబట్టి సహజంగానే పార్టీలో వారసులు ఎక్కువ కనిపిస్తారు. ఎక్కువ మంది నాయకులున్నారు కాబట్టి ఎక్కువ మంది వారసులు కనిపిస్తారు.
బీజేపీ, నిన్నగాక మొన్న పుట్టిన పార్టీ, ఒక 30-35 ఏళ్లకు ముందు, బీజేపీకి గానీ దాని పూర్వ రూపం, 1951లో పుట్టిన భారతీయ జన సంఘ్ పార్టీకి గానీ అధికారం అంటే ఏమిటో చాలా కాలం పాటు తెలియనే తెలియదు. కాబట్టి సాపేక్షంగా చూస్తే, బీజేపీలో వారసత్వ వాసనలు అసలే లేవని అన్నా, అనుకున్నా అది ఆత్మ వంచన, తప్ప మరొకటి కాదు. నిన్న గాక మొన్న అధికారం రుచి మరిగిన బీజేపీలోనూ... ఇప్పటికే అనేక మంది వారసులు కనిపిస్తారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, రిపున్ బోరా తెలిపిన తాజా వివారాల ప్రకారం ప్రస్తుత పార్లమెంట్ ఉభయ సభలలో కలిపి బీజేపీకి 388 మంది ఎంపీలుంటే అందులో 45 మంది వారసత్వ నిచ్చెనలెక్కి పైకొచ్చిన వారే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఈ నిష్పత్తిలో వారసత్వ ఎంపీలు లేరు. ఎంపీలే కాదు, ప్రస్తుత కేంద్ర మంత్రుల లోనూ వారసులున్నారు. అనురాగ్ ఠాగూర్, పీయూష్ గోయల్, ధర్మేంద ప్రధాన్ వారసత్వ కోటాలో మంత్రి పదవులు పొందారు.
ఇక కొత్తగా కాషాయం కట్టిన జ్యోతిరాదిత్య సింధియాకు, ఇటు కాంగ్రెస్ వారసత్వం, అటు బీజేపీ వారసత్వం రెందు ఉన్నాయి. (బీజేపీ సీనియర్ నాయకురాలు రాజమాత విజయ రాజే సింధియా, మనవడే జ్యోతిరాదిత్య). అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఫ్యామిలీకి చెందిన మేనక గాంధీ.. మోడీ మొదటి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీగా ఉన్నారు. కేంద్రంలోనే కాదు రాష్రామెలలో కూడా సీనియర్ బీజేపే నాయకుల సంతానం రాజకీయాలలో ఉన్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమత్రి యడ్యూరప్ప కుమారుడు, ఇలా చెప్పుకుంటూ పోతే కమల దళంలోనూ వారసులకు కొదవలేదు. మన రాష్ట్రంలో , కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయ లక్ష్మి రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు.
అదలా ఉంటే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురు ప్రధానులు అయితే, అందులో ముగ్గురు మాత్రమే గాంధీ కుటుంబం నుంచి వచ్చారు. మిగిలిన ముగ్గురు (లాల్ బహదూర్ శాస్త్రి, పీ నరసింహ రావు, మన్మోహన్ సింగ్ ) బయటి వారే ఉన్నారని బోరా అన్నారు. అంతే కాదు 2004, 2009లో ప్రధాని పదవి పొందే ఆవకాశం తలుపు తట్టినా సోనియా గాంధీ తృణప్రాయంగా వదిలేశారని బోరా గుర్తి చేశారు. అలాగే , రాహుల్ గాంధీ, మంత్రి వర్గంలో చేరాలని స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ చేతులు కట్టుకుని వేడుకున్నా, రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించారని,అలాంటి త్యాగాలు చేసినవారిని, బీజేపీ నాయకులు కుటుంబ పాలన, వారసత్వ పాలన అంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందని బోరా అన్నారు. నిజమే కదా, గురువింద గింజ తన నలుపు ఎరుగదు .. కదా ..