ఏదైనా జెసి మాస్టారి లెక్కే వేరు..
posted on Apr 7, 2020 @ 10:28AM
* పాపం పెరిగింది కాబట్టే, దేవుడు కరోనాను పంపాడు: దివాకర్ రెడ్డి
జె సి దివాకర్ రెడ్డి, వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్. ఆయన కరోనా మీద కరుణ చూపలేదు, కరోనా వంటి కష్టమైన పరిస్థితిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూనే, పాపం బాగా పెరిగినప్పుడు.. ప్రకృతి, దేవుడు ఇలాంటిది ఒకటి సృష్టించి జనాలను తగ్గిస్తుంటారు అని వ్యాఖ్యానించారు. ప్రతి 100 ఏళ్లకు ఒకసారి ఇలాంటివి జరుగుతున్నాయని.. పాపం అంటే చంపడం, నరకడం కాదు.. దుర్మార్గమైన వాతావరణాన్ని మనం సృష్టించబడం అన్నారు. దేవుడు, ప్రకృతి దానంతట అదే కేర్ తీసుకుంటుంది అన్నారు. కొంత కంట్రోల్ చేయడానికి చూస్తుందని.. ఇంతటి పెద్ద విపత్తు ఎవరూ చూడలేదన్నారు. ఇది మానవ జాతికి ఓ హెచ్చరిక.. శుభ్రంగా ఉండాలని ప్రకృతిహెచ్చరిస్తోందని తన అభిప్రాయం అన్నారు జేసీ.
కరోనా నియంత్ర కోసం పోలీసులు, డాక్టర్లు బాగా పోరాడుతున్నారని జేసీ వ్యాఖ్యానించారు. దీన్ని తప్పుబట్టడం సరికాదు.. రాజకీయాల కోసం కరోనాను ఉపయోగించుకోవడం పద్దతి కాదన్నారు. ప్రధాని మోదీ కూడా కరోనాను కట్టడి చేసేందుకు చాలా కష్టపడుతున్నారని.. అయినా తప్పు జరిగితే ప్రజలదే తప్ప.. ప్రభుత్వాలది కాదన్నారు. ఏది ఏమైనా ఈ మహమ్మారి నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని ఆకాంక్షించారు. కరోనా సమయంలో రైతుల సమస్యలపై జేసీ స్పందించారు. రైతు నిజంగా చాలా కష్టపడతారని.. మిగతా దేశాల్లో పరిస్థితి వేరు.. ఇక్కడ పరిస్థితి వేరు అన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం బావుంటుందని చెప్పిన జె సి, ఈ ప్రభుత్వానికి తాను వ్యతిరేకమని బాహాటంగా ప్రకటించారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు పదివేలు సాయం చేశారని,] చంద్రబాబుకు ఓట్లు వేస్తారనుకున్నానని, కానీ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యాను అని జె సి దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఓ పక్క టీ డీ పీ అధినేత, జూమ్ కాన్ఫరెన్సులు ఏర్పాటు చేసి మరీ పబ్లిక్ లో మైలేజ్ కోసం సాంకేతికంగా విపరీతంగా శ్రమిస్తున్నా, ఆయనకన్నా సోషల్ మీడియా లో జె సి దివాకర్ రెడ్డే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్నారు. ఏది ఏమైనా, పబ్లిక్ అటెన్షన్ డ్రా చేయటం లో జె సి మాస్టారు రెండాకులు ఎక్కువే తిన్నారు..ఒప్పుకోవాల్సిందే మరి!