ఆకలితో అలమటిస్తున్న నేత కార్మికులు!
posted on Apr 7, 2020 9:14AM
కొనేవారులేక పోవడంతో కర్నూల్ జిల్లాలో పట్టుచీరల నిల్వలు పేరుకుపోతున్నాయి. జిల్లాలో చేనేత కుటుంబాలు 3 లక్షలు పైనే వున్నాయి. అందులో మగ్గం నేసే నేతన్న కుటుంబాలు 60 వేలు పైచిలుకు వున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా జరీ, రేషమ్, నూలు దొరకటం లేదు. మరో పక్క మార్చి నెలకు సంబంధించి 10 లక్షల పట్టు చీరలు కొనేవారు లేక నిల్వ ఉన్నాయి.
మాస్టర్ వీవేర్స్ నిజమైన నేతన్నకు కూలి డబ్బులు ఇవ్వక పోవడంతో వారి కుటుంబం మొత్తం ఆకలితో అలమటిస్తోంది. కుటుంబం మొత్తం చీర నేసిన రోజు నేత కార్మికుడికి సరాసరి కూలి 150 మాత్రమే.
చేసిన అప్పులు తీర్చలేక, పెరిగిన ధరలతో ముడిసరుకు కొనలేక, నేసిన చీరకు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కొంతలో కొంత నేతన్న నేస్తం పథకం ధ్వారా ఊరట లభించిన.. అది అంతంత మాత్రమేనని నేత కార్మికుల రాష్ట్ర కార్యదర్శి కోదండరామ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నని ఆదుకోవాలని ఆన్లైన్ లో అమెజాన్ వంటి వారితో మార్కెట్ ఒప్పందం చేసుకున్న అది నేతన్న కంటే దళారి వ్యవస్థకు బాగా ఉపయోగపడిందని ఆయన కోదండరామ్ ఆరోపించారు.
లాక్ డౌన్ పిరియాడ్లో తక్షణ సహాయం క్రింద ఎవరైతే నిజమైన నేత కార్మికులు ఉన్నారో వారి లిస్ట్ తయారు చేసి వారి కుటుంబానికి 10000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని నేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.