కోవిడ్ -19 లాక్‌డౌన్ సడలింపుపై యాక్షన్ ప్లాన్ సిద్ధమా?
posted on Apr 7, 2020 @ 11:04AM
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను సడలించేందుకు ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్రమోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో ఆయన ఈ విషయంపై చర్చించారు.
14వ తేదీ వరకూ విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించాలా వద్దా అనేది దేశవ్యాప్తంగా ఒకే తీరున తీసుకోవాల్సిన నిర్ణయం కాదని ఆయన తేల్చిచెప్పారు. ‘కరోనా ప్రబలంగా ఉన్న ప్రాంతాలను- అంటే హాట్‌స్పాట్స్‌ను వదిలేసి మిగిలిన చోట్ల ఒక్కో శాఖ నెమ్మదిగా తమ కార్యకలాపాలు నిర్వర్తించుకునేలా ఓ ప్రణాళికను రూపొందించమని ప్రధాని సూచించారు.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, దానిని కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఆయన మంత్రివర్గంతో చర్చించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. అన్ని మంత్రిత్వ శాఖలు పనుల కొనసాగింపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంక్షల సడలింపు- భౌతిక దూరం పాటించడం రెండూ ఒకసారి జరగేట్లు చూడాలి. లాక్ డౌన్ ముగిసిన వెంటనే తమ తమ శాఖల్లో తీసుకోవాల్సిన పది ప్రధాన నిర్ణయాలు, పది ప్రధాన రంగాలను ముందే నిర్ణయించాలని మోదీ మంత్రులకు సూచించారు.
కరోనా ప్రభావాన్ని ఆర్థిక వ్యవస్థపై తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం పనిచేయాల్సి ఉంటుందని మోడీ భావిస్తున్నారు.