మేయర్‌గారికి లేఖ!
posted on Feb 13, 2016 @ 10:57AM
బొంతు రామ్మోహన్‌గారికి,
మేయర్ పదవిని అందుకున్న ఈ సందర్భంలో ఈ సామాన్యుడి అభినందనలు అందుకోండి. నాలాంటి మరో 30 లక్షల మంది సామాన్యులు ఓటేసి నిర్ణయించిన గ్రేటర్ పీఠానికి, మీరు సారధిగా ఎన్నికవడం సంతోషకరమే! తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ఆ సందర్భంగా చర్లపల్లి జైలుకి వెళ్లిన మీరు, ఇప్పడు అదే చర్లపల్లి వార్డు నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికకావడం గొప్ప విషయమే! కానీ రానున్న రోజులలో మేయర్‌గా మీరు సాధించే విజయాలే మా జీవితాలని ప్రభావితం చేయనున్నాయి.
హైదరాబాద్ అంటే అంతో మినీ భారతదేశం అన్న ఊహ కలుగుతుంది. ఇక్కడ పరిశ్రమలు ఉన్నాయని ఉద్యోగం కోసం వచ్చినవారు కొందరైతే, పనిదొరకకపోతుందా అని పొట్ట చేతపట్టుకుని వచ్చినవారు మరికొందరు. ఆర్భాటాలే కాదు... ఇక్కడ ఆకలి కేకలు కూడా వినిపిస్తాయి. విశాలమైన రోడ్లే కాదు... వాటి పక్కనే పడుకుని ఉండే పేదరికం కూడా కనిపిస్తుంది. దాదాపు కోటి మంది జనం నిత్యం సమస్యలతో, పోరాటాలతో అలసిపోయి మీ వంక ఆశగా చూస్తున్నారు. మీరు ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లు ఎవరికన్నా ఏదన్నా ఉచితంగా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ ఏమిచ్చినా ఇవ్వకున్నా మౌలిక సదుపాయాలను మాత్రం దయచేసి కల్పించండి. ఎందుకంటే ఇప్పడు హైదరాబాదులో చిన్నచిన్న సదుపాయాలు కూడా సామాన్యుడిని వెక్కిరించేంత దూరంలో ఉన్నాయి.
ఎండాకాలం వస్తోందంటే చాలు, హైదరాబాదు గుండెలు ఎండిపోతాయి. అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఇక్కడ నుంచి నీళ్లు తెప్పిస్తున్నాం అన్న మాటలు వినిపిస్తాయే కానీ పంపుల్లోంచి గాలి తప్ప నీరు రాదు. నగరాన్ని నీటి ఎద్దడి నుంచి కాపాడేందుకు ఇప్పటివరకూ ఏ ప్రభుత్వమూ శాశ్వతమమైన చర్యలేవీ తీసుకున్నట్లు కనిపించదు. ఈ ఎండాకాలం ఎలాగొలా గడిపేస్తే ప్రజలు మర్చిపోతారు కదా అన్నది పాలకుల భావన కావచ్చు. మీరైనా ఈ నగరానికి గుక్కెడు నీళ్లు దక్కే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను. గొంతు తడుపుకునేందుకు మినరల్ వాటర్ తప్ప మరో దిక్కు లేని రోజులు పోవాలన్నది నగరప్రజల తరఫున నా కోరిక.
ఎండలు తగ్గి మన రోడ్ల మీద నాలుగు చినుకులు పడగానే వేరే సమస్య మొదలు. అదేంటోగానీ వర్షం కురిసిన తరువాత మన హైదరాబాదు అచ్చు వెనిస్ నగరంలా ఉంటుంది. నీటి మధ్య ఇళ్లు కట్టుకున్నామన్న భావన కలుగుతుంది. కాకపోతే ఏది రోడ్డో, ఏది మురికి కాలువో అర్థం కాదు అంతే! దయచేసి ఈ అయోమయం నుంచి మమ్మల్ని తప్పించగలరు. రోడ్లంటే గుర్తుకువచ్చింది. ఒక దేశానికి రోడ్లే రక్తనాళాలు అంటారు. అదే నిజమైతే మన హైదరాబాద్‌లో రోడ్లకి చాలా జబ్బులే ఉన్నట్లు కనిపిస్తాయి. రోడ్ల నిండా గతుకులే గతుకులు! రోడ్ల పక్కన డ్రైనేజీలు కరువు. పోనీ ప్రయాణమన్నా వేగంగా ఉంటుందా అంటో ఒకో కిలోమీటరు, ఆటోమీటరు కంటే నిదానంగా కదులుతుంది. ట్రాఫిక్, డ్రైనేజ్, గతుకులు, కాలుష్యం... ఓహ్! హైదరాబాదు రోడ్ల మీద ప్రయాణం... జీవితకాలపు అనుభవంగా మిగిలిపోతుంది. మీ ఉచితాల సంగతి నాకు తెలియదు. మీ ఎన్నికల హామీల గురించీ నేను పదే పదే అడగను. కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తే సంతోషం, డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చినా సంతోషమే... కానీ నాకు కావల్సిందల్లా నగరజీవనం సుఖంగా ఎలాంటి అడ్డంకీ లేకుండా సాగిపోవడమే! ఇంట్లో నిరంతర విద్యుత్తు, ఇంటి బయట మంచి రోడ్లు, ఇంటికీ రోడ్లకీ మధ్యన చక్కటి డ్రైనేజి... ఇవే నాకు కావాలి. కాలుష్యం లేని గాలి, కాల్పులు వినిపించని ఊరు, కావల్సినంత నీరు... ఇవే నాకు కావాలి.
ఇట్లు,
మీ క్షేమం, మా క్షేమం కోరుకునే...
ఓ సామాన్యుడు.