అధ్వాన్న రోడ్లపై 2 లక్షల ట్వీట్స్.. ట్రెండింగ్ లో జగనన్న సర్కార్
posted on Sep 4, 2021 @ 10:10AM
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అన్ని సమస్యలే. జగన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్యులకు కనీస అవసరాలు కూడా దొరకడం లేదని అంటున్నారు. ఏపీలో రోడ్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓ వైపు భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరలతో అల్లాడుతున్న జనాలను నరకకూపంగా మారిన రోడ్లు మరింత భయపెడుతున్నాయి. ఏపీలో రోడ్లు ఎక్కడచూసినా గుంతలమయమే, అడుగుకో గుంత, గజానికో గొయ్యిలా రోడ్లు తయారయ్యాయి. పట్నం, పల్లె తేడా లేకుండా ఎక్కడ చూసినా అధ్వాన్న రోడ్లపై. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై కార్లు పడిపోయే సైజులో గంతులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించచ్చు. గతుకుల రోడ్లపై ప్రయాణిస్తూ వేలాది మంది జనాలు హాస్పిటల్ పాలవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై కొంత కాలంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ పోరాటం చేస్తోంది. రెండు రోజులుగా జనసేన కూడా రంగంలోకి దిగింది. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో జన సైనికులు అధ్వాన్న రోడ్లను బాగు చేయాలంటూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు కు విశేష స్పందన వచ్చింది. ఏపీలో అధ్వాన్నపు రహదారులపై లక్షల కొద్దీ ట్వీట్స్ వచ్చాయి. గుంతల మధ్య రోడ్లను కళ్ళకు కట్టేలా ఉన్న ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో జనాలు అప్ లోడ్ చేశారు. #JSPForAP_Roads హ్యాష్ ట్యాగ్ తో రెండు రోజుల్లో దాదాపు 2 లక్షల ట్వీట్స్ వచ్చాయి. 200 మిలియన్లకు #JSPForAP_Roads ద్వారా రోడ్ల దుస్థితి రీచ్ అయిందని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ కార్యక్రమం శనివారంతో ముగియనుండటంతో ట్వీట్లు మరిన్ని వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలనలో రోడ్ల దుస్థితిపై జనసేన చేపట్టిన ఉద్యమం ట్విట్టర్ ట్రెండింగ్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో, జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. రోడ్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో ప్రజలే చూపించారంటున్నారు జనసేన నేతలు. గజానికో గొయ్యిలా రాష్ట్రంలో రహదారులు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెప్పిన విషయం అక్షర సత్యమని చెబుతున్నారు. ఈ డిజిటల్ ఉద్యమంలో వస్తున్న ఫోటోలు, వీడియోలు చూస్తే ఏపీలో రహదారుల పరిస్థితి ఏంటో అందరకీ అర్థం అవుతుందని జనసైనికులు అంటున్నారు. నెల రోజుల్లో ఈ రోడ్ల ను ప్రభుత్వం బాగు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే అక్టోబర్2వ తేదీ నుంచి శ్రమదానం తో జన సైనికులే బాగు చేయాలని పవన్ కల్యాణ్ పిలుపిచ్చారు.