ఏపీలో పాలనంతా అవినీతిమయం! వైసీపీ ఎమ్మెల్యేల సంచలనం..
posted on Sep 3, 2021 @ 8:23PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోతుందని కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇసుక, లిక్కర్, మైనింగ్... ఇలా అన్నింటిలోనూ వైసీపీ ప్రజా ప్రతినిధులు భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిపై కొందరు కోర్టులకు కూడా వెళ్లారు. న్యాయస్థానాల ఆదేశాలతో విచారణలు కూడా జరుగుతున్నాయి. అయితే తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయం చెప్పడం కలకలం రేపుతోంది.
గుంటూరు జిల్లా సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి పౌరసరఫరాలశాఖాధికారుల అక్రమాలకు అంతులేదని ఆరోపించారు. వారానికి రెండు, మూడు లారీల రేషన్ బియ్యం పట్టుబడుతోందని తెలిపారు. ఒక్క నియోజకవర్గంలోనే ఇంత పట్టుబడితే జిల్లా వ్యాప్తంగా ఎంత బియ్యం అక్రమంగా తరలుతోందని ప్రశ్నించారు. అక్రమ రేషన్ పట్టుబడితే నామమాత్రపు కేసులు పెడుతున్నారని విమర్శించారు మంగళగిరి నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే రామక్రిష్ణారెడ్డి మండిపడ్డారు.
ఇక వినుకొండ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని బహిరంగంగానే అంగీకరించారు. సాగునీటి అంశంపై డిఆర్సీలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చేతగాని తనం వల్ల ప్రజలతో మాటలు పడుతున్నామని వైసీపీ ఎమ్మెల్యే వాపోయారు. రైతులకు ఉన్న పరిజ్ఞానం కూడా ఇరిగేషన్ అధికారులకు లేదని తప్పుబట్టారు. నీళ్లు అంతా సముద్రం పాలు అవుతుందని, నీళ్లు లేనప్పుడు వారబందీ పెట్టాలన్నారు. వరదలు వస్తున్నప్పుడు వారబందీ ఏంటని అధికారులను బ్రహ్మనాయుడు నిలదీశారు. నీళ్లు ఇవ్వలేక పోవడంతో ఎమ్మెల్యేలను రైతులు పిచ్చోళ్లలా చూస్తున్నారని బ్రహ్మనాయుడు మండిపడ్డారు.
అవినీతి, అక్రమాలపై ఇంతకాలం ప్రతిపక్షాలు మాట్లాడుతుండగా కౌంటరిచ్చింది వైసీపీ. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని కొందరు వైసీపీ నేతలు చెప్పారు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఓపెన్ గానే అవినీతి జరుగుతుందని చెప్పడం కాక రేపుతోంది. తాము చెప్పిందో నిజమైందనని, వైసీపీ నేతలే అక్రమాలు జరుగుతున్నాయని అంగీకరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మంగళగిరి, వినుకొండ ఎమ్మెల్యేల కామెంట్లు వైసీపీని షేక్ చేస్తున్నాయి.