రఘురామ ఎంట్రీ అదుర్స్.. ఫాలోయింగ్ మామూలుగా లేదుగా..
posted on Dec 17, 2021 @ 2:20PM
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు సుదీర్ఘ విరామం తర్వాత తెలుగు నేలపై అడుగుపెట్టారు. అప్పట్లో సీఐడీ కస్టడీ ఎపిసోడ్ తర్వాత ఢిల్లీకే పరిమితం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏపీలో అడుగుపెట్టిందే లేదు. ఏపీ రాజధాని అమరావతి రైతుల మహా సభకు మద్దతుగా రఘురామ తిరుపతికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణుగుంట విమానాశ్రయంలో దిగారు. రఘురామ వస్తున్నారనే విషయం తెలిసి.. ఆయన్ను చూసేందుకు, కలుసుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. జై రఘురామ.. జగన్‌కు కరెక్ట్ మొగుడు.. అంటూ నినాదాలు చేశారు.
అమరావతి పరిరక్షణ మహోద్యమ సభలో పాల్గొనేందుకు తిరుపతి వచ్చానని రఘురామ చెప్పారు. అడ్డం పడే మేఘాలు అశాశ్వతం, అమరావతే శాశ్వతం.. అంటూ వ్యాఖ్యానించారు. న్యాయపరంగా 100 శాతం అమరావతే రాజధానిగా ఉంటుందన్నారు.
తిరుపతిలో జరిగేది దగాపడ్డ రైతుల సభ.. ఇది రాజకీయ సభ కాదన్నారు. ఈ సభ తరువాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఉండరని చెప్పారు. పడ్డవాడు చెడ్డవాడు కాదని.. చంద్రబాబు చెడ్డవాడు కానే కాదని రఘురామ అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు అరువు మాటలని చెప్పారు. సత్తిబాబు చెడ్డవాడు కాదు.. మంచి వాడని తాను అనడంలేదన్నారు. మనం జాలి పడాలి తప్ప బొత్స మాటలు విని బాధపడకూడదని రఘురామ అన్నారు.