రాష్ట్ర విభజన ఒక్క రోజు నిర్ణయం కాదు
posted on Aug 5, 2013 @ 3:37PM
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు. మూడేళ్లుగా జరిగిన సంప్రదింపులు, చర్చల అనంతరం ఈ సాహసోపేతమయిన నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం తీసుకుందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ గుర్తించిందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. గత 60 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం అనేక రకాలుగా జరుగుతూ వస్తుందని, ఎందరో అమరులు బలిదానాలు చేశారని, 1969లో తుపాకి కాల్పుల్లో చనిపోతే, మలిదశ ఉద్యమంలో తమను తాము కాల్చుకున్నారని అన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజలు, నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆవేశాలతో నిర్ణయాలు తీసుకుంటే, ఆవేశాలతో విధ్వంసం కొనసాగితే తీర్చలేని సమస్యలెదురవుతాయని ఆయన హెచ్చరించారు.
సీమాంధ్రులు ఆందోళనలు విరమించి తమ సమస్యలను కేంద్రానికి నివేదించాలని ఆయన కోరారు. సంయమనం పాటించి రెండు రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకుపోదామని పిలుపునిచ్చారు. భారతదేశం గర్వపడేలా ప్రగతి సాదిద్దామని కోరారు. తెలుగుజాతి ఐక్యతను దెబ్బతీయవద్దని, అన్నదమ్ముల్లా విడిపోయి కలిసి బతుకుదామని అన్నారు.