రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పొరపాటు: దేవినేని నెహ్రూ
posted on Aug 5, 2013 @ 3:07PM
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పొరపాటు ఉందని ఒప్పుకుంటామని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ అన్నారు. అయితే ప్రాంతీయవాదం ఎగిసినప్పుడు కొందరు నేతలు పాదయాత్రలకు వెళ్లి ఒక్కో రకంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతలు రాజకీయం కోసం తెలంగాణను ఎత్తుకున్నారన్నారు.
2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన వస్తే కాంగ్రెస్ ఎమ్.పిలు,ఎమ్మెల్యేలు అంతా ఆందోళన చేస్తే కేంద్రం దిగివచ్చి నిర్ణయం మార్చుకుందని ఆయన చెప్పారు. ఐదు లక్షల కో్ట్లు ఇచ్చి రాష్ట్రాన్ని ముక్కలు చేయండని ఒక నాయకుడు చెబుతున్నారని, మరో నాయకుడు విజయవాడ రాజధాని కావాలలని అంటారని, ఇప్పటికైనా టిడిపి వైఖరి ఏమిటో చెప్పండని ఆయన ప్రశ్నించారు.
ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు గౌరవించాలని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గతంలో ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలోచన మార్చుకోవాలన్నారు. విభజన నిర్ణయంతో ప్రతి తెలుగువాడి గుండె అగ్నిగుండంలా మారిందన్నారు. రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.