థాంక్యూ టెర్రరిస్టులూ... కాశ్మీర్ సీఎం...
posted on Mar 2, 2015 @ 3:05PM
దాదాపు రెండు నెలల పాటు ఎడతెగని చర్చలు జరిపిన తరువాత ఎట్టకేలకు బీజేపీ, పిడిపి పార్టీలు కలిసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాయి. భిన్న దృవాలవంటి తమ రెండు పార్టీల కలయికను తూర్పు పడమరలు కలిసిన వేళ అంటూ రెండు పార్టీల నేతలు వాటేసుకొని మరీ పొగుడుకొన్నారు. ఆ రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పిడిపి పార్టీ అధినేత ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం ప్రధాని మోడీ సమక్షంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ, “రాష్ట్రంలో ఎన్నికలు ఇంత సజావుగా జరిగాయంటే అందుకు కారణం ఉగ్రవాదులు, కాశ్మీర్ విభజన వాదులు హుర్రియత్ నేతలు సహకరించడం వలననేని చెప్పక తప్పదు. అదే విషయం నేను ఇదివరకు ప్రధాని మోడీకి చెప్పాను. ఇప్పుడు అధికారికంగా మీకు కూడా చెపుతున్నాను. సరిహద్దుకి అవతల ఉన్నవారు మనకు సహకరించబట్టే ఇంత సజావుగా ఎన్నికలు నిర్వహించుకోగలిగాము. అందుకు వారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలసిందే. ఎన్నికలను భగ్నం చేయడానికి ఒక చిన్న సంఘటన చాలు. కానీ వారు అటువంటి పనికి దేనికీ పూనుకోకపోవడం వలన మనం ఎన్నికలు నిర్వహించుకోగలిగాము. కాశ్మీర్ వేర్పాటువాదులు (హురియత్) నేతలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రాష్ట్రంలో శాంతి సుస్థితరతలు నెలకొల్పవలసి ఉంది. అందుకు భారత ప్రభుత్వం సహకారం కూడా కోరుతున్నాను,” అని అన్నారు.
ఆయన ఈవిధంగా మాట్లాడుతున్నప్పుడు ప్రధాని మోడీ కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆయన తక్షణమే ధీటుగా స్పందించి ఉండి ఉంటే బాగుండేది. కానీ ఆయన సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ మౌనం వహించినట్లున్నారు. ఆ తరువాత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆయన మాటలను ఖండించారు. ఆ ఘనత అంతా భారత సైనిక దళాలకి, ఎన్నికల కమీషన్ కే చెందుతుందని, ముఫ్తీ సయీద్ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు.
కానీ భారత రాజ్యాంగానికి లోబడి పనిచేస్తామని, దేశ సమగ్రతను కాపాడుతానని కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి ముఫ్తీ సయీద్, ప్రధాని సమక్షంలోనే పాక్ ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు ధన్యవాదాలు తెలుపుతుంటే, ఆయన మౌనం వహించడమే కాకుండా అటువంటి వ్యక్తి నడిపిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగడం ఏవిధంగా సమంజసమో బీజేపీయే చెప్పవలసి ఉంటుంది.
తమ ప్రభుత్వానికి అన్నిటికంటే మొదట భారతదేశానికి, రాజ్యాంగానికే ప్రాధాన్యత ఇస్తుందని, వాటి పరిరక్షనకే కట్టుబడి ఉంటుందని ప్రధాని మోడీ లోక్ సభ సాక్షిగా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. కానీ ఇప్పుడు పాక్ తీవ్రవాదులను, వేర్పాటువాదులను వెనకేసుకు వస్తున్న ఒక ముఖ్యమంత్రికి ఏవిధంగా మద్దతు ఇస్తున్నారు? అతనితో కలిసి ఏవిధంగా పనిచేస్తున్నారు?” అని ప్రతిపక్షాలు, ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక సరిహద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రవాదులను వెనకేసుకు వస్తున్నప్పుడు ఇక తీవ్రవాదులను దేశంలో జొరబడకుండా అడ్డుకోవడం భద్రతాదళాలకు సాధ్యమేనా? అటువంటి పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి దానితో అధికారం పంచుకొంటే రేపు దేశంలో ఏ అనర్ధం జరిగినా అందుకు బీజేపీని కూడా ప్రజలు నిందించక మానరు. ఒకవేళ ఇప్పటికి ఎలాగో సర్దుకుపోయినా, ఉగ్రవాదులు, వేర్పాటువాదుల తరపున ఇంత నిర్లజ్జగా వాదిస్తున్న ముఖ్యమంత్రి రేపు వారితో సరిహద్దు భద్రతాదళాలు గట్టిగా వ్యవహరింబోయినప్పుడు అడ్డుపడితే అప్పుడయినా బీజేపీ, పిడిపీల మధ్య సంఘర్షణ చెలరేగి ప్రభుత్వం కుప్పకూలిపోక తప్పదు. కనుక బీజేపీ అధిష్టానం పిడిపితో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడిపే విషయంలో పునరాలోచించుకొంటే మంచిది.