మరీ ఇంత అధికార దాహమా జగన్?
posted on Mar 3, 2015 @ 11:40AM
‘ఇల్లు తగలబడి ఒకడు ఏడుస్తుంటే...కంగారుపడకు నుయ్యి తవ్వడం మొదలుపెట్టేశా’ అన్నట్లుంది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీరు. తుళ్ళూరు రాజధాని గ్రామాలలో పర్యటిస్తున్న ఆయన రైతులను ఓదార్చుతూ “తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల దగ్గర నుండి ప్రభుత్వం తీసుకొన్న భూములను తిరిగి ఇచ్చేస్తానని” లాంగ్ టర్మ్ హామీ ఒకటి ఇచ్చేసారు. అంతే కాదు “మరో రెండు మూడేళ్ళలో ఈ ప్రభుత్వం కూలిపోతుందని” జోస్యం కూడా చెప్పారు. రైతులు తమ గోడు వినిపించేందుకు వస్తే వారిని ఓదార్చివారి తరపున శాసనసభలో పోరాడుతానని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. కానీ అటువంటి సమయంలో కూడా తను అధికారంలోకి రావడం గురించే మాట్లాడటం, అందుకోసం ప్రజలెన్నుకొన్న ప్రజా ప్రభుత్వం కూలిపోతుందని కలలుగనడం చూస్తుంటే ఆయన అధికారం కోసం ఎంతగా తపించిపోతున్నారో, ముఖ్యమంత్రి కావాలని ఎంతగా ఆరాటపడుతున్నారో అర్ధమవుతోంది.
ఈ ఐదేళ్ళలో రైతుల దగ్గర తీసుకొన్న భూములలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరం నిర్మిస్తే, మరి జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా ఆ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇస్తున్నారు? అని ప్రశ్నించుకొంటే ఆ హామీలో డొల్లతనం, అది ప్రజలకు ఆకట్టుకోనేందుకేనని అర్ధం అవుతుంది. ఇదివరకు ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ ఉద్యమాలు చేసినప్పుడు కూడా ఒకవైపు రాష్ట్ర విభజన జరిగిపోయినప్పటికీ, తనకు 30 యంపీ సీట్లు, 125 యం.యల్యే. సీట్లు ఇచ్చినట్లయితే రాష్ట్రాన్ని కలిపి ఉంచుతానని హామీ ఇచ్చేరు. ఆయనకు అధికారం కట్టబెడితే విడిపోయిన రాష్ట్రాన్ని ఏవిధంగా కలుపుతారో ఎవరికీ తెలియదు. కానీ ఎన్నికల సమయం నాటికే ఆయన సమైక్యగానం పాడటం ఆపేశారు. ఆ తరువాత మళ్ళీ ఏనాడు ఆ ప్రసక్తి ఎత్తలేదు కూడా.
మళ్ళీ ఇప్పుడు కూడా అప్పటిలాగే తనకు అధికారం కట్టబెడితే, రైతుల భూములపై రాజధాని నగరం నిర్మించబడినప్పటికీ వారి భూములు వారికి తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇస్తున్నారు. అదెలాసాధ్యమో మళ్ళీ ఆయనే వివరిస్తే బాగుంటుంది. రైతులకు భూములు కావాలనుకొంటే తమ పార్టీకే ఓటేయమని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ ముందుగానే ప్రచారం మొదలుపెట్టేసినట్లుంది.
రాజకీయ పార్టీలన్నీ ప్రజాసేవే తమ పరమార్ధం అంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎటువంటి డొంక తిరుగుడు లేకుండా చాలా సూటిగా అధికారమే తన పరమార్ధం, ముఖ్యమంత్రి కావడమే తన జీవిత లక్ష్యం అని ప్రతీ సభలో, సమావేశంలో, చివరికి ఓదార్పు యాత్రలలో కూడా చెప్పుకొంటుంటారు. రాజకీయ పార్టీలు, నేతలు అధికారం తపించిపోవడం సహజమే. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళిక, వ్యూహం వంటివి అవసరం. కానీ ఇల్లు కాలి ఏడుస్తున్న వారిని ఓదార్చి అధికారంలోకి వచ్చేయవచ్చని పగటికలలు కంటే అది ఆయనకే కాదు ఆయనని నమ్ముకొన్న పార్టీ నేతలకి, వేలాదిమంది కార్యకర్తలకీ కూడా తీవ్ర నష్టం కలిగిస్తుంది.