జగన్ మారడు.. వైసీపీ మిగలదు!
posted on Aug 4, 2024 6:35AM
వైసీపీ అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవాలంటే వైసీపీ నేతలకే సాధ్యం కాకపోయేది. కేవలం ఐదారుగురు నేతలకు మాత్రమే జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లోకి అడుగుపెట్టే యాక్సెస్ ఉండేది. వారు మినహా పార్టీలో ముఖ్య నేతలు జగన్ దగ్గరకు వెళ్లాలన్నా.. నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేంది. ఇదంతా ఒకెత్తు.. జగన్ ఎక్కడైనా బహిరంగ సభలకు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వచ్చారంటే.. ఆ ప్రాంతంలో అధికారులు చుట్టూ పరదాలను కట్టేవారు. పోలీసులు ప్రతిపక్ష పార్టీల నేతలను హౌస్ అరెస్టులు చేసేవారు.. చెట్లను నరికేసేవారు. వైసీపీ కార్యకర్తలను కూడా జగన్ దగ్గరకు రానివ్వకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టేవారు. రాజకీయ నాయకుడు అంటే ఆయన ఏ పదవిలో ఉన్నా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేవాడు అని అర్ధం. కానీ, జగన్ మోహన్ రెడ్డి ఆ అర్ధాన్నే మార్చేశారు. రాజకీయ నాయకుడు అంటే ఓ రాజ్యానికి రాజులా.. ప్రజలను అంటరానివారిగా చూడాలన్నట్లుగా ఐదేళ్లు సీఎం హోదాలో జగన్ వ్యవహరించారు. దీంతో ఆయన వ్యవహారశైలిపై ఏపీ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అయినా మార్పురాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కేవలం 11 సీట్లకే వైసీపీని పరిమితం చేసి ప్రతిపక్ష హోదాకు కూడా జగన్, ఆయన పార్టీ తగదని తీర్పిచ్చారు.
అంత దారుణ ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి అహంకారం ఇసుమంతైనా తగ్గలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు ఒకింత సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే.. అధికారంలో ఉన్నన్ని రోజులు అధినేతను కలిసే అవకాశం రాలేదు. ప్రతిపక్షంలో ఉంటే అయినా అప్పుడప్పుడు జగన్ ప్రజల్లోకి వస్తారు, తద్వారా ఆయన్ను కలిసే అవకాశం ఉంటుందని భావించారు. అంతేకాదు.. జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లినా ఈజీగా అపాయింట్‌మెంట్ దొరుకుతుందని భావించారు. కానీ, అధికారం కోల్పోయినా జగన్ తీరులో మార్పురాలేదు. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ లోకి అడుగు పెట్టాలంటే అభిమన్యుడు పద్మవ్యూహం చేధించుకొని వచ్చినట్లే.. సుమారు వంద మంది సెక్యూరిటీని దాటుకొని జగన్ ప్యాలెస్‌లోకి అడుగుపెట్టాలి. అది సాధ్యం కాని పని. పలు జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు జగన్ తాడేపల్లి ప్యాలెస్ వద్దకు వచ్చి సెక్యురిటీ సిబ్బందితో తిట్లుతిని వెనుదిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షంలో జగన్ మోహన్ రెడ్డిని ఈజీగా కలవొచ్చు.. మన సమస్యలను చెప్పుకోవచ్చని కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు తాడేపల్లి ప్యాలస్ వద్దకు వచ్చారు. అక్కడి వచ్చిన వారికి అసలు విషయం అర్థమైంది. ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత కూడా జగన్ మోహన్ రెడ్డి అహంకారం తగ్గలేదని.
జగన్ ను కలిసేందుకు దాదాపు వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి నివాసం వద్దకు వచ్చారు. జగన్ ను కలిసే అవకాశం ఇవ్వాలని అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్నారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది ససేమిరా అన్నారు. మేమంతా వైసీపీ కార్యకర్తలం. పార్టీ కోసం గత పదేళ్లుగా పనిచేస్తున్నాం. మాకు కూడా ఆయన్ను కలిసే అవకాశం లేదా అంటూ ప్రశ్నించారు. అయినా సెక్యురిటీ సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో జై జగన్.. జైజై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో ఓ జిల్లా స్థాయి వైసీపీ నేత ఎవరితోనూ ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత ఫోన్ లో వ్యక్తితో మాట్లాడండి అంటూ సెక్యురిటీ సిబ్బందికి ఫోన్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ ఫోన్‌ను తీసుకున్న సెక్యురిటీ సిబ్బందిలోని ఓవ్యక్తి ఫోన్‌ను పక్కనే ఉన్న గార్డెన్‌లో విసిరేశాడు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా చేయ బట్టే 11 సీట్లకు వైసీపీ పరిమితమైంది. ఇంకా మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఈ మాత్రం సీట్లు గెలిచే పరిస్థితి కూడా ఉండదు అంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్యురిటీ సిబ్బంది కార్యకర్తలను దాదాపు మెడపట్టి తోసేసినంత పని చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు జగన్ ను తిట్టుకుంటూ వెనుదిరిగి వెళ్లిపోయారు.
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వీలు దొరికినప్పుడల్లా ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే నేతకే ప్రజల్లో ఆదరణ ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డిలా ఆయనకు అవసరం ఉన్నప్పుడే ప్రజల్లోకి వస్తే ప్రజలు సరియైన సమయంలో సరైన రీతిలో గట్టి గుణపాఠం చెబుతారు. జగన్ కు అలాగే చెప్పారు కూడా. ప్రస్తుతం జగన్ తాడేపల్లి క్యాంపస్ వద్ద వైసీపీ నేతలకు జరిగిన అవమానానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చంద్రబాబు, పవన్, లోకేశ్ ప్రజల మధ్యనే ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వారిని చూసి నేర్చుకో జగన్ అంటూ సూచనలు చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డిలో మార్పు రాకుంటే రాబోయే కాలంలో వైసీపీ నేతలు, కార్యకర్తలంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసే రోజులు దగ్గరలోనే ఉంటాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జగన్ అహంకారం వైసీపీని ఖాళీ అయ్యేలా చేస్తుందని సొంత పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.