వైసీపీకి షాక్?..ఏంపీలు గోడ దూకేస్తున్నారా?
posted on Aug 4, 2024 7:33AM
వైసీపీకి త్వరలో ఆ పార్టీ ఎంపీలు ఝలక్ ఇవ్వనున్నారా? అన్న ప్రశ్నకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. రానున్న రోజులలో జగన్ కు భారీ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీకి రాజ్యసభలో 11 మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. మెజారిటీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో అవసరమైన బలంలేరు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లులు రాజ్యసభ బిల్లులు రాజ్యసభ ఆమోదం పొందాలంటే బయట నుంచి మద్దతు అవసరం. అయితే అలా బయట నుంచి మద్దతు తీసుకోవడం కంటే.. ఎంపీలను పార్టీలో చేర్చుకోవడమే మేలని బీజేపీ భావిస్తోంది. అదే సమయంలో జగన్ తీరుతో తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్న పలువురు వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్లారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
అయితే వారు బీజేపీలోకి టచ్ లోకి వెళ్లింది, ఆ పార్టీలో చేరడానికి కాదు, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా చేరేందుకు వారు బీజేపీ సహాయం కోరుతున్నారు. వైసీపీ అధినేత జగన్ తన వైఖరి మార్చకోక, అహంకారంతో వ్యవహరిస్తుండటంతో ఆ పార్టీలో ఎంపీలు ఇమడ లేకపోతున్నారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్వానం అంటూ జగన్ ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ధర్నా అట్టర్ ప్లాప్ కావడం, గత ఐదేళ్లలో ఇష్టారాజ్యంగా నాయకులు దోచుకున్నట్లు రోజుకోక కుంభకోణం బయటపడుతుండటంతో వైసీపీ నేతలలో భయం ఏర్పడంది. అన్నిటికీ మించి ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కేవలం జగన్ అన్న భావన సర్వత్రా వ్యక్తమౌతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలు పార్టీ మారే యోచనలో ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా వైసీపీతో, జగన్ తో అంటకాగితే రాజకీయ జీవితం సమాధి కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. దీంతో వారు పార్టీకి దూరం జరుగుతున్నారు.
బీజేపీలో చేరడం కంటే.. తప్పులు ఒప్పుకుని చెంపలేసుకుని తెలుగుదేశం గూటికి చేరడమే మేలని భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. అయితే నేరుగా తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్లేందుకు దారులన్నీ మూసుకుపోవడంతో.. బీజేపీ ద్వారా తెలుగుదేశంకు దగ్గర కావాలన్న ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు. అయితే ఎంత మంది వైసీపీ ఎంపీలు పార్టీ మారతారన్న కచ్చితమైన సమాచారం లేదు. విశ్వసనీయ వర్గాలు, వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు కనీసం ఐదుగురు ఎంపీలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేయడానికి రెడీగా ఉన్నారని తెలుస్తోంది. ఏదిఏమైనా ఐదారుగురు ఎంపీలు వైసీపీకి గుడ్ బై చెప్పేయడం ఖాయమని అంటున్నారు.