జగన్ ఏంటిది? రాజకీయాలకు ఇదా సందర్భం?
posted on May 1, 2025 @ 9:51AM
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యావతో అల్లాడిపోతున్నట్లు కనిపిస్తున్నది. 2024 ఎన్నికలలో ఓటమి తరువాత, ఆయన పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా సరిపెట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడెప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కేద్దామా అన్న ఆత్రంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకోసం ఆయన ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యలపై పోరాడటం వంటి మార్గాలను కాకుండా అడ్డదార్లను ఎన్నుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలను రెచ్చగొట్టడం, సమాజంలో చీలికలలు తీసుకు వచ్చి, అశాంతిని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.
అందుకే ఆయన ప్రజలలోకి రావడానికి ఎంచుకుంటున్న సమయం, సందర్భం వివాదాస్పదంగా ఉంటున్నాయి. రాష్ట్రంలో ఎక్కడైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు, మరణాలు సంభవించినప్పుడు, తమ పార్టీ నేతలు ఎవరైనా గతంలో చేసిన తప్పులు, నేరాలలో అరెస్టైనప్పుడు మాత్రమే ఆయన బయటకు వస్తున్నారు. ఆ వచ్చిన సమయంలో కూడా బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం కంటే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసి.. తాను మళ్లీ అధికారంలోకి రాగానే.. అంటూ హెచ్చరికలు చేయడానికే పరిమితమౌతున్నారు.
తాజాగా సింహాచలంలో జరిగిన దురదృష్టకర సంఘటనలో ఏడుగురు మరణించిన సంగతి తెలిసిందే. వెంటనే జగన్ బాధిత కుటుంబాల పరామర్శ అంటూ సింహాచలంలో వాలిపోయారు. అయితే జగన్ బాధిత కుటుంబాలను పరామర్శించడానికి అక్కడకు చేరుకోవడానికి ముందే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మృతుల కుటుంబాలకు పాతిక లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించేసింది. అలాగే బాధిత కుటుంబాలలో ఒకరికి దేవాదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగం ఇవ్వనున్నట్లు కూడా పేర్కొంది.
దీంతో జగన్ తన స్క్రిప్ట్ ను ఒకింత సవరించుకున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి బాధిత కుటుంబాలకు ఇచ్చిన నష్టపరిహారం సరిపోదని, గతంలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తాను కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటించాననీ, ఇప్పుడు సింహాచలం ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు కూడా అంతే పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఒక వేళ ప్రభుత్వం అలా ఇవ్వకపోతే.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం తాను ఇస్తానని కూడా ప్రకటించేశారు.
ఇక్కడ ఆయన మరచిపోయిందేమిటంటే.. ఎల్జీ పాలిమర్స్ ఘటన పూర్తిగా మానవ తప్పిదం, ఆ కంపెనీ నిర్లక్ష్యం. కానీ సింహాచలంలో జరిగింది పూర్తిగా వేరు. ఇక్కడ భారీ వర్షం కారణంగా గోడ కూలి భక్తులు మరణించారు. ఈ విషయాన్ని విస్మరించి జగన్ రాజకీయ లబ్ధి కోసం ఏవేవో చెబుతున్నారు. మేము వచ్చాకా అంటూ తన భుజాలు తానే చరుచుకుంటున్నారు.
అయితే నెటిజనులు మాత్రం జగన్ ను ముందు విజయవాడ బుడమేరు ముంపు సమయంలో ప్రకటించిన కోటి రూపాయల విరాళం మాటేమిటని నిలదీస్తున్నారు. అయినా జగన్ సింహాచలం వచ్చింది బాధితులను పరామర్శించి ఓదార్చడానికా లేక రాజకీయం చేయడానికా అని ప్రశ్నిస్తున్నారు.