బూతుల యూనివర్సిటీ వీసీ జగన్ : మాజీ మంత్రి పీతల
posted on Oct 22, 2022 @ 10:21AM
రాజకీయ నాయకులు వారు ఉపయోగించే భాష పట్ల సంయమనం పాటించాలంటూ ఏపీ సీఎం ప్రవచనకారుడిలా చెప్పడాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకురాలు పీతల సుజాత ఖండించారు. జగన్ స్వయంగా బూతుల యూనివర్సటీ వైస్ చాన్సలర్ అని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పీతల సుజాత.. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తానేం చేస్తున్నాడో, ఎం మాట్లాడుతున్నాడో జగన్ ఒక సారి ఆలోచించుకోవాలని హితవు పలికారు.
ప్రత్యర్థులు తనను బూతులు తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేయడం దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉందన్నారు. నిత్యం బూతుల పంచాంగం వల్లించే డ్రైనేజీ నోళ్లేసుకున్న వారిని పక్కన పెట్టుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్న జగన్ రెడ్డి తనను తాను సచ్ఛీలడిగా భావించుకుని ఇతరులకు భాష గురించి సుద్దులు చెప్పడం గురివింద గింజ చందంగా ఉందని పీతల సుజాత అన్నారు.
ప్రతిపక్షనేతగా పాదయాత్రచేస్తున్నప్పుడు జగన్ రెడ్డి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడిని ఏమన్నారో ఒక సారి గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబునాయుడిని బంగాళాఖాతంలో కలపాలని, చెప్పులు చీపుర్లతో కొట్టాలని, నడిరోడ్డుపై ఉరితీయాలని, కాల్చిపడేయాలని నోటికొచ్చినట్లు వాగిన సంగతి ఆయన మరచిపోయినా రాష్ట్ర ప్రజలకు గుర్తుందని అన్నారు.
బూతులు, భాష గురించి ముఖ్యమంత్రి నీతి వాక్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులువాడే పద జాలం, బూతులు, వారి వ్యవహారశైలి జగన్ కు ప్రవచనాల్లా వినిపిస్తున్నాయా? తెలుగు భాష సిగ్గుతో తలదించుకునేలా దాన్ని బూతుల మయం చేసింది ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ లోని మంత్రులు కాదా? అని ప్రశ్నించారు.
తాడేపల్లి ప్యాలెస్ దాటి జగన్ బయటకువస్తే, మహిళలకు ఎవరి హాయాంలో గౌరవం లభించిందో, ఎవరి పాలనలో సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందో ఆయనతో చర్చకు తాము సిద్ధం అని పీతల సుజాత సవాల్ విసిరారు. మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పించి, వారికి గుర్తింపు నిచ్చింది స్వర్గీయ ఎన్టీఆర్ అయితే, ఆడ బిడ్డలకుఅన్నగా, వారి కష్ట సుఖాల్లో తోడు నీడగా నిలిచింది చంద్రబాబు అని చెప్పారు.