అమరావతిలో తేలింది.. విశాఖ ఇన్ సైడ్ ట్రేడింగ్ తేలాల్సి ఉంది!
posted on Jul 21, 2021 @ 2:00PM
ఇన్‌సైడర్ ట్రేడింగ్. అమరావతిని చంపేసేందుకు జగన్ సర్కారు చల్లిన బురదనే ఆరోపణలున్నాయి. చంద్రబాబును దెబ్బతీసేందుకు పన్నిన పన్నాగమని చెబుతారు. నాలుగు సార్లు దొంగా దొంగా అంటే.. నిజంగానే దొంగ అనుకోవాలనే కుతంత్రం దీని వెనుక ఉందంటారు. అన్ని ఛానెల్స్‌లోనూ బ్రేకింగ్ న్యూస్ రావడంతో జనాలు సైతం అవునా అంటూ ఆశ్చర్యపోయారు. కావొచ్చేమో.. అలా జరిగుండొచ్చేమోనని అనుమానించారు. చంద్రబాబును బద్నామ్ చేయడంలో ఎంతోకొంత సక్సెస్ కూడా అయ్యారు. నోటీసులు, కేసులతో నానా హంగామా చేశారు. టీడీపీ బ్యాచ్‌ను భయభ్రాంతులకు గురి చేశారు. వందలాది మంది రైతుల ఉసురు పోసుకున్నారు. చంద్రబాబు గురించి తెలిసిన వారు మాత్రమే.. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు మినహా వేరే ఏవీ పట్టవని.. ఎట్టిపరిస్థితుల్లోనూ అలా జరిగి ఉండదని ధీమాగా ఉన్నారు. అయితే, అరాచకం ఎంతలా విర్రవీగినా.. న్యాయానిదే తుది విజయమని అప్పుడు గ్రహించలేకపోయారు. ఇప్పుడు ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదూ, పాడూ లేదంటూ.. సుప్రీంకోర్టు తీర్పుతో తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థంకాని పరిస్థితి అధికార పక్షానిది.
ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లు, క్విడ్‌ప్రోకోలు, అధికారం అడ్డుపెట్టుకొని దోచుకోవడాలు, షెల్ కంపెనీలు, సూటుకేసు కంపెనీలతో.. వేల కోట్ల ఆస్తులు పోగేసుకోవడాలు, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు కట్టుకోవడాలు.. జగన్‌కు అలవాటేమో కానీ.. చంద్రబాబుకు కాదని టీడీపీ నేతలు అంటున్నారు. మచ్చ లేని, మరక పడని నాయకుడు ఆయన. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా.. తెలుగురాష్ట్రాలపై చెరగని ముద్ర వేసినా.. ఐటీతో తెలుగునేలను మేటిగా మార్చినా.. అమరావతితో ప్రపంచ స్థాయి రాజధానిని తీర్చిదిద్దే ప్రయత్నం చేసినా.. ఏనాడు ఆయనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెబుతున్నారు. దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేసుకోమంటూ చంద్రబాబే స్వయంగా సవాల్ చేసినా.. ఆయనపై కేసుకట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. ఎందుకంటే ప్రత్యర్థులకు కూడా తెలుసు.. చంద్రబాబు తెరిచిన పుస్తకం.. తెల్ల కాగితం లాంటి వారని.
చంద్రబాబుకు లెక్కకుమించి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. ఉన్నదల్లా హైదరాబాద్‌లో ఓ ఇల్లు మాత్రమే. అమరావతిలో ఉన్నా అద్దె ఇంటితోనే అడ్జస్ట్ అయ్యారు. అంతేగాని జగన్‌లా మూడు రాష్ట్రాల్లో మూడు ప్యాలెస్‌లు కట్టుకోలేదు. ఒక్క హెరిటేజ్ మిల్క్ మినహా ఎలాంటి ఆస్థిపాస్తులూ లేవు. జగన్‌లా సీఎం కాకముందే వందలాది సూటుకేసు కంపెనీలు పెట్టి.. అడ్డంగా దోచుకొని.. అక్రమార్జనకు పాల్పడలేదు. అందుకే, చంద్రబాబును జనం నమ్మారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పుడు జగన్ అందలమెక్కి.. తైతక్కలాడుతున్నా.. చంద్రబాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ ఎంతగా బట్ట కాల్చి మీదేస్తున్నా.. టీడీపీ అధినేతకు పోయేదేమీ లేదు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టేయడంతో.. నిప్పుల్లో కాల్చిన బంగారంలా.. మరోసారి స్వచ్చంగా మారారు చంద్రబాబునాయుడు.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌తో చంద్రబాబు సచ్చీలుడనే సంగతి మరోసారి రుజువైంది. మరి, ఇప్పుడు జగన్ తాను నిర్దోషినని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కాన్సెప్ట్ జగన్ క్రియేట్ చేసిందేనని.. విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి.. ఆ టాపిక్‌ను డైవర్ట్ చేయడానికే అమరావతి ఇష్యూ తీసుకొచ్చారని అంటున్నారు. ఎంపీ రఘురామ లాంటి వాళ్లు మరో అడుగు ముందుకేసి.. మరిన్ని సంచలన ఆరోపణలు, ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగని చోట ఇంత రాద్దాంతం చేసి.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిన విశాఖలో ఆ టాపిక్ వదిలేశారని ఆరోపిస్తున్నారు. విశాఖపట్నంలో అంతా సెట్ చేసుకున్నాకే.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ను తెర మీదకు తీసుకొచ్చారని.. అంతకుముందే పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిపోయిందని అంటున్నారు.
ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలివచ్చిన ప్రముఖులు ఎవరు.. వారు చేసిన అరాచకాలు ఏమిటి..? వారు చేసిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఏమిటి..? సినీ ప్రముఖులకు బెదిరింపులు ఏమిటి.? బీచ్ రోడ్డులో ఎవరెవరి ఆస్తులను ఎలా కొల్లగొట్టారు? దసపల్లా హిల్ హోటల్‌ను ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు? వీటన్నిటిపై చిత్తశుద్ధితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు తేలుతుంది.. అసలు సంగతి. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది ఎక్కడో.. చేసింది ఎవరో.. దొంగలంతా బయటకు వస్తారు. మరి, విశాఖపట్నం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పైనా కేసు నమోదు చేసి విచారణ చేసే దమ్ము, ధైర్యం జగన్ సర్కారుకు ఉందా? చంద్రబాబులానే జగన్ సైతం నిర్దోషిగా నిరూపించుకోగలరా?