మైదానంలోనే శ్రీలంక కోచ్, కెప్టెన్ వాగ్వాదం.. వీడియో వైరల్..
posted on Jul 21, 2021 @ 2:00PM
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. తొలి వన్డేలో ఈజీగా విజయం సాధించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం కష్టపడి నెగ్గింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో చివరికి మూడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.నిజానికి రెండో మ్యాచ్ లో టీమిండియా గెలవడం అంతా అసాధ్యమనుకున్నారు. రెండు వందల పరుగులకు లోపే ఏడు వికెట్లు కోల్పోవడంతో అంతా లంకే గెలుస్తుందని అనుకున్నారు. కాని దీపక్ చాహార్ అద్బుతంగా ఆడి.. భువనేశ్వర్ తో కలిసి ఇండియాను గెలిపించారు.
రెండో మ్యాచులో మైదానంలోనే అనూహ్య ఘటన జరిగింది. శ్రీలంక ప్రధాన కోచ్ మికీ ఆర్థర్‌కు, ఆ జట్టు కెప్టెన్ దాసున్ షనకల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్.. క్రమంగా చహర్ నిలుద్కొకుకోవడం.. ఆ తర్వాత భువీతో కలిసి ఇన్నింగ్స్ నడిపించడం ఆర్థర్‌కు సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు.
ఇక శ్రీలంక ఆటగాళ్లు మ్యాచుపై పట్టు కోల్పోతోన్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కోపంతో ఊగిపోయిన ఆర్థర్ ఆటగాళ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మ్యాచ్ చివరి ఓవర్ల సమయంలో ఆర్థర్ మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో మాట్లాడారు. ఆ సమయంలో కెప్టెన్ షనక కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోచ్ ను గ్రౌండ్ బయటికి వెళ్లాకంటూ షనక చేతులు చూపిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.
శ్రీలంక కోచ్, కెప్టెన్ కు వాగ్వాదం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో వెలుగు చూసింది. వైరల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు ఎవరికి తోచింది వారు కామెంట్ చేశారు. '' మ్యాచ్ జరుగుతుంటే కోచ్ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్‌కు విరుద్ధం.. టీమిండియా ఆట తీరును డిస్టర్బ్ చేయాలనే ఆర్థర్ ఇలా ప్లాన్‌తోనే షనకతో గొడవపడినట్లు నటించాడంటూ కొందరు కామెంట్ చేశారు. అసలు మ్యాచ్ జరుగుతోన్న సమయంలో కోచ్ ను మైదానంలోకి ఎందుకు రానిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.