గోల్డెన్ ఫెరారీ.. వై దిస్ అంటూ మహీంద్రా వర్రీ!
posted on Jul 21, 2021 @ 2:40PM
ఒకరికి తింటానికి తిండే ఉండదు. ఇంకొకరికి డబ్బు ఏం చేసుకోవాలో తెలీదు. ప్రపంచం అలానే ఉంటుంది. పేదవాడు ఆకలితో అలమటిస్తుంటే.. ఉన్నోడు పైలాపచ్చీస్‌లా ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి ఓ రిచ్ పర్సన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది కాస్తా ఆనంద్ మహీంద్రాను చేరింది. ఆయన చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆలోచింప చేసేలా ఉన్నాయి.
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అక్కడి వారంతా ఆయన్ను, ఆయన కారును ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అమెరికాలో ఫెరారీ కార్లు కామనే కదా. చాలా మంది దగ్గర ఉంటాయి కదా. మరి, మనోడి కారునే ఎందుకంతా వింతగా చూస్తున్నారనే డౌట్ రావొచ్చు. ఎందుకంటే, ఆ ఎన్నారైది మామూలు ఫెరారీ కారు కాదు. గోల్డ్ కోటెడ్ కార్. కారునంతా బంగారంతో పోత పోయించాడు. ఆ గోల్డెన్ కార్‌తో వీధుల్లో ఊరేగుతున్నారు. అందుకే, ఆ కారుకంత క్రేజ్. కారుతో పాటు ఆయనకంత ఫాలోయింది.
‘ఇండియన్ అమెరికన్ విత్ ప్యూర్ గోల్డ్ ఫెరారీ కార్’ అని రాసున్న ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా కంటికి కనబడకుండా ఉంటుందా ఆ వీడియో? అయితే, ఆ కారు వీడియోతో పాటు ఆనంద్ మహీంద్రా చేసిన కామెంట్లు కూడా వైరల్‌గా మారాయి. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..
‘‘ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప.. ఇంకా ఏ విషయంలో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందో?’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.