Read more!

ఖాళీల భర్తీకి ఆదేశాలు.. ముందస్తు తొందరేనా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కార్ పరిస్థితి ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యి అన్నట్లుగా తయారైంది. ఎన్నికలకు ఇంకా ఏడాది పైగా సమయమున్నా.. జగన్ సర్కార్ ఇప్పడో.. ఇహనో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలని నిర్ణయం తీసేసుకుందా అన్నట్లుగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. అదే సమయంలో ముందస్తుకు వెళితే కొండ నాలుక్కి మందు వేస్తే ఉన్న నాలుక కూడా ఊడినట్లు అన్న చందంగా ముందుగానే అధికారం కోల్పోవలసి వస్తుందా అన్న సందేహమూ వైసీపీ ప్రభుత్వాన్నీ, పార్టీ ముఖ్యులనూ వెంటాడుతోంది.

అందుకే ఎటూ తేల్చుకోలేని స్థితిలో జగన్ పరిస్థితి తయారైంది.  మహా కవి, శ్రీ శ్రీ సంధ్యా సమస్యలు,( ఆ సాయంత్రం...ఇటు చూస్తే అప్పులవాళ్లూ..అటు చూస్తే బిడ్డల ఆకలి.. ఉరిపోసుకు చనిపోవడమో..సముద్రమున పడిపోవడమో-..సమస్యగా ఘనీభవించిందొక సంసారికి) కవితను గుర్తు చేస్తున్నారు.  ఇప్పుడు జగన్ ప్రభుత్వం  కూడా సరిగ్గా అటువంటి సంకట స్థితినే ఎదుర్కొంటోంది. ముందస్తుకు వెళ్లకుంటే ఇప్పటికే దిగజారిన ప్రభుత్వ ప్రతిష్ట మరో ఏడాది కాలంలో అధమ స్థాయికి పడిపోయేలా ఉంది. అలాగని ముందస్తుకే వెళితే.. ఏప్పుడో ఏడాది తరువాత చేజారాల్సిన అధికారం అంతకంటే ముందే చేయి జారిపోతుంది. ఇప్పుడు ఏపీ సర్కార్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది.  ముందస్తుకు వెళ్లుటయా? మానుటయా అన్న సందిగ్ధంతో పడి కొట్టుమిట్టాడుతోంది.

అందుకే..  ఒక వైపు ముందస్తుకు రెడీ అయిపోతూనే.. మరో వైపు వేచి చేద్దాం అన్నట్లుగా వ్యవమరిస్తోంది. అందుకే  చూస్తే కదులుతున్న అధికార పీఠం.. ఇటు చూస్తే కమ్ముకొస్తున్న ప్రజా వ్యతిరేకత.. అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లడమా? వ్యతిరేకతను పట్టించుకోకుండా అధికారాన్నిపట్టుకు వేలాడుతూ మిగిలిన ఏడాది గడిపేయడమా? అన్నది జగన్ సర్కార్ కు ఎటూ తేల్చుకోలేని సందిగ్ధ పరిస్థితిని తీసుకు వచ్చింది. సరిగ్గా అదే సమయంలో మండల, డివిజన్ స్థాయిలో ఉన్న ఖాళీలన్నిటినీ వెంటనే భర్తీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశిస్తూ.. సీఎంవో కార్యాలయం నుంచి ఆదేశాలుజారీ అయ్యాయి. దీంతో జగన్ ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని అంతా భావిస్తున్నారు.  నిజానికి ముందస్తుకు వెళ్లినా, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఓటమి తథ్యమన్న భావనకు ఇప్పటికే వైసీపీ నేతలు వచ్చేశారనీ, అందుకే.. ముందస్తుకు వెళ్లడమా? షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చే వరకూ ఆగటమా? అన్న సంశయంలో పడ్డారనీ అంటున్నారు.  

మరో ఏడాదిన్నర ప్రభుత్వాన్ని నడపడం, అంటే షో రన్ చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుండటంతో ముఖ్యమంత్రి ముందస్తుకే మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే.. జగన్ ఎప్పుడు అనుకుంటే అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ముందస్తు విషయంలో బంతి జగన్ కోర్టులో ఉందని తేల్చేశారు.

ముందస్తు ఎన్నికలకు  పోతే ముందుగానే ఇంటికి పోతామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే హెచ్చరిస్తున్నారు. అలాగని షెడ్యూల్ దాకా అగుదామంటే..మొదటికే మోసం వచ్చేలా వుంది. అందుకే అధికార పార్టీ నేతలు ముందస్తు ఎన్నికల విషయంలో ఓ రోజు ఔననీ, మరో రోజు కాదనీ ఆల్ మోస్ట్ నిర్ణయం తీసుకోవడానికి రోజు హెడ్ అండ్ టెయిల్ వేసుకుని ఆ మేరకు రోజుకో విధంగా మాట్లాడుతోంది. 

వాస్తవానికి ముందస్తు ఎన్నికల మాట ముందుగా వచ్చింది అధికార పార్టీ నేతల నుంచే. ఒక సారి కాదు ఒకటికి పది సార్లు  జగన్ సర్కార్ లో సకల శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న  పలు మార్లు ముందస్తు ప్రస్తావన తీసుకు వచ్చారు.  నిజానికి, ప్రతిపక్ష పార్టీలు, ముందస్తు ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వ్యూహాత్మకంగా తీసుకు వస్తున్న ముందస్తు చర్చను విపక్షాలే కాదు.. ప్రజలు కూడా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

 ముందస్తా  కాదా అన్న విషయం పక్కన పెడితే  ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని విపక్షాలతో పాటు జనం కూడా ఎదురు చూస్తున్నారు.  ఈ విషయం స్పష్టంగా తెలిసినా వైసీపీ అగ్రనేతలు, ప్రభుత్వ పెద్దలూ మాత్రం తమను తాము మభ్యపెట్టుకోవడమే కాకుండా.. ప్రజలను కూడా మభ్య పెడదామని, పెట్టగలమని భావిస్తున్నారు. .అయితే,  ఒకసారి ప్రజలు నిర్ణయానికి వచ్చిన తర్వాత  ముందస్తు అయినా, కాకపోయినా ఫలితంలో పెద్ద తేడా ఉండదని పరిశీలకులు అంటున్నారు. అయినా ఇప్పుడు బంతి వైసీపీ కోర్టులోనే ఉందనీ, ముందస్తు అయినా కాకపోయినా  ఫలితం ఏమిటన్నది ఇప్పటికే ఆ పార్టీకి అర్ధమైపోయందనీ అంటున్నారు.