Read more!

అలీ.. ఈ సారి టికెట్ పై ఆశలు.. జగన్ కరుణించేనా?

ఎన్నాళ్లో వేచిన ఉదయం అలీకి ఎదురవ్వబోతోందా? అంటే ఆ రోజు త్వరలో వస్తుందని వైసీపీ వర్గాలలో వినిపిస్తోంది. మూడేళ్ల  పాటు ఎదురు చూపులే యదను నిండగా , అన్నట్లు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు అలీ. వక్ఫ్ బోర్డు చైర్మన్, లేదా రాజ్యసభ సభ్యత్వం వస్తుందని ఆశపడ్డారు. శుభ వార్త చెబుతాను అంటూ.. ముఖ్యమంత్రి జగన్ కూడా ఆయనను ఊరించారు. చివరికి ఓ సలహాదారు పోస్టు ఇచ్చి సరిపెట్టేశారు. ఊరించి ఊరించి ఉసూరుమనిపించారు జగన్ అని అలీ అభిమానులే కాదు.. స్వయంగా అలీ కూడా అనుకునే ఉంటారు.

ఎందుకంటే.. ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వలేని వారికి మాత్రమే జగన్ సలహాదారు పదవులో.. ఇంకోటో ఇచ్చి సరిపెట్టేశారని వైసీపీ శ్రేణుల్లో ఒక భావన ఉంది. అయితే.. ఒక్క అలీ విషయంలో మాత్రం ఆ భావనకు చిన్న మినహాయింపు. గత ఎన్నికలలోనే పోటీ చేయాలని జగన్ ఆశపడ్డారు. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షణల చేశారు. చివరికి సినీ రంగంలో దశాబ్దాలుగా స్నేహబంధం ఉన్న పవన్ కల్యాణ్ ను కాదనీ, ఆయన పార్టీ జనసేనకు జెల్ల కొట్టి మరీ జగన్ పంచన చేరారు. అయితే జగన్ గత ఎన్నికలలో అలీకి పోటీ చేసే చాన్స్ ఇవ్వలేదు.

అందుకు బదులుగా సగౌరవంగా మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరేందుకు మూడేళ్లు పట్టింది. అప్పుడూ సగౌరవంగా ఇవ్వాల్సిన పదవి ఇవ్వలేదు. వందల మంది సలహాదారులలో ఒకరిగా ఆయనను సరిపెట్టేశారు. సర్దేశారు. అలీ కంటే పోసానికి ఒకింత మెరుగైన పదవి ఇచ్చారని అప్పట్లోనే వైసీపీ శ్రేణుల్లో పెద్ద చర్చ కూడా జరిగింది.  ఎందుకంటే పోసానికి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇచ్చారు. తనకు దక్కిన సలహాదారు పదవి విషయంలో అలీ కూడా అసంతృప్తి చెందే ఉంటారు. కానీ బయటపడలేదు.  అయితే గుడ్డిలో మెల్ల అన్నట్లు మూడేళ్ల నిరీక్షణ తరువాతైనా అలీకి ఒక పోస్టు దక్కింది. ఎందుకంటే అలీయే కాదు.. గత ఎన్నికలలో మోహన్ బాబు, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఇలా చాలా మంది సినీ జీవులు జగన్ కు మద్దతుగా ప్రచారం చేశారు. వీరందరిలో అందరి కంటే ముందుగా పదవి దక్కింది థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కు మాత్రమే. అయితే ఆయనకు ఆ పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎస్వీబీసీ టీవీ చానల్ చైర్మన్  పదవి దక్కించుకున్న పృధ్వీరాజ్ ను ఆరోపణల నెపంతో పక్కన పెట్టేశారు. ఆ తరువాత ఆయన ముఖం కూడా చూడలేదు. ఇక మోహన్ బాబు విషయానికి వస్తే.. ఆయన అసలు పార్టీకి పని చేశారన్న విషయాన్ని కూడా జగన్ గుర్తించిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ఆయన క్రమంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

వాస్తవానికి పార్టీ తరఫున పని చేసిన అలీ.. తనకు తగిన పదవి దక్కకపోతుందా అని ఎంతగానో ఎదురు చూశారు. చివరకు పదవి దక్కినా తన స్థాయికి, తన ఎదురు చూపులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆయన అనుకున్నా లేకున్నా.. ఆయనను అభిమానించే వారంతా బాధపడ్డారు. ఇప్పుడు మళ్లీ అలీలో ఆశల మొలకలు మొలిచే వార్త ఒకటి వైసీపీ సర్కిల్స్ లో జోరుగా ట్రెండ్ అవుతోంది. అదేమిటంటే.. సలహాదారు పదవితో సరిపెట్టేయకుండా జగన్ అలీకి వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఈ వార్తే వైసీపీ శ్రేణుల్లో హల్ చల్ చేస్తోంది. అలీ కూడా సీఎం జగన్ తనకు వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇస్తారన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

తన స్వస్థలమైన రాజమండ్రి నుంచి ఈ సారి అలీ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే అలీ ఇటీవల తరచూ రాజమండ్రి నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. చిన్నా పెద్దా అన్నతేడా లేకుండా ఎవరు పిలిచినా వెళుతున్నారు. చివరాఖరికి చిన్న చిన్న క్రికెట్ టోర్నీల ప్రారంభోత్సవాలకు కూడా అలీ రాజమండ్రిలో వాలిపోతున్నారు. అలాంటి సందర్భాలలో మీడియాతో మాట్లాడిన ప్రతి సారీ.. వచ్చే ఎన్నికలలో తాను పోటీ చేస్తానని ధీమాగా చెబుతున్నారు. అయితే రాజమండ్రి నుంచే పోటీ చేస్తానని మాత్రం చెప్పడం లేదు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తానని చెబుతున్నారు. అయితే అలీ గురించి తెలిసిన వారు ఆయన లోక్ సభ నియోజకవర్గానికి కాకుండా అసెంబ్లీకి పోటీలో దిగాలని భావిస్తున్నారని చెబుతున్నారు.

జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీ చేయడానికి కూడా సిద్ధమని అలీ గతంలో ప్రకటించిన సంగతిని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. అలీ ఇలా వైసీపీ అధినేత జగన్ ను మెప్పించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారనీ, ఎక్కువగా ప్రజలలో తిరుగుతూ, మీడియాతో మాట్లాడే సందర్భంగా పోటీ పట్ల తన ఆసక్తిని ఆయనకు తెలిసేలా చేస్తున్నారని అంటున్నారు. అయితే అలీ ఆశపడుతున్న విధంగా వచ్చే ఎన్నికలలో ఆయన పోటీ చేసే అవకాశం జగన్ ఇస్తారా? అన్న ప్రశ్నకు మాత్రం ఇప్పటి వరకూ జగన్ నుంచి అటువంటి స్పష్టమైన హామీ ఏదీ రాలేదనే సమాధానమే వస్తోంది.

ఇప్పటికే పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను నియమించిన జగన్ ఆయా నియోజకవర్గాలలో పార్టీ టికెట్ మీకే పని చేసుకోండని భుజం తట్టి మరీ ప్రోత్సహించారు. కానీ అలీకి మాత్రం ఇప్పటి వరకూ అటువంటి హామీ కానీ ప్రోత్సాహం కానీ లభించిన దాఖలాలు కనిపించడం లేదు.