Read more!

పతనం అంచున పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి!

పాకిస్థాన్ తీవ్రాతి తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అసలు మొదటి నుంచీ కూడా పాకిస్థాన్ దేశ ఆర్థిక ప్రగతిపై దృష్టి సారించలేదు. ఆ దేశం సైన్యం, ప్రభుత్వాలూ అన్నీ భారత్ పై ఆధిపత్యం సాధించడమెలా అన్న విషయంపైనే ఇప్పటి వరకూ తమ దృష్టిని కేంద్రీకరించాయి. ఈ కారణంగానే ఆ దేశం తేరుకోలేని విధంగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దూరదృష్టి లేని విధానాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది.  

ప్రస్తుతం పాకిస్థాన్‌ అనేకానేక సంక్షోభాల్లో కూరుకుపోయి ఉంది. ఒకదాని తర్వాత ఒకటిగా   కాదు. సంక్షోభాలన్నీ ఒక్కసారే చుట్టుముట్టి  దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిజం పాకిస్థాన్ ఇప్పుడు సంక్షోభ నివారణకు కూడా చర్యలు తీసుకునే దారి కనిపించక దైన్యంగా  మిగిలిపోయింది.  ఆ దేశఆర్థిక పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే ంత మేలు. ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే.. శ్రీలంకే పాక్ కంటే ఎన్నో రెట్లు నయం అనిపించక మానదు. ఇప్పడు ఈ ఆర్థిక సంక్షోభం నుంచి పాకిస్థాన్ బయటపడాలంటే.. ఆ దేశానికి బయట నుంచి భారీగా సాయం అందాల్సిందే.  ఆదుకోవాల్సిందిగా కోరుతూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్‌) సంస్థకు పాక్ విజ్ణప్తులు పరంపరగా కొనసాగిస్తోంది. ఎంఐఎఫ్ బృందం పాక్ లో పర్యటిస్తోంది.

ఆ దేశానికి ఆర్ధిక సహకారం అందించే విషయంలో ఎంఐఎఫ్ ప్రతినిథి బృందం  ఎంత వరకూ పాకిస్థాన్ కు సహకారం అందిస్తుందన్నది స్పష్ట లేకపోయినా. ఆర్థిక సహాయం అందించేందుకు ఆ సంస్థ విధిస్తున్న షరతులు మాత్రం    పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మెడకు ఉరితాళ్లుగా పరిణ మించాయి. 
 ఆర్థిక సహాయం చేయాలంటే తాము సూచించే పొదుపు సూత్రాలను, ఆంక్షలను పాక్‌ తప్పని సరిగా పాటించాల్సి ఉంటుందని  ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ప్రతినిధుల బృందం స్పష్టం చేసింది.  ఐ.ఎం.ఎఫ్‌ సూచించిన నియమ నిబంధనలను పాటించడానికి అంగీకరిస్తే.. పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కు దేశంలో ఇసుమంతైనా విలువ ఉండదనడంలో సందేహం లేదు.  

  గత ఏడాది చివర్లో పాకిస్థాన్లోని అనేక ప్రాంతాలను భీకర వరదలు, తుఫానులు చుట్టుముట్టి అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం దేశంలో గోధుమలకు కనీవినీ ఎరుగని కొరత ఏర్పడింది. నిత్యావసర వస్తువులకు   కొరతే. చివరికి విద్యుత్ ఉత్పత్తి కూడా సరిపడినంతగా లేదు.  దేశంలోని పలు  రాష్ట్రాలలో  విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విద్యుదుత్పత్తి సంస్థల  ఇంధనం కొనడానికి నిధులు నిండుకున్నాయి. విదేశీ మారక నిల్వలు   అడుగంటిపోయాయి.  
అనివార్య పరిస్థితుల్లో  ప్రభుత్వం గతవారం పెట్రోల్‌ డీజిల్‌ ధరలను పెంచాల్సి వచ్చింది.  దీంతో పెద్ద ఎత్తున  నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల అతికష్టం మీద యు.ఎ.ఇ నుంచి 300 కోట్ల డాలర్ల సహాయ ప్యాకేజీని పొందగలిగింది. అయితే, ఇందులో 200 కోట్ల డాలర్లను వస్తు రూపేణా చెల్లించడం జరుగుతుంది. దాంతో పాకిస్థాన్‌ కొద్దిగా తెరిపిన పడింది. కానీ, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. 

గతంలో 2019 ప్రాంతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వం ఐ.ఎం.ఐ నుంచి 6.5 వందల కోట్ల డాలర్ల సహాయం పొందగలిగింది. ఈ మొత్తాన్ని ఐ.ఎం.ఎఫ్‌ విడతలవారీగా చెల్లించడం ప్రారంభించింది. అయితే, తాము పెట్టిన నియమ నిబంధనలను పాకిస్థాన్‌ మధ్యలో గాలికి వదిలే సరికి ఆ సంస్థ ఈ రుణ సహాయాన్ని మధ్యలోనే ఆపేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధాని పదవి నుంచి దిగిపోయి, షరీఫ్‌ అధికారం చేపట్టిన తర్వాత ఈ రుణ సహాయాన్ని కొనసాగించడానికి ఐ.ఎం.ఎఫ్‌ ముందుకు వచ్చింది.

కానీ  ఇంకా నిర్ణయం తీసుకోలేదు.  అయితే పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న ఈ దుర్భర పరిస్థితికి సైన్యానిదే సింహభాగం బాధ్యతగా చెప్పుకోవాల్సి ఉంటుంది.   ఒక పక్క ఆర్థిక సమస్యలు, సంక్షోభాలతో దేశం అతలాకుతలం అవుతుండగా మరో పక్క పాకిస్థాన్‌ సైన్యం దేశంలోని ఉగ్రవాదులకు శిక్షణను, ఆర్థిక సహాయాన్ని నిరాకంటకంగా కొనసాగిస్తోంది. సుశిక్షితులైన ఉగ్రవాదులను భారత్‌లోకి పంపించడానికి అది మార్గాలు వెతుకుతూనే ఉంది.

అందుకే భారత్‌ సహాయంతో ఆర్థిక పరిస్థితిని కొంతవరకైనా చక్క బెట్టుకోవాలని షరీఫ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా సైన్యం తీరు కారణంగా ఆ ప్రయత్నాలు సఫలం కావడం లేదు.  పాకిస్థాన్లో ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆర్థికాభివృద్ధి మీద కాకుండా, ఉగ్రవాద పోషణ మీద దృష్టి పెట్టే పరిస్థితికి కారణం పాక్ సైన్యమేననడంలో సందేహం లేదు.  భారత్ తో స్నేహ సంబంధాలు వృద్ధి చెంది ఉంటే పాక్‌ ఇంత అధ్వాన స్థితిలో ఉండేది కాదని ఇమ్రాన్‌ ఖాన్‌, షరీఫ్ లు స్వయంగా అంగీకరించడమే ఇందుకు నిదర్శనం.