ప్రత్యర్ధులకు కూల్చివేతలు.. మనోళ్లకయితే ఎత్తిపోతలు
posted on Jul 10, 2021 @ 10:17AM
లల్లూ అంకుల్ మాలూమ్ హై తేరే కో..జయా ఆంటీ మాలూమ్ హై తేరేకో అంటూ అప్పట్లో ఖుషీ సినిమాలో డైలాగ్ ఇప్పటికీ అందరూ వాడేస్తుంటారు. విశాఖపట్నంలో మాత్రం ఈ డైలాగ్ వేరేగా నడుస్తుందంట. అదేంటంటే ‘‘సాయి అంకుల్ మాలూమ్ హై తేరే కో.. అవంతి ఆంటీ మాలూమ్ హై తేరే కో‘‘ అంటున్నారంట.. ఎవడైనా సరే. అధికారం మన జేబులో ఉంటే.. చట్టం మన చుట్టం కాదు..ఏకంగా పెళ్లాం అయిపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు విశాఖపట్నంలో వ్యవహారం.
వాళ్లు కబ్జా చేశారు.. వీళ్లు కబ్జా చేశారు..అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి మున్సిపల్ అధికారుల నుంచి కలెక్టరేట్ అధికారుల వరకు తన దగ్గరకు పిలిపించుకుని..ఎక్కడెక్కడకు వెళ్లాలి..ఏ యే నిర్మాణాలు కూల్చేయాలి.. ఎవరికీ నోటీసులివ్వాలి లాంటి పనులు డైరెక్టుగా చేస్తున్నారు. ఇక మంత్రి అవంతి అయితే తప్పు ఎవరు చేసినా తప్పు..ఇప్పుడాయనకు తెలియకపోవచ్చు.. వాళ్ల తాత తప్పుచేసి ఉండొచ్చు..అయినా తప్పే కదా..భూమి ఇచ్చేయాల్సిందే కదా అంటూ లాజిక్ వినిపించారు. ప్రత్యర్ధులను టార్గెట్ చేసి మరీ భూముల వేట కొనసాగిస్తున్నారు వైసీపీ నేతలు.అదేమంటే సర్కారు భూమిని కబ్జా చేస్తే వదిలేయాలా అని అడుగుతున్నారు.
ఇలాంటి పెద్దలు ఇప్పుడు రివర్స్ లో ఓ ఘనకార్యం పూర్తి చేశారు. హెటిరో డ్రగ్స్ .. ఈ పేరు అందరికీ తెలిసిందే. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి సీబీఐ కేసులు ఫాలో అయ్యేవరకు ఇంకా బాగా తెలుసు. అంటే మనోళ్లే అన్నమాట. అసలు ఆ ఛార్జిషీట్లలో పేరు ఉండటమే పెద్ద క్వాలిఫికేషన్.. అలాంటివారికి ప్రత్యేక పోస్టులు ఇస్తారు. అలాంటిది మళ్లీ మళ్లీ మేలు చేకూర్చే కంపెనీకి పెద్ద మేలు చేయకుండా ఉంటారా చెప్పండి.
అసలు విషయానికొస్తే హెటిరో డ్రగ్స్ కంపెనీకి నక్కపల్లి సెజ్ కింద 200 ఎకరాలు గతంలో కేటాయించారు.అయితే పక్కనున్న108 ఎకరాలను కూడా ఆక్రమించేశారు. ఇవన్నీ పక్కన ఉన్న గ్రామాల ప్రజలు వాడుకునేవి. దీనిపై ఎప్పటినుంచో గొడవ నడుస్తోంది. టీడీపీ హయాంలో ఈ 108 ఎకరాలు తమకే కేటాయించాలని అప్లికేషన్ కూడా పెట్టేశారు. కాని ముందే ఆక్రమించేసి..తర్వాత తమకు అధికారికంగా ఇచ్చేయమని అడగటం ఏంటని..అప్పట్లో విచారణ చేపట్టారు.
ప్రభుత్వం మారింది..అధికారంలో సొంత మనుషులు వచ్చేశారు.అందుకే పెద్దగా ఫాలోఅప్ చేయకుండానే ఇప్పుడు 40 కోట్ల విలువైన 80 ఎకరాలను 20 కోట్లకే కట్టబెట్టేశారు. ఆ కేటాయింపులో కూడా చాలా ఫ్లెక్సిబులిటీస్..ఫెసిలిటీస్ ఇచ్చేశారు. వాగులు,వంకలు వాడుకోవచ్చు..నీళ్లు వాడుకోవచ్చంటూ సెలవిచ్చేశారు.అదీ సంగతి. ప్రత్యర్ధులకైతే కూల్చివేతలు... మనోళ్లయితే ఎత్తిపోతలు అన్నట్లు నడిపిస్తున్నారు విజయసాయిరెడ్డి టీమ్ విశాఖపట్నంలో.