‘అమరావతి’ అనే పదం జగన్‌ని భయపెట్టింది!
posted on May 24, 2024 @ 3:32PM
ఆ ఒక్క పదం జగన్ని రూటు మార్చుకునేలా చేసింది. ఆ ఒక్క పదం తనకు ఉపయోగపడే విషయాన్ని కూడా వద్దనుకునేలా చేసింది. ఆ ఒక్క పదం జగన్‌కి దడ పుట్టించి దూరంగా పారిపోయేలా చేసింది.. ఆ ఒక్కపదం.. తెలుగువారందరికీ నచ్చుతుంది కానీ, జగన్‌కి మాత్రం ఎంతమాత్రం నచ్చదు.. ఆ ఒక్కపదం మరేదో కాదు... ‘అమరావతి’.
2019 ఎన్నికలలో జగన్ కోసం ఐప్యాక్ సంస్థ ఒక పాటను రూపొందించింది. ఆ పాట ‘రావాలి జగన్.. కావాలి జగన్.. మన జగన్’ అంటూ సాగుతుంది. జగన్ పాదయాత్ర చేసిన విజువల్స్.ని, ముసలమ్మల్ని ముద్దుపెట్టుకున్న విజువల్స్ మీద ఆ పాటను ప్లే చేస్తూ జనంలోకి వదిలారు. నిజం చెప్పాలంటే ఆ పాట చాలా పెద్ద హిట్ అయింది. 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించడానికి ఆ పాట కూడా కొంతవరకు ఉపయోగపడింది. నిజంగానే ఆ పాట ఒక సంచలనం. మరి అంత సంచలనంగా నిలిచిన ఆ పాట.. జగన్‌కి విజయాన్ని అందించడంలో తనవంతు భాగస్వామ్యం అందించిన ఆ పాట 2024 ఎలక్షన్ల ప్రచారంలో ఎందుకు వినిపించలేదో తెలుసా? దానికి ఒకే ఒక కారణం.. ఒకే ఒక పదం... ‘అమరావతి’!
‘రావాలి జగన్’ అనే పాటలో ఒక చోట ‘‘అమరావతి అంటున్నది.. ఆంధ్రావని అంటున్నది.. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, పలనాడు, అంటున్నవి.. రాయలసీమలో గడపా గడపా అంటున్నవి.. రావాలి జగన్.. కావాలి జగన్’’ అంటూ ఒక చరణం వుంటుంది. అమరావతిని ఎలాగూ జగన్ సర్వనాశనం చేసేశాడు కాబట్టి ఇక ఇంతటి వీరుణ్ణి రావాలని అమరావతి ఎందుకు అంటుంది? అందువల్ల ఆ పాటలో ‘అమరావతి అంటున్నది’ అనే మాట తీసేసి పాటని ప్రచారంలో ఉపయోగిద్దాం అని ఐప్యాక్ వాళ్ళు సూచించారట. అయితే ఆ పదం తీసేశారని అందరూ ట్రోల్ చేసే ప్రమాదం వుంది కాబట్టి జగన్ అసలు ఆ పాటనే వాడొద్దని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే ఆ పాటలో వాగ్దానాల మీద వాగ్దానాలు వినిపించారు. ఈ ఐదేళ్ళకాలంలో అవేవీ నెరవేరలేదు. ఇప్పుడు ఆ పాట వినిపిస్తే జనం నవ్వుకుంటారని, మొత్తమ్మీద ఆ పాటనే వద్దని అనుకున్నారని తెలుస్తోంది. మొత్తమ్మీద ‘అమరావతి’ రాజధానిగానే కాదు.. ఒక పదంగా కూడా జగన్‌ని భయపెట్టింది.