జూన్ 30 వరకూ ఆ మూడు రోజులూ వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
posted on May 24, 2024 @ 3:31PM
తిరుమలలో వేసవి రద్దీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేశస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. వచ్చే నెల 30వ తేదీ వరకూ శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
వేసవి రద్దీ తగ్గిన తరువాత యథావిధిగా ఈ రోజులలో కూడా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమతో సహకరించాలని పేర్కొంది. వేసవి సెలవులు కావడంతో దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల దేవుని దర్శనానికి తరలి వస్తున్నారు.
దీంతో వారాంతాలలోనే కాకుండా మామూలు రోజులలో కూడా భక్తుల తాకిడి అధికంగా ఉంటోంది. భక్తులు గంటల తరబడి క్యూలైన్ లో నిలుచోవలసి వస్తున్నది. టోకెన్లే లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొండపై బస దొరకడం కూడా భక్తులకు కష్టతరంగా మారింది. దీంతో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడంతో కనీసం వారాంతాలలోనైనా సామాన్య భక్తులకు ఒకింత వేగంగా శ్రీవారి దర్శనం దొరికేందుకు అవకాశం ఉంటుందని టీటీడీ భావిస్తోంది.