జగన్ జావగారి పోయారు.. చేతులెత్తేశారు!
posted on May 11, 2024 @ 12:57PM
సింహం సింగిల్ గానే వస్తుంది. ఎంత మంది కలిసినా వా వెంట్రుక కూడా పీకలేరు. వైనాట్ 175, అక్క చెల్లెమ్మలు, అవ్వా తాతలకు సంకేమం సొమ్ములు క్రమం తప్పకుండా బటన్ నొక్కి పంచాను. వాళ్లంతా నాకే ఓటేస్తారు. ఇవీ జగన్ నిన్నమొన్నటి దాకా గంభీరంగా చెప్పిన మాటలు. మరి ఆ ధైర్యం, స్థైర్యం ఏమైపోయాయో.. ఇప్పుడు బేలగా, దీనంగా మాట్లాడుతున్నారు. అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలకు మేళ్లు చేశానని సగర్వంగా చెప్పుకునే వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు జనం ముందుకు వచ్చి అందరూ కలిసి కుట్ర చేసి నన్ను ఓడించడానికి చూస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. కన్నీళ్లోక్కటే తక్కువ అన్నట్లుగా వేడుకుంటున్నారు. మూడు నెలల కిందటి వరకూ తెలుగుదేశం, జనసేన కలిసి వచ్చినా తనను కదిలించలేరనీ, ఆ పార్టీల అధినేతల ప్రజా విశ్వాసం కోల్పోయారనీ, తననేం పీకలేరని అన్న జగన్ ఇప్పుడు అదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను చూసి, వారి ప్రచారానికి వస్తున్న జనస్పందనను చూసి వణికిపోతున్నారు.
గతంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక సభలో మాట్లాడుతూ వైనాట్ కుప్పం? అని సవాల్ చేసిన జగన్ ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పులివెందులలో, సొంత జిల్లా కడపలో గట్టెక్కుతానా అన్న భయంతో గజగజలాడుతున్నారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ సమయంలో ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదంటూ ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారంటే చేతులెత్తేయడం కాక ఇంకేమిటనాలి.
అన్నిటికీ మించి ప్రజలు తనను మాత్రమే నమ్ముతున్నారన్న ధీమా వ్యక్తం చేసిన జగన్ ఇప్పుడు ప్రజలను నన్ను ఇంకొక్కసారి నమ్మండి ప్లీజ్ అని బతిమలాడుకుంటున్నారు. జగన్ ఇంతగా జావగారిపోవడం.. ఆ పార్టీలో గెలుపు ఆశలు ఉన్న కొద్ది మంది అభ్యర్థుల అవకాశాలను కూడా నీరుగార్చేస్తోంది. అధినేతే కాడి పారేసి, ఓటమిని అంగీకరిస్తున్నట్లుగా ప్రచార సభలలో మాట్లాడుతుంటే.. క్యాడర్ ఎలాగా ఓడిపోయే పార్టీకి ప్రచారం కూడా ఎందుకని సభలకు మొహం చాటే స్తున్నారు.
అంతే కాదు అభ్యర్థులు కూడా అధికారం అందదని పార్టీ అధినేతే చెప్పేస్తుంటే.. ఇంతోటి దానికి ప్రచారం కోసం డబ్బులు తగలెయ్యడం దేనికన్న భావనకు వచ్చి ప్రచారాన్ని పరిమితం చేసేశారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూటమి సభల హవాయే కనిపిస్తోంది తప్ప వైసీపీ ప్రచార హోరు వినిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఖర్చు పెట్టడం లేదంటూ.. పలు జిల్లాల నుంచి పార్టీ అధిష్ఠానానికి అందుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.