వల్లభనేని వంశీకి చంద్రబాబు ఇచ్చిన బిరుదేంటో తెలుసా?
posted on May 11, 2024 @ 12:17PM
వల్లభనేని వంశీ.. ఇటీవలి కాలంలో ప్రజలలో బాగా నానుతున్న పేరు. అదేదో ఆయన గొప్ప పనులు చేసేశారని కానీ, సమాజ సేవలో మునిగి తేలుతున్నరాన్న ప్రశంసలతో కానీ కాదు. అడ్డగోలు రాజకీయం, తిన్న ఇంటి వాసాలనే లెక్కపెట్టే నైజంపై వెల్లువెత్తుతున్న విమర్శల కాలంగా ఇటీవలి కాలంలో ఆయన పేరు ప్రజలలో బాగా చర్చకు వచ్చింది. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశి ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా గన్నవరం నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి రావడంతో ఆయన రెండో ఆలోచన లేకుండా ఆ పార్టీలోకి దూకేశారు. అలా దూకేసి ఊరుకోలేదు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీపై అవాకులూ చవాకులూ పేలారు. తెలుగుదేశం అధినేతపై, ఆయన సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి జడిసి ఆ తరువాత బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పినా, వల్లభనేని వంశీ పట్ల జనాగ్రహం తగ్గలేదు. అది ఆయన ఎన్నికల ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. సొమ్ములు తీసుకునీ, పోయించిన మద్యం తాగి వచ్చిన వారు కూడా మధ్యలోనే ఉడాయించారు.
అప్పటికి తత్వం బోధపడిన వంశీ ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటించి ఆకులు పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని కూడా జనం నమ్మలేదు. ఎందుకంటే వైసీపీ గూటికి చేరి, తెలుగుదేశం నాయకులు, క్యాడర్ పై ఆయన చేసిన దాష్టికాలు, దౌర్జన్యాలు, అనుచిత వ్యాఖ్యలకు తోడు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా సాగించిన గూండాగిరీని గన్నవరం ప్రజలు మరిచిపోవడానికి రెడీగా లేరు. అటువంటి వల్లభనేని వంశీకి చంద్రబాబు ఓ బిరుదు ఇచ్చారు. ఆయన ఇప్పటికే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ను సైకోకా అభివర్ణిస్తూ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా చంద్రబాబు గన్నవరంలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ వల్లభనేని వంశీని పిల్ల సైకోగా అభివ ర్ణించారు. అటువంటి గూండాలను అణచివేస్తానని స్పష్టంగా చెప్పారు. భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు గన్నవరం ర్యాలీలో పాల్గొనడం ప్రజల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అద్దం పడితే.. అంతటి భారీ వర్షంలోనూ పెద్ద సంఖ్యలో జనం చంద్రబాబు ప్రసంగం వినడానికి తడిసిముద్దౌతూ కూడా కదలకుండా నిలబడి ఉండటం జనంలో ఆయన పట్ల ఉన్న నమ్మకానికీ విశ్వసనీయతకూ తార్కానంగా నిలుస్తుంది.